గూగుల్ కొత్త ఫీచర్స్.. ఇక మ్యాప్స్‌ ప్రాంతీయం

 గూగుల్ కంపెనీ యూజర్స్‌కి మెరుగైన సేవలు అందించేందుకు సిద్ధమవుతోంది. ఈ మేరకు గూగుల్ మ్యాప్స్‌లో కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది. దీంతో మ్యాప్స్‌‌ ఉపయోగించేప్పుడు వీధులు, ఇతర ప్రాంతాల పేర్లను 10 ప్రాంతీయ భాషల్లో తర్జుమా చేసి చూపిస్తుంది.... 

Published : 28 Jan 2021 23:45 IST

ఇంటర్నెట్ డెస్క్‌: యూజర్స్‌కి మెరుగైన సేవలు అందించేందుకు గూగుల్‌ సిద్ధమవుతోంది. ఇందుకోసం తన మ్యాప్స్‌లో కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది. మ్యాప్స్‌ ఉపయోగించేప్పుడు వీధులు, ఇతర ప్రాంతాల పేర్లను 10 ప్రాంతీయ భాషల్లో తర్జుమా చేసి చూపిస్తుంది. దాని వల్ల యూజర్స్ సొంత భాషలో తాము వెళ్లాల్సిన ప్రదేశాలకు సంబంధించిన సమాచారం సులభంగా తెలుసుకుంటారని గూగుల్ తెలిపింది. ప్రస్తుతం ఈ ఫీచర్‌ హిందీ, బెంగాలీ, మరాఠీ, తెలుగు, తమిళం, గుజరాతీ, కన్నడ, మలయాళం, పంజాబీ, ఒడియా భాషల్లో అందుబాటులో ఉంది. దీని కోసం యూజర్స్ గూగుల్ మ్యాప్స్‌ యాప్‌లో సెట్టింగ్స్‌లోకి వెళ్లి నచ్చిన భాషను ఎంచుకోవచ్చు.  

దీనిపై గూగుల్ మ్యాప్స్‌ సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్ సిబు జానీ మాట్లాడుతూ ‘‘భారత్‌లో ప్రదేశాల పేర్లను ఆంగ్లంతో పాటు కొన్నిసార్లు ప్రాంతీయ భాషల్లో కూడా రాస్తుంటారు. అయితే మాతృభాషలో రాసేటప్పుడు ఒకలా.. ఆంగ్లంలో మరోలా ఉండటంతో వాటిని రాయటంలో, వాడుక భాషలో ఉపయోగించేప్పుడు రెండింటికీ మధ్య వ్యత్యాసం ఉంటుంది. దాని వల్ల కొన్ని సార్లు యూజర్స్‌కి సరైన సమాచారం అందడంలేదు. అయితే ఈ కొత్త ఫీచర్‌తో యూజర్స్‌ మ్యాప్స్‌ ఉపయోగించేప్పుడు తమ మాతృభాషలో కూడా కచ్చితమై సమాచారం దొరుకుతుంది’’ అని తెలిపారు. ఇప్పటికే చాలా వరకు ప్రముఖ ప్రదేశాలకు ప్రాంతీయ భాషల్లో పేర్లు వచ్చేలా మార్పులు చేశారు. 

గూగుల్ డాక్స్‌ 

గూగుల్‌ డాక్స్‌లోనూ మరో కొత్త ఫీచర్‌ని గూగుల్‌ పరిచయం చేసింది. ఆఫీస్‌లో బృందంతో కలిసి పనిచేస్తున్నప్పుడు మనం అందుబాటులో లేకపోతే ఇతరులకు తెలిసేలా డాక్స్‌లో పాప్‌-అప్‌ మెసేజ్‌ కనిపిస్తుంది. ఉదాహరణకు మీరు సెలవులో ఉన్నారు. ఆ విషయం తెలియక మీకు పని అప్పగించడానికి కామెంట్‌ సెక్షన్‌లో మీ పేరు టైప్ చేయగానే కింద పాప్‌-అప్‌ మెసేజ్‌లో మీరు అందుబాటులో లేరనే విషయం తెలుస్తుంది. ప్రస్తుతం ఈ ఫీచర్‌ కొద్ది మందికి మాత్రమే అందుబాటులోకి తీసుకొచ్చారు. ఫిబ్రవరి 15 నుంచి ఎంపిక చేసిన ప్రాంతాల్లో, మార్చి నుంచి పూర్తి స్థాయిలో అందరికీ అందుబాటులోకి తీసుకురానున్నట్లు గూగుల్ తన బ్లాగ్‌లో పేర్కొంది.

ఇవీ చదవండి.. 

గూగుల్ మ్యాప్స్‌లో ఫీచర్‌.. పిన్ చేస్తే చాలు

ఆ ఫోన్లలో గూగుల్ డ్యుయో సేవలు బంద్‌..

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని