Google: నవ మాయా దర్పణం

మీరు ఓ మాయా దర్పణాన్ని చూస్తున్నారని ఊహించుకోండి. అందులో ఎక్కడో దూరంగా ఉన్న తండ్రి ప్రత్యక్షమయ్యారు. ఆయనను ఆ గదిలోనే నిజంగా చూస్తున్నట్టే అనిపించింది. కళ్లలోకి కళ్లు పెట్టి చూస్తూ, హావభావాలను ఒలక బోస్తూ ఆయన మాట్లాడుతుంటే ఎంత సంతోషం కలిగిందో.

Published : 29 May 2024 00:08 IST

మీరు ఓ మాయా దర్పణాన్ని చూస్తున్నారని ఊహించుకోండి. అందులో ఎక్కడో దూరంగా ఉన్న తండ్రి ప్రత్యక్షమయ్యారు. ఆయనను ఆ గదిలోనే నిజంగా చూస్తున్నట్టే అనిపించింది. కళ్లలోకి కళ్లు పెట్టి చూస్తూ, హావభావాలను ఒలక బోస్తూ ఆయన మాట్లాడుతుంటే ఎంత సంతోషం కలిగిందో. ఊహించుకోవటానికే అద్భుతంగా ఉంది కదా. అదే నిజమైతే? గూగుల్‌ చేపట్టిన స్టార్‌లైన్‌ ప్రాజెక్టు మూలంగా ఇది త్వరలోనే సాకారం కానుంది. సైన్స్‌ ఫిక్షన్‌ కథలాంటి ఈ వినూత్న ఆలోచనను సుసాధ్యం చేయనుంది. త్రీడీ, హోలోగ్రాఫిక్‌ మాదిరి డిస్‌ప్లే పరిజ్ఞానంతో కూడిన స్టార్‌లైన్‌ ప్రాజెక్టు మీద గూగుల్‌ ఐదేళ్లుగా ప్రయోగాలు చేస్తోంది. అప్పటి నుంచీ మెరుగులు దిద్దుతూ వస్తోంది. మరో ఐదారు నెలల్లో ఇది అందుబాటులోకి వచ్చే అవకాశముంది.

వీడియో సంభాషణలు, వర్చువల్‌ సమావేశాలు ఇప్పుడు సర్వ సాధారణమైపోయాయి. ఆఫీసు బృంద చర్చలనూ వీటితో కొనసాగించటం చూస్తున్నాం. ఇంటి నుంచే ఉద్యోగాలు చేసే ధోరణితో పాటు వివిధ దేశాల్లో వ్యాపార కార్యకలాపాలు నిర్వహించటం పెరిగిపోయిన నేపథ్యంలో వర్చువల్‌ కమ్యూనికేషన్‌కు ప్రాధాన్యం పెరిగిపోతోంది. జూమ్, గూగుల్‌ మీట్‌ వంటి సాధనాలు ఎంతగా ఆదరణ పొందుతున్నాయో చూస్తూనే ఉన్నాం. అయితే ఇవేవీ మనుషులను నేరుగా కలిసి మాట్లాడుకుంటున్న అనుభూతిని ఇవ్వలేవు. ఏదో వీడియోలో చూసుకుంటూ అభిప్రాయాలు కలబోసుకుంటున్నట్టుగా తోస్తుంది గానీ ప్రత్యక్ష సంభాషణ జరుపుతున్నట్టు అనిపించదు. ఇలాంటి ఇబ్బందిని తొలగించే ఉద్దేశంతోనే గూగుల్‌ సంస్థ వినూత్నమైన ప్రాజెక్ట్‌ స్టార్‌లైన్‌కు శ్రీకారం చుట్టింది. అవటానికి వీడియో కాన్ఫరెన్సింగ్‌ సిస్టమే గానీ నేరుగా మనిషిని చూస్తున్న అనుభూతిని కల్పించటం దీని ప్రత్యేకత.

వినూత్న పరిజ్ఞానం

స్టార్‌లైన్‌ను ఒకరకంగా 3డీ వీడియో కాలింగ్‌ బూత్‌ అనుకోవచ్చు. ఇదో అధునాతన హార్డ్‌వేర్, సాఫ్ట్‌వేర్ల కలబోత. కంప్యూటర్‌ విజన్, మెషిన్‌ లెర్నింగ్, స్పేషియల్‌ ఆడియో, రియల్‌ టైమ్‌ కంప్రెషన్‌ పరిజ్ఞానాలను మేళవించి దీన్ని రూపొందిస్తున్నారు. ఇందులో టీవీ సైజులో ఒక డిస్‌ప్లే ఉంటుంది. దీని ముందు కూర్చొని అవతలివారిని చూస్తూ మాట్లాడొచ్చు. జూమ్‌ వంటి టూల్స్‌తో ఇప్పటికే మాట్లాడుతున్నాం కదాని అనుకుంటున్నారేమో. స్టార్‌లైన్‌ డిస్‌ప్లే తీరే వేరు. ఇది శబ్దం, లోతు జ్ఞానాన్ని సృష్టించే దృశ్య క్షేత్రంతో (విజన్‌ ఫీల్డ్‌) కూడుకొని ఉంటుంది. రికార్డయిన ఇమేజ్‌ను వివిధ కోణాల్లో ప్రసరింపచేయటం ద్వారా 3డీ వీడియోను ప్రొజెక్ట్‌ చేస్తుంది.

ఎలా పనిచేస్తుంది?

స్టార్‌లైన్‌ టీవీ తెరకు పైనా, కిందా, కుడి, ఎడమలో రెండేసి చొప్పున.. మొత్తం ఆరు కెమెరాలుంటాయి. ఇవి శరీరం స్థితిని, కదలికలను నిరంతరం పసిగడతాయి. వేర్వేరు పొజిషన్‌లలో తీసిన చిత్రాలను ఈ కెమెరా జతలు ఒకే దృశ్యంగా మారుస్తాయి. ఇలా 3డీ ఎఫెక్ట్‌ను సృష్టిస్తాయి. ఒకరకంగా ఇది హోలోగ్రాఫిక్‌ కార్డుల మాదిరిగా పనిచేస్తుందని చెప్పుకోవచ్చు. ఈ కార్డులను ముందూ వెనకలకు తిప్పినప్పుడు వేరే దృశ్యం లేదా 3డీ ప్రభావం కనిపిస్తుంది కదా. ఎడమ కంటి కన్నా కుడి కన్ను కాస్త భిన్నమైన దృశ్యాన్ని చూడటం వల్ల దృశ్యం లోతును చూస్తున్న భ్రాంతిని కలిగిస్తుంది. స్టార్‌లైన్‌ తెర చుట్టూ ఉండే ఆరు కెమెరాలూ ఇలాంటి పనే చేస్తాయి. ఇవి వేర్వేరు కోణాల్లో ముఖం, శరీరం, కదలికలను 3డీలో రికార్డు చేసి, కాల్‌ చేస్తున్నవారికి ప్రదర్శిస్తాయి. దీంతో టీవీ తెర మీద చదును దృశ్యం మాదిరి కాకుండా నిజంగా అవతలి వారు ఎదురుగా ఉన్నట్టే అనిపిస్తుంది. పొడవు, వెడల్పుతో పాటు లోతూ తెలియటం వల్ల వాస్తవ ప్రపంచాన్ని చూస్తున్నామనే భావన కలుగుతుంది. అందువల్ల మామూలు వీడియో కాల్‌లో సాధ్యం కాని హావభావాలనూ స్పష్టంగా చూడొచ్చు.

ప్రత్యేకమైన నెట్‌వర్క్‌ అక్కర్లేదు

3డీ వీడియో కాలింగ్‌ అనుభూతిని కలిగించినా స్టార్‌లైన్‌కు ప్రత్యేకమైన అంతర్జాల నెట్‌వర్క్‌ అవసరమేమీ లేదు. ప్రామాణిక వేగంతో కూడిన ఇంటర్నెట్‌ ఉంటే చాలు. జాప్యం లేకుండా సంప్రదింపులు జరపొచ్చు. కళ్లద్దాలు ధరించినా 3డీ దృశ్యం యథాతథంగా కనిపిస్తుంది. మాట్లాడేవారు గదిలో ఎక్కడ నిల్చున్నారు? ఎంత పొడవున్నారు? చుట్టుపక్కల ఏమేం ఉన్నాయి? అనేవి స్పష్టంగా తెలియటం వల్ల ప్రత్యక్షంగా కలిసి సంభాషిస్తున్న భావన కలుగుతుంది.

హెడ్‌సెట్, కళ్లద్దాల్లేకుండా..

యాపిల్‌ విజన్‌ ప్రో వంటి హెడ్‌సెట్లతో 3డీ వీడియో కాల్స్‌ చేసుకోవచ్చు కదా. స్టార్‌లైన్‌ గొప్పతనమేంటి? అనే సందేహం రావొచ్చు. నిజానికి 3డీలో వీడియోకాల్స్‌ చేసుకోగల, ప్రత్యక్ష అనుభూతిని కలిగించగల పరిజ్ఞానమేదీ ఇప్పటివరకూ అందుబాటులో లేదు. విజన్‌ ప్రోతో ఫేస్‌టైమ్‌ కాల్‌ చేసుకోవచ్చు, 3డీ రూపంతో ఛాట్‌ చేయొచ్చు. అయితే స్టార్‌లైన్‌ పరిజ్ఞానానికిది తుల తూగలేదు. స్టార్‌లైన్‌తో మరో వెసులుబాటు సౌకర్యం. పెద్ద పెద్ద హెడ్‌సెట్లను తలకు ధరించాల్సిన పనుండదు. సుదీర్ఘంగా సెట్‌ చేసుకోవాల్సిన అవసరమూ ఉండదు. టీవీలాంటి పరికరాన్ని ఆన్‌ చేస్తే చాలు. తెర మీద నుంచే నేరుగా మాట్లాడుకోవచ్చు.

ఆచరణీయమేనా?

వీడియో కాన్ఫరెన్స్‌ వ్యవస్థల్లో అన్నింటికన్నా పెద్ద సవాలు వీటిల్లోని పరిజ్ఞానమే. ఇది ఆచరణీయమే అయినా చాలా కంపెనీలు 2డీ దృశ్యాలకే పరిమితమయ్యాయి. ఫలితంగా వీడియో సమావేశాలు ఇప్పటికీ ప్రాథమిక దశలోనే కొనసాగు తున్నాయి. ఈ నేపథ్యంలో స్టార్‌లైన్‌ విధానం కంపెనీ బోర్డు గదుల్లోకి విస్తరించగలదని గూగుల్‌ భావిస్తోంది. ఎక్కడో సుదూరంగా ఉన్న ఉద్యోగులతోనూ ‘ప్రత్యక్షంగా చర్చలు’ జరిపేందుకు వీలు కల్పిస్తుంది. కాబట్టి మెరుగైన బృంద సంభాషణలకు తోడ్పడుతుంది. ఇలాంటి 3డీ వీడియో కాలింగ్‌ వ్యవస్థలకు ఇతర సంస్థలూ ప్రయత్నిస్తున్నాయి. మైక్రోసాఫ్ట్‌ సంస్థ తమ హోలోపోర్టేషన్‌ పరిజ్ఞానంలో 3డీ ఇమేజింగ్‌ విధానాన్నే వాడుకుంటోంది. ఇది వస్తువుల 3డీ ఇమేజెస్‌ను సృష్టిస్తుంది. ఈ డేటాను కంప్రెస్‌ చేసి, ప్రసారం చేయటం ద్వారా హోలోగ్రాఫిక్‌ అనుభూతిని కలిగిస్తుంది. అయితే ఇందులో ఎలాంటి డిస్‌ప్లే ఉండదు. హోలోలెన్స్‌ మిక్స్‌డ్‌ రియాల్టీ హెడ్‌సెట్‌తో హోలోగ్రాఫిక్‌ అనుభూతిని ప్రసాదిస్తుంది. అయితే ఇది ఆటంకాల్లేకుండా వీడియో సమావేశాల నిర్వహణకు అంతగా ఉపయోగ పడకపోవచ్చని భావిస్తున్నారు.

సవాళ్లు లేకపోలేదు

వాణిజ్యపరంగా ఎంతవరకు విజయం సాధిస్తుందనేది స్టార్‌లైన్‌కు లభించే ఆదరణ మీద ఆధారపడి ఉంటుంది. దీని హార్డ్‌వేర్‌ను సెట్‌ చేయటానికి ప్రస్తుతానికి ఒక గది కావాలి. ఇది అందరికీ, అన్నిచోట్లా సాధ్యం కాకపోవచ్చు. అదే హార్డ్‌వేర్‌ సైజును చిన్నగా చేయగలిగితే ఎక్కువమంది వాడుకోవటానికి మార్గం సుగమం అవుతుంది. ప్రస్తుతానికి ఖర్చూ కూడా ఒక సవాలే. స్టార్‌లైన్‌ ధర ఎక్కువ కావటం వల్ల కొన్ని సంస్థలే మొగ్గు చూపొచ్చు. మరో సవాలు యాప్‌ సపోర్టు. స్టార్‌లైన్‌కు మీట్, జూమ్‌ తగిన వేదికలు. గూగుల్‌ సంస్థ ఇప్పటికే తమ మీట్‌ వేదిక మీద దీన్ని అందుబాటులోకి తేవాలని అను కుంటోంది. జూమ్‌తోనూ జట్టు కట్టాలని భావిస్తోంది. ప్రస్తుతానికైతే స్మార్ట్‌ఫోన్లకు వర్తింపజేయకపోవచ్చు. మరిన్ని ఎక్కువ యాప్‌లకు సపోర్టు లభిస్తే ఎక్కువ మంది వాడుకోవచ్చు. మున్ముందు థర్డ్‌ పార్టీ యాప్‌లకు ఈ పరిజ్ఞానాన్ని వర్తింపజేయగలిగితే ఆదరణా పెరిగే అవకాశం లేకపోలేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని