Google: ఆన్‌లైన్‌లో వ్యక్తిగత సమాచారం.. ఇకపై తొలగించడం చాలా సులువు!

గూగుల్ సెర్చ్‌ యూజర్‌ వ్యక్తిగత సమాచారాన్ని సులువుగా తొలగించేందుకు గూగుల్ కొత్త ఫీచర్‌ను తీసుకొస్తుంది. ఇంతకీ, ఈ ఫీచర్‌ ఏంటి? ఇది ఎలా పనిచేస్తుందో చూద్దాం...

Updated : 24 Sep 2022 11:17 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రపంచ జనాభాలో మిలీనియల్స్‌, జెడ్‌ జనరేషన్‌ నుంచి ప్రస్తుత అల్ఫా జనరేషన్‌ వరకు ఎక్కువ మంది డిజిటల్‌ లైఫ్‌కు అలావాటు పడిన వారే. సోషల్‌ మీడియా, ఆన్‌లైన్‌ షాపింగ్‌, బ్యాంకింగ్‌, మెడికేర్‌.. ఇలా ప్రతి అవసరానికి యాప్‌ లేదా వెబ్‌సైట్‌ ఉపయోగిస్తూనే ఉంటాం. అంతేకాదు, ఆయా సంస్థల సేవలను వినియోగించుకునేందుకు వాటిలో మన వ్యక్తిగత సమాచారం షేర్‌ చేస్తుంటాం. యూజర్‌ షేర్ చేసే వ్యక్తిగత సమాచారం విషయంలో గోప్యత పాటిస్తున్నామని కంపెనీలు చెబుతున్నాయి. కానీ, కొన్ని మినహా దాదాపు అన్ని కంపెనీలు యూజర్‌  సమాచారాన్ని థర్డ్‌-పార్టీలతో షేర్‌ చేస్తున్నాయనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో గూగుల్ యూజర్ల కోసం ‘రిజల్ట్‌ అబౌట్‌ యూ’ (Result About You) అనే ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకురానుంది. ఈ ఫీచర్‌తో గూగుల్‌ బ్రౌజర్‌ ద్వారా షేర్‌ చేసిన యూజర్ వ్యక్తిగత సమాచారాన్ని తొలగించవచ్చు. దీంతో యూజర్‌ వ్యక్తిగత సమాచారం ఇతరులు సేకరిస్తారనే ఆందోళన తగ్గుతుంది. 

గతంలో కూడా ఇదే తరహా ఫీచర్‌ అందుబాటులో ఉన్నా, తొలగింపు ప్రక్రియ మాత్రం అంత సులువు కాదు. యూజర్‌ తన ఫోన్‌ నంబర్‌, అడ్రస్, బ్యాంకింగ్‌ వివరాలు వంటివి ఆన్‌లైన్‌లో ఉన్నట్లు గుర్తిస్తే, ముందుగా గూగుల్ సపోర్ట్ పేజ్‌కి వెళ్లాలి. అందులో వివరాలు తొలగించాల్సిన యూఆర్‌ఎల్‌లో సమాచారంతోపాటు ఫామ్‌ పూర్తి చేసి గూగుల్‌కు సబ్‌మిట్ చేయాలి. యూజర్‌ అభ్యర్థనను పరిశీలించి, విచారణ జరిపిన అనంతరం గూగుల్ చర్యలు చేపడుతుంది. ఈ ప్రక్రియకు చాలా రోజుల సమయం పడుతుండటంతో యూజర్లు సమాచార గోప్యతపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనికి పరిష్కారంగా గూగుల్ రిజల్ట్ అబౌట్‌ యూ ఫీచర్‌ను తీసుకొస్తోంది. 

ఇందులో యూజర్‌ తన సమాచారం ఉందని భావిస్తున్న యూఆర్‌ఎల్‌ పక్కనే ఉన్న మూడు చుక్కలపై క్లిక్ చేయాలి. తర్వాత ఆప్షన్లలో అబౌట్‌ దిస్‌ రిజల్ట్‌ (About This Result) అనే పేజ్‌ ఓపెన్ అవుతుంది. అందులో రిమూవ్ రిజల్ట్‌ (Remove Result) అనే ఆప్షన్‌పై క్లిక్ చేస్తే సదరు వెబ్‌సైట్‌ నుంచి మీ సమాచారం తొలగించే ప్రక్రియను ప్రారంభిస్తుంది. యూజర్‌ అభ్యర్థన పూర్తయిందా? లేదా? అని తెలుసుకునేందుకు ఇందులో ట్రాకింగ్ సదుపాయం కూడా ఉంది. దీనికోసం గూగుల్ యాప్‌ ఓపెన్ చేసి ప్రొఫైల్‌ ఫొటోపై క్లిక్ చేస్తే రిజల్ట్‌ అబౌట్‌ యూ ఫీచర్‌ కనిపిస్తుంది. దాన్ని ఓపెన్ చేసి మీ అభ్యర్థన పూర్తయిందా? లేదా? అని తెలుసుకోవచ్చు. ఈ ఫీచర్‌ ఎప్పటిలోగా యూజర్లకు అందుబాటులోకి వస్తుందనే దానిపై స్పష్టమైన సమాచారం లేదు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని