Google Play Pass: భారత్‌లోకి గూగుల్‌ కొత్త సర్వీస్‌.. యాడ్స్‌ లేకుండా వెయ్యికిపైగా యాప్స్‌

గూగుల్ కంపెనీ మరో సర్వీస్‌ను భారతీయ యూజర్లకు అందుబాటులోకి తీసుకొచ్చింది. మరి ఈ సబ్‌స్క్రైబ్‌ ఆధారిత సర్వీస్‌ గురించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం. 

Published : 01 Mar 2022 02:08 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: గూగుల్‌ (Google) కంపెనీ మరో కొత్త సర్వీస్‌ను భారత్‌లోని ఆండ్రాయిడ్ యూజర్లకు అందుబాటులోకి తీసుకొచ్చింది. గూగుల్ ప్లే పాస్‌ (Google Play Pass) పేరుతో తీసుకొచ్చిన ఈ సర్వీస్‌ ద్వారా యూజర్లు ప్రకటనలు (Ads), ఇన్‌-యాప్‌ కొనుగోళ్లు (In-App Purchases) లేకుండా యాప్స్‌, గేమ్స్‌ను ఉపయోగించుకోవచ్చు. ఇది సబ్‌స్క్రిప్షన్‌ ఆధారిత సర్వీస్‌. యూజర్లు నెలవారీ లేదా ఏడాదిపాటు గూగుల్ ప్లే పాస్‌కు సబ్‌స్క్రైబ్ చేసుకోవాలి. ప్లే పాస్‌ నెలవారీ సబ్‌స్క్రిప్షన్‌ ధర రూ. 99 కాగా, ఏడాదికి రూ. 899గా గూగుల్ నిర్ణయించింది. ప్రీపెయిడ్‌ తరహాలో ప్లే పాస్‌ ఉపయోగించుకోవాలనుకునే యూజర్లు నెలకు రూ. 109 చెల్లించాల్సి ఉంటుంది. గూగుల్‌ ఫ్యామిలీ గ్రూప్‌ యూజర్లు తమ ప్లే పాస్‌ సబ్‌స్క్రిప్షన్‌ను మరో ఐదుగురు యూజర్లతో షేర్‌ చేసుకోవచ్చు.

ప్రస్తుతం ప్లే పాస్‌ 90 దేశాల్లోని యూజర్లకు అందుబాటులో ఉంది. మార్చి మొదటి వారం నుంచి భారతీయ యూజర్లకు అందుబాటులోకి రానుంది. దీని కోసం గూగుల్ ప్లే స్టోర్‌లోకి వెళ్లి సెర్చ్‌లో ప్లే పాస్‌ అని టైప్‌ చేయాలి. తర్వాత సబ్‌స్క్రైబ్‌ చేసుకుని గేమ్స్‌, యాప్స్‌ను వినియోగించుకోవచ్చు. గూగుల్ ప్లే పాస్‌ ద్వారా 59 దేశాలకు చెందిన డెవలపర్స్ రూపొందించిన 41 కేటగిరీలకు చెందిన 1000కి పైగా యాప్స్‌, గేమ్స్‌ను యూజర్స్‌ వినియోగించవచ్చు. ఇందులో జంగిల్‌ అడ్వెంచర్స్‌, వరల్డ్‌ క్రికెట్ బ్యాటిల్‌ 2, క్రియేటివ్‌ మంకీ గేమ్స్‌ వంటి భారతీయ డెవలపర్స్‌కు చెందిన 15 యాప్స్‌ ఉన్నట్లు గూగుల్ వెల్లడించింది.

యూజర్లకు మెరుగైన సేవలందించడంలో భాగంగా భవిష్యత్తులో మరిన్ని గేమ్స్‌, యాప్స్‌ను ప్లే పాస్‌లో అందుబాటులోకి తీసుకొస్తామని గూగుల్ పేర్కొంది. గూగుల్ ప్లే పాస్‌లో యాప్‌ను పరిచయం చేయాలనుకునే డెవలపర్స్‌ తమ యాప్‌ పేరును ప్లే పాస్‌  వెబ్‌ పేజ్‌ నుంచి నమోదు చేయవచ్చని గూగుల్ తెలిపింది. యాపిల్‌ కూడా ఆర్కెడ్‌ పేరుతో ఇదే తరహా సేవల్ని యూజర్లకు అందిస్తుంది. దీని ద్వారా ఐఫోన్‌, ఐపాడ్, ఐపోడ్‌ టచ్‌, మ్యాక్‌, యాపిల్‌ టీవీ యూజర్లు ప్రకటనలు లేకుండా యాప్స్‌, గేమ్స్‌ను వినియోగించవచ్చు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని