Google RCS: భారత్‌లో ఆర్‌సీఎస్‌ మెసేజింగ్ సేవలు నిలిపివేసిన గూగుల్.. కారణమిదే!

గూగుల్ రిచ్‌ కమ్యూనికేషన్‌ సర్వీసెస్‌ (ఆర్‌సీఎస్‌) సేవలను భారత్‌లో నిలిపివేయనున్నట్లు సమాచారం. అయితే ఇది తాత్కాలిక నిర్ణయమేనని, ఆర్‌సీఎస్‌ను మరింత మెరుగుపరిచి, ఈ సేవలను పునరుద్ధరిస్తామని గూగుల్ వెల్లడించింది.

Published : 07 Jun 2022 02:36 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: గత నెలలో జరిగిన వరల్డ్‌వైడ్‌ డెవలపర్స్‌ కాన్ఫరెన్స్‌ 2022 (డబ్ల్యూడబ్ల్యూడీసీ 2022)లో ఎస్సెమ్మెస్‌ ఫీచర్‌లో మార్పులు చేయనున్నట్లు గూగుల్ వెల్లడించింది. ఈ సేవలకు సంబంధించి యూజర్లకు మెరుగైన సేవలు అందించేందుకు గూగుల్ రిచ్‌ కమ్యూనికేషన్‌ సర్వీసెస్‌ (ఆర్‌సీఎస్‌)ను ఉపయోగించనున్నట్లు తెలిపింది. దీంతో సాధారణ మెసేజ్‌లకు కూడా ఎండ్‌-టు-ఎండ్‌ ఎన్‌క్రిప్షన్‌ భద్రత ఉంటుందని ఈ సందర్భంగా వెల్లడించింది. 

తాజా సమాచారం ప్రకారం గూగుల్ ఆర్‌సీఎస్‌ సేవలను భారత్‌లో నిలిపివేయనుందట. ఆర్‌సీఎస్‌తో పలు వ్యాపార సంస్థలు, వ్యక్తులు యూజర్లకు మోసపూరితమైన ప్రకటనలతో కూడిన వెబ్‌ లింక్స్‌తోపాటు, గూగుల్ పాలసీకి విరుద్ధంగా ప్రమోషనల్‌ మెసేజ్‌లు పంపుతున్నట్లు గుర్తించింది. దీంతో ఆర్‌సీఎస్‌ సేవలను తాత్కాలికంగా నిలిపివేయనున్నట్లు గూగుల్ ఒక ఆంగ్ల టెక్నాలజీ వెబ్‌సైట్‌కు తెలిపింది. ఒకవేళ ఇప్పటికీ ఆర్‌సీఎస్‌ ద్వారా ప్రకటనలు వస్తుంటే యూజర్లు గూగుల్ మెసేజింగ్ యాప్‌లోని చాట్ ఫీచర్స్‌ను డిసేబుల్ చేయడం మేలని టెక్ నిపుణులు సూచిస్తున్నారు. 

ఆర్‌సీఎస్‌ ద్వారా ఆయా సంస్థలు యూజర్లకు ట్రావెల్ టికెట్స్‌ వంటి వాటితోపాటు గతంలో యూజర్లు కొనుగోలు చేసిన ఉత్పత్తుల ఆధారంగా కొత్త ఉత్పత్తులకు సంబంధించిన వెబ్‌ లింక్స్‌ను పంపుతుంటాయి. అయితే కొద్ది వారాలుగా ఆర్‌సీఎస్‌ ద్వారా స్పామ్‌ లింక్‌లు కూడా యూజర్లకు పంపుతుండటంతో ఆర్‌సీఎస్‌ సేవలను నిలిపివేసింది. అయితే ఇది తాత్కాలిక నిర్ణయమేనని, ఆర్‌సీఎస్‌ను మరింత మెరుగుపరిచి, ఈ సేవలను పునరుద్ధరిస్తామని గూగుల్ వెల్లడించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని