Google: స్ట్రీట్‌ వ్యూకు గూగుల్ గుడ్‌బై.. మరో రెండు యాప్‌లకు కూడా!

గూగుల్ మూడు యాప్‌ సేవలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ఆయా యాప్‌లు అందించే ఫీచర్లు ఇతర యాప్‌ల ద్వారా యూజర్లకు అందుబాటులోకి తీసుకొచ్చింది. మారుతున్న సాంకేతికతకు అనుగుణంగా ఈ మార్పులు చేసినట్లు సమాచారం.  

Published : 04 Nov 2022 20:42 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: సాంకేతికతలో ఎప్పటికప్పుడు వస్తోన్న మార్పులు, యూజర్ల అభిరుచికి అనుగుణంగా టెక్‌ సంస్థలు తమ సర్వీసుల్లో మార్పులు చేర్పులు చేస్తుంటాయి. గూగుల్ సైతం ఇదే బాటలో పయనిస్తోంది. ఇటీవలే క్లౌడ్‌ గేమింగ్ సర్వీస్‌ స్టాడియా (Stadia) సేవలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. దాని స్థానంలో కొత్తగా గూగుల్ ప్లే గేమ్స్‌ (Google Play Games)ను తీసుకొచ్చింది. తాజాగా ఇన్‌స్టా మెసేజింగ్ యాప్‌ హ్యాంగవుట్స్‌ (Hangouts) సేవలను కూడా నిలిపివేసింది. హ్యాంగవుట్స్‌ యూజర్లు  గూగుల్ చాట్‌ (Google Chat)ను ఉపయోగించుకోవాలని సూచించింది.

ఇతర మెసేజింగ్‌ యాప్‌ల తరహాలో హ్యాంగవుట్స్‌లో  కూడా గ్రూప్‌ కన్వరేజషన్స్‌, డాక్యుమెంట్ ఎడిటింగ్‌, స్లైడర్స్‌, చాటింగ్, మెన్షన్స్ వంటి ఫీచర్లు ఉన్నప్పటికీ యూజర్లను ఆకట్టుకోలేకపోయింది. హ్యాంగవుట్స్‌ యూజర్ల ప్రొఫైల్‌, చాట్‌ హిస్టరీ ఆటోమేటిగ్గా గూగుల్‌ చాట్‌ యాప్‌కు బదిలీ అవుతుందని గూగుల్ ఓ ప్రకటనలో తెలిపింది. వీటితోపాటు గూగుల్ స్ట్రీట్‌ వ్యూ యాప్‌ సేవలను కూడా వచ్చే ఏడాది నుంచి నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది.

గూగుల్‌ ఇటీవలే మ్యాప్స్‌లో స్ట్రీట్‌ వ్యూ ఫీచర్‌ను తీసుకొచ్చింది. ఈ నేపథ్యంలో స్ట్రీట్‌ వ్యూ కోసం ప్రత్యేకంగా యాప్‌ నిర్వహణ అవసరంలేదని భావిస్తోంది. వచ్చే ఏడాది మార్చి 31 నుంచి ఈ యాప్‌ సేవలను నిలిపివేయనున్నట్లు తెలిపింది. ఇకపై స్ట్రీట్‌ వ్యూ యాప్‌లో ఉండే ఫీచర్లు పూర్తిస్థాయిలో గూగుల్ మ్యాప్స్‌ ద్వారా యూజర్లకు అందుబాటులోకి తీసుకురానున్నట్లు సమాచారం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని