Google: వెబ్‌ కెమెరా సమస్య.. AI సాయంతో పరిష్కరిస్తామన్న గూగుల్!

యూజర్ ల్యాప్‌టాప్‌లోని వెబ్‌ కెమెరాలో తలెత్తిన సమస్యను గూగుల్ ఏఐ సాయంతో పరిష్కరించనున్నట్లు గూగుల్ వెల్లడించింది. ఈ మేరకు గూగుల్ యాన్యువల్ డెవలపర్స్ సదస్సులో ఒక ప్రకటన చేసింది. 

Published : 14 May 2022 02:43 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: గత రెండున్నరేళ్లలో ఉద్యోగులు వర్క్‌ఫ్రమ్‌ హోమ్‌ చేస్తే, విద్యార్థులు కంప్యూటర్‌ స్క్రీన్‌పైనే పాఠాలు విన్నారు. ఇందుకోసం ఆన్‌లైన్‌ వీడియో కాలింగ్ సర్వీసులను ఎక్కువగా ఉపయోగించారు. అయితే కొన్నిసార్లు ఆన్‌లైన్‌ సమావేశాల్లో మాట స్పష్టంగా లేకపోతేనో, వీడియో సరిగా కనపడకపోతే ఇంటర్నెట్‌ సమస్య అనుకుని చాలామంది పట్టించుకోని ఉండకపోవచ్చు. కానీ, దీనికి ఇంటర్నెట్‌ కొంతవరకు కారణమైతే, మరో ముఖ్యమైన కారణం యూజర్స్‌ ల్యాప్‌టాప్‌లోని వెబ్‌ కెమెరా, మైక్‌ అని గూగుల్ చెబుతోంది. ఈ సమస్యను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ (ఏఐ) సాయంతో సరిచేయనున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు గూగుల్ బుధవారం జరిగిన యాన్యువల్ డెవలపర్స్ సదస్సులో ఓ కీలక ప్రకటన చేసింది.   

వర్చువల్ సమావేశాలకు సంబంధించి యూజర్లకు మెరుగైన సేవలు అందించేందుకు గూగుల్ వర్క్‌స్పేస్‌ బృందం ఏఐ ఆధారిత సేవలను మెరుగపరుస్తున్నట్లు పేర్కొంది. గూగుల్ మీట్ లేదా వర్క్‌స్పేస్‌లోని ఇతర సర్వీసుల ద్వారా యూజర్‌ వీడియో కాలింగ్ చేసినప్పుడు, ఇంటర్నెట్‌ క్వాలిటీ సరిగా లేకున్నా, మెరుగైన వెబ్‌ కెమెరా ఉపయోగించకున్నా యూజర్‌ వీడియో అవతలి వారికి స్పష్టంగా కనిపిస్తుందని తెలిపింది. అలానే, లైటింగ్‌, సౌండ్‌ ఫీచర్లను కూడా మెరుగుపరుస్తున్నట్లు తెలిపింది. ఇందుకోసం యూజర్‌కు ఏఐ ఆధారిత కంట్రోల్స్‌ను అందుబాటులోకి తీసుకురానున్నట్లు గూగుల్ వెల్లడించింది. వీటితోపాటు గూగుల్ మీట్‌, స్పేస్‌ యాక్టివిటీలో మార్పులు చేయనుంది. మీట్‌లో ఆన్‌లైన్‌ సమావేశాలకు సంబంధించిన సమాచారం యూజర్లు సులువుగా తెలుసుకొనేందుకు వీలుగా ఆటోమేటెడ్ ట్రాన్‌స్క్రిప్షన్‌ సేవలను పరిచయం చేయనుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని