Published : 13 May 2022 02:32 IST

Google Pixel: గూగుల్ కొత్త ఉత్పత్తులు.. పిక్సెల్ 7 సిరీస్‌, స్మార్ట్‌ వేరబుల్స్‌.. ఇంకా!

(Photo Credit: Google)

ఇంటర్నెట్‌డెస్క్‌: గూగుల్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సమయం వచ్చేసింది. గూగుల్‌ యాన్యువల్ డెవలపర్స్‌ కాన్ఫరెన్స్‌ గూగుల్ ఐ/ఓ 2022 (Google I/O)లో సరికొత్త ఉత్పత్తులను పరిచయం చేసింది. ఈ జాబితాలో గూగుల్ పిక్సెల్‌ 6ఏ (Google Pixel 6a), గూగుల్ పిక్సెల్‌ 7 (Google Pixel 7) స్మార్ట్‌ఫోన్లతోపాటు గూగుల్ పిక్సెల్‌ వాచ్ (Google Pixel Watch)‌, గూగుల్ పిక్సెల్‌ ట్యాబ్లెట్ (Google Pixel Tablet), గూగుల్ పిక్సెల్ బడ్స్‌ ప్రో (Google Pixel Buds Pro) ఉన్నాయి. మరి వీటిలో ఎలాంటి ఫీచర్లున్నాయి.. ధరెంత?ఎప్పటి నుంచి అమ్మకాలు ప్రాంభమవుతాయనేది తెలుసుకుందాం. 


గూగుల్ పిక్సెల్‌ 6ఏ (Google Pixel 6a)

ఈ ఫోన్‌ ఆండ్రాయిడ్ 12 ఓఎస్‌తో పనిచేస్తుంది. 60 హెర్జ్‌ రిఫ్రెష్ రేట్‌తో 6.1-అంగుళాల ఫుల్‌ హెచ్‌డీ+ ఓఎల్‌ఈడీ డిస్‌ప్లే ఇస్తున్నారు. దీనికి కార్నింగ్ గొరిల్లా గ్లాస్‌ 3 ప్రొటెక్షన్ ఉంది. ఆక్టాకోర్‌, గూగుల్ సంయుక్తంగా అభివృద్ధి చేసిన టెన్సర్‌ ప్రాసెసర్‌ను ఉపయోగించారు. ఫోన్‌ భద్రత కోసం టైటాన్‌ ఎమ్‌2 సెక్యూరిటీ ప్రాసెసర్‌ కూడా ఇస్తున్నారు. 

పిక్సెల్‌ 6ఏలో మొత్తం మూడు కెమెరాలున్నాయి. వెనుక రెండు, ముందు ఒక కెమెరా అమర్చారు. వెనకువైపు రెండు 12 ఎంపీ కెమెరాలు, వీడియో కాలింగ్, సెల్ఫీల కోసం ముందు 8 ఎంపీ కెమెరా ఇస్తున్నారు. వెనుకవైపు కెమెరాలతో 4K క్వాలిటీ వీడియోలను రికార్డు చేయొచ్చని గూగుల్ తెలిపింది. ఫోన్‌లోని 4,410 ఎమ్‌ఏహెచ్‌ బ్యాటరీ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. 6 జీబీ ర్యామ్‌/128 జీబీ ఇంటర్నల్‌ స్టోరేజ్‌ వేరియంట్‌లో లభిస్తుంది. 

అమెరికన్‌ మార్కెట్లో దీని ధర 449 డాలర్లు (సుమారు ₹ 34,700)గా గూగుల్ నిర్ణయించింది. జూన్‌ 21 నుంచి అమెరికన్‌ మార్కెట్లో ఈ ఫోన్ ముందస్తు బుకింగ్స్‌ ప్రారంభంకానున్నాయి. త్వరలోనే భారత సహా ఇతర అంతర్జాతీయ మార్కెట్లో పిక్సెల్‌ 6ఏను విడుదల చేయనున్నట్లు గూగుల్ ఒక ప్రకటనలో తెలిపింది. 


గూగుల్ పిక్సెల్ 7 (Google Pixel 7)

పిక్సెల్ 7 సిరీస్‌లో రెండు మోడల్స్‌ను తీసుకొస్తున్నట్లు గూగుల్ వెల్లడించింది. పిక్సెల్‌ 7, పిక్సెల్‌ 7 ప్రో పేర్లతో పరిచయం చేయనున్న ఫోన్లలో గూగుల్ తర్వాతి తరం టెన్సర్‌ ప్రాసెసర్ ఉపయోగించనున్నట్లు వెల్లడించింది. ఇవి ఆండ్రాయిడ్ 13 ఓఎస్‌తో పనిచేస్తాయి. పిక్సెల్‌ 7 మోడల్‌లో 90 హెర్జ్‌ రిఫ్రెష్‌ రేట్‌తో 6.3-అంగుళాల డిస్‌ప్లే, పిక్సెల్‌ 7 ప్రోలో 120 హెర్జ్‌ రిఫ్రెష్‌ రేట్‌తో 6.7-అంగుళాల అమోలెడ్‌ డిస్‌ప్లే ఇస్తున్నారు. 

అయితే డిజైన్‌ పరంగా ఈ ఫోన్‌లో స్వల్ప మార్పులు చేసినట్లు తెలుస్తోంది. వెనుకవైపు కెమెరా మాడ్యూల్‌ను పిక్సెల్‌ 6ఏలో మాదిరి గ్లాస్‌ మెటీరియల్‌తో కాకుండా పిక్సెల్‌ 7 సిరీస్‌లో అల్యూమినియమం మెటీరియల్‌తో డిజైన్‌ చేశారు. పిక్సెల్‌ 7లో వెనుకవైపు 50 ఎంపీ, 12 ఎంపీ కెమెరాలు, పిక్సెల్‌ 7 ప్రోలో  50ఎంపీ, 12ఎంపీ కెమెరాలతోపాటు అదనంగా 48 ఎంపీ టెలీఫొటో కెమెరా అమర్చారు. ధర, బ్యాటరీ గురించిన వివరాలు తెలియాల్సి ఉంది. ఈ ఏడాది చివర్లో వీటిని మార్కెట్లో విడుదల చేయనున్నట్లు గూగుల్ తెలిపింది.  


గూగుల్ పిక్సెల్ వాచ్‌ (Google Pixel Watch)

గూగుల్ నుంచి వస్తోన్న తొలి స్మార్ట్‌వాచ్‌. స్టెయిన్‌లెస్‌ స్టీల్ మెటీరియల్‌తో పిక్సెల్‌ వాచ్‌ను తయారుచేశారు. గుండ్రటి డయల్‌, ఆకట్టుకునే డిజైన్‌తో రూపుదిద్దుకున్న ఈ వాచ్‌ గూగుల్ వేర్‌ ఓఎస్‌తో పనిచేస్తుంది. గూగుల్ అసిస్టెంట్ సపోర్ట్‌, గూగుల్ మ్యాప్స్‌, గూగుల్ వాలెట్ వంటి యాప్స్‌తోపాటు ఎన్‌ఎఫ్‌సీ పేమెంట్స్‌ను సపోర్ట్ చేస్తుంది. హార్ట్‌రేట్‌, స్లీప్‌ ట్రాకింగ్‌ వంటి ఫీచర్లతోపాటు మరెన్నో హెల్త్‌, ఫిట్‌నెస్‌ ఫీచర్లు ఇందులో ఉన్నాయి. ఈ ఏడాది చివర్లో గూగుల్‌ పిక్సెల్‌ వాచ్‌ను మార్కెట్లోకి విడుదల చేయనున్నట్లు సమాచారం. 


గూగుల్ పిక్సెల్‌ ట్యాబ్లెట్ (Google Pixel Tablet)

గూగుల్ నుంచి వస్తోన్న మరో ఆకర్షణీయమైన ఉత్పత్తి పిక్సెల్ ట్యాబ్లెట్‌. ఈ ట్యాబ్‌ ఆండ్రాయిడ్ 13 ఓఎస్‌తో పనిచేస్తుంది. ఇందులో కూడా టెన్సర్‌ ప్రాసెసర్‌ను ఉపయోగించారు. వెనుక వైపు, ముందు భాగంలో ఒక్కో కెమెరా ఉన్నాయి. ఈ ట్యాబ్‌కు సంబంధించి డిస్‌ప్లే, బ్యాటరీ, ర్యామ్‌, స్టోరేజ్‌ వివరాలు తెలియాల్సి ఉంది.  


గూగుల్ పిక్సెల్ బడ్స్‌ ప్రో (Google Pixel Buds Pro)

స్మార్ట్‌ గ్యాడ్జెట్స్‌ శ్రేణిలో గూగుల్ పరిచయం చేసిన మరో ప్రొడక్ట్ గూగుల్ ఇయర్‌బడ్స్‌. పిక్సెల్ బడ్స్‌ ప్రో పేరుతో తీసుకొస్తున్న ఈ ఇయర్‌బడ్స్‌లో సైలెంట్‌ సీల్ సాంకేతికతతో యాక్టివ్ నాయిస్‌ క్యాన్సిలేషన్‌ (ఏఎన్‌సీ) ఫీచర్‌ ఇస్తున్నారు. వీటిని ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే ఏఎన్‌సీ ఫీచర్‌తో ఏడు గంటలపాటు, ఏఎన్‌సీ ఫీచర్‌ లేకుండా 11 గంటలపాటు పనిచేస్తాయని గూగుల్ తెలిపింది. అమెరికన్‌ మార్కెట్‌లో పిక్సెల్ బడ్స్‌ ప్రో ప్రారంభ ధర 199 డాలర్లు (సుమారు ₹ 15,000). ఈ ఏడాది చివర్లో భారత మార్కెట్లోకి విడుదల చేయనున్నట్లు సమాచారం. 

Read latest Technology News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని