Google Maps: గూగుల్ మ్యాప్స్‌ కొత్త ఫీచర్‌.. టోల్ ప్లాజాలో డబ్బులు ఆదా!

ప్రముఖ సెర్చ్‌ ఇంజిన్‌ గూగుల్‌ మ్యాప్స్‌ మరో కొత్త అప్‌డేట్‌తో యూజర్ల ముందుకు తీసుకు రానుంది.

Updated : 13 Aug 2022 12:21 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రముఖ సెర్చ్‌ ఇంజిన్‌ గూగుల్‌ మ్యాప్స్‌ మరో కొత్త అప్‌డేట్‌తో యూజర్ల ముందుకు రానుంది. మనం వెళ్లే రూట్లలో ఎక్కడైనా టోల్ ప్లాజాలు ఉన్నాయా? అక్కడి టోల్‌ రేట్లు ఏంటి? అనే వివరాలను తెలియజేసేలా కొత్త ఫీచర్‌ను తీసుకురానుంది. దీంతో మనం ప్రయాణం ప్రారంభించడానికి ముందే టోల్‌ ప్లాజాల్లో కట్టే మొత్తాన్ని తెలుసుకోవచ్చు. అంతేకాదు ఎక్కువ టోల్‌ చెల్లించే అవసరం లేకుండా మరో రూట్‌ ఏదైనా ఉందా? అనే వివరాలను సైతం తెలుసుకొని  రూట్‌ మార్చుకునే వెసులుబాటును గూగుల్‌ మ్యాప్స్‌ అందించనుంది.

గూగుల్‌ మ్యాప్స్‌ తీసుకువచ్చే కొత్త ఫీచర్‌తో టోల్‌ గేట్లు ఉన్న రూట్లతో పాటు లేని రూట్లను యూజర్లు ఎంచుకోవచ్చు. ‘‘ఈ కొత్త ఫీచర్‌ సాయంతో టోల్‌ గేట్లలో తాజా ధరల సమాచారాన్ని తెలుసుకోవచ్చు. టోల్‌ రేట్లను ముందుగానే అంచనా వేసుకొని సులువుగా ప్రయాణం కొనసాగించవచ్చు’’ అని గూగుల్‌ ఒక ప్రకటనలో పేర్కొంది.


ఎలా ఎంచుకోవాలి?

ఈ కొత్త ఫీచర్‌ విడుదలయ్యాక గూగుల్‌ మ్యాప్స్‌లోకి వెళ్లి పైభాగంలో కుడివైపున ఉన్న త్రీ డాట్స్‌ మెనూ ఆప్షన్‌పై క్లిక్‌ చేయాలి. అందులో రూట్‌ ఆప్షన్‌ను సెలెక్ట్‌ చేసుకొని ‘అవైడ్‌ టోల్స్‌’ అనే ఆప్షన్‌ను ఎంచుకోవాల్సి ఉంటుంది. 


ఐఫోన్‌, యాపిల్‌ వాచ్‌ల్లోనూ..

గూగుల్ మ్యాప్స్‌ ద్వారా మెరుగైన నావిగేషన్‌ను ఐఫోన్, యాపిల్‌ వాచ్ యూజర్లకు గూగుల్ అందుబాటులోకి తీసుకురానుంది. ఇందుకోసం మ్యాప్స్‌లో యాపిల్‌ ఇకోసిస్టమ్‌ యూజర్‌ ట్రిప్‌లకు సంబంధించి ప్రత్యేక విడ్జెట్‌ను యాపిల్‌ వాచ్‌ నుంచి చూపిస్తుంది. సిరి వాయిస్‌ అసిస్టెంట్ సాయంతో డైరెక్ట్‌గా గూగుల్ మ్యాప్స్‌ నావిగేషన్‌ను పొందే సౌకర్యాన్ని కూడా ఈ అప్‌డేట్‌లో యూజర్లకు అందుబాటులోకి తీసుకురానుంది.

యాపిల్‌ వాచ్‌ యూజర్లు ఇకపై ఐఫోన్‌ ఉపయోగించకుండా నేరుగా వాచ్‌లోనే గూగుల్‌ మ్యాప్స్ నావిగేషన్స్‌ను ఓపెన్‌ చేసుకోవచ్చు. అంతేకాకుండా యూజర్లు తమ వాచ్‌కి ‘టేక్‌ మీ హోమ్‌’ కాంప్లికేషన్‌ను గూగుల్ మ్యాప్స్‌లో నావిగేట్ చేసుకోవచ్చని గూగుల్ తెలిపింది. 

అయితే, గూగుల్ మ్యాప్స్‌ ఈ కొత్త అప్‌డేట్‌ను ఈ నెలలోనే విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. భారత్, అమెరికా, జపాన్, ఇండోనేషియాతో సహా పలు దేశాల్లో ఈ ఫీచర్‌ అందుబాటులోకి రానుంది. యూజర్లు కొత్త ఫీచర్‌ను పొందేందుకు గూగుల్‌ మ్యాప్స్‌ లేటెస్ట్ వెర్షన్‌కి అప్‌డేట్ చేసుకోవాల్సి ఉంటుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని