Google Play Store: ప్లే స్టోర్‌లో 2022 బెస్ట్ యాప్‌ ఏది.. ఓటేశారా?

గూగుల్‌ యూజర్స్‌ ఛాయిస్‌ యాప్ 2022 ప్రక్రియను ప్రారంభించింది. ఇందుకోసం పది ట్రెండింగ్ యాప్‌లను ఎంపిక చేసింది. వాటిలో ది బెస్ట్‌ యాప్‌కు ఓటు వేయాలంటూ యూజర్లను కోరుతోంది. 

Published : 05 Nov 2022 11:02 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: పుస్తక ప్రియులకు లైబ్రరీ ఉన్నట్లుగానే.. ఆండ్రాయిడ్ యూజర్లకు గూగుల్ ప్లేస్టోర్‌ కూడా అలాంటిదేనని చెప్పోచ్చు. ఎలాంటి సర్వీసుకైనా ఒకటి కంటే ఎక్కువ యాప్‌లు సేవలను అందిస్తుంటాయి. వాటిలో బెస్ట్‌ యాప్‌లను మాత్రమే ఎక్కువ మంది యూజర్లు డౌన్‌లోడ్ చేస్తుంటారు. అవే ట్రెండింగ్‌లో ఉంటాయి కూడా. అలాంటి వాటిలోంచి ఏటా బెస్ట్‌ యాప్‌ను గూగుల్ ఎంపిక చేస్తుంది. ఇందుకోసం టాప్‌ టెన్‌ యాప్‌లను ఎంపిక చేసి యూజర్‌ ఛాయిస్‌ యాప్‌ (Users Choice App) పేరుతో ఓటింగ్ నిర్వహిస్తుంది. వాటిలో యూజర్‌ తనకు నచ్చిన యాప్‌కు ఓటేయొచ్చు. ఈ ఓటింగ్‌ ప్రక్రియ వారం రోజుల్లో ముగియనుంది. ఇక మరెందుకు ఆలస్యం.. యాప్‌ల జాబితా సిద్ధంగా ఉంది. అందులో మీకు నచ్చిన యాప్‌కు ఓటేయండి మరి!  

జాబ్‌ హై (Job Hai - Search Job, Vacancy)

విద్యార్హతలకు తగినట్లుగా దేశవ్యాప్తంగా ఉన్న ఉద్యోగావకాశాల వివరాలను ఈ యాప్‌ అందిస్తుంది. పార్ట్‌టైమ్‌, ఫుల్‌ టైమ్‌, వర్క్‌ఫ్రమ్‌ హోమ్‌ జాబ్స్‌కు సంబంధించిన సమాచారంతోపాటు ఫ్రెషర్స్‌కు ఉన్న ఉద్యోగావకాశాలు ఈ యాప్‌లో చూడొచ్చు. 

క్యూమాథ్‌ (Cuemath: Math Games & Classes)

గణిత సబ్జెక్ట్‌ అంటే భయపడే పిల్లల కోసం ఈ యాప్‌ను డిజైన్‌ చేశారు. కేజీ నుంచి పదో తరగతి విద్యార్థుల వరకు ఇందులో క్లాసులు వినొచ్చు. ఇందులో మ్యాథ్స్ గేమ్స్‌తోపాటు, విద్యార్థులకు ట్యూటర్లు సలహాలు, సూచనలు ఇస్తారు. లెక్కలు సులభంగా ఎలా చేయాలో వివిధ యాక్టివిటీల ద్వారా విద్యార్థులకు నేర్పిస్తారు. 

టర్నిప్‌ (Turnip - Talk, chat and stream)

ఇదో సోషల్‌ మీడియా యాప్. యూజర్‌ తన స్నేహితులు, ఫ్యామిలీ మెంబర్స్‌తోపాటు పరియస్థులతో గ్రూపుగా ఏర్పడి చాట్ చేయొచ్చు. ఇందులో వాయిస్‌ చాట్‌, లార్జ్‌ ఫొటో/వీడియో షేరింగ్‌, యూట్యూబ్‌ తరహాలో లైవ్‌ స్ట్రీమింగ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. నచ్చిన బుక్‌, మ్యూజిక్‌, గేమ్స్, టెక్నాలజీ వంటి వాటి గురించి ఇతరులతో చర్చించవచ్చు. 

ఫిలో (Filo: Instant 1-to-1 tutoring)

ఫిలో ఇన్‌స్టాంట్‌ ఆన్‌లైన్ ట్యూటర్‌ యాప్‌. ఇందులో విద్యార్థులు తమ సందేహాలను సబ్జెక్ట్ ఎక్స్‌పర్ట్స్‌తో లైవ్‌లో చర్చించి నివృత్తి చేసుకోవచ్చు. రోజువారీ అసైన్‌మెంట్స్‌, నోట్స్‌ అందించేందుకు నిపుణులైన ట్యూటర్స్ 24X7 అందుబాటులో ఉంటారు.  

జెప్టో (Zepto: 10-Min Grocery Delivery)

తాజా కూరగాయలు, సరుకులు వేగవంతంగా డెలివరీ చేసే యాప్‌. యూజర్ ఆర్డర్‌ చేసిన పది నిమిషాల్లో డెలివరీ చేస్తామని జెప్టో చెబుతోంది.  

డ్రీమ్‌ బై వోమ్‌బో (Dream by WOMBO - AI Art Tool)

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సాయంతో యూజర్‌ తనకు నచ్చినట్లుగా ఆర్ట్‌ వర్క్‌ను క్రియేట్ చేయొచ్చు. ఊహాజనిత ప్రపంచానికి యాప్‌లోని టూల్స్‌తో రూపం ఇవ్వొచ్చు. గ్రాఫిక్ డిజైనర్స్‌కు ఈ యాప్‌ ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. 

ప్రెప్‌లాడర్‌ (PrepLadder Learning App)

పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే వారి కోసం ఈ యాప్‌ను డిజైన్‌ చేశారు. నీట్‌-పీజీ, ఎఫ్‌ఎమ్‌జీఈ, క్యాట్, యూపీఎస్‌సీ వంటి పరీక్షలకు సంబంధించిన మెటీరియల్‌, వీడియో క్లాసెస్‌ ఇందులో ఉన్నాయి. 

బ్లింకిట్‌ (Blinkit: Grocery in minutes)

ఇది కూడా ఆన్‌లైన్ డెలివరీ యాప్‌. యాప్‌ ద్వారా యూజర్‌ ఆర్డర్‌ చేసిన సరుకులు, తాజా కూరగాయలు, పండ్లు ఇంటి వద్దకే డెలివరీ చేస్తుంది. 

క్వెస్ట్‌ (Questt: Navigator for Learning)

విద్యార్థుల లెర్నింగ్ సామర్థ్యాన్ని ఎప్పకప్పుడు అంచనా వేసి రోజువారీ రిప్టోర్‌ ద్వారా తెలియజేస్తుంది.  సబ్జెక్ట్‌ల వారీగా తాము ఎంతవరకు నేర్చుకున్నామనేది తెలుసుకోవడంతోపాటు, ఏయే అంశాల్లో ఎక్కువ శ్రద్ధ చూపాలనేది తెలియజేస్తుంది. 

షాప్సీ (Shopsy Shopping App - Flipkart)

ఆన్‌లైన్‌ షాపింగ్ చేసే వారి కోసం బెస్ట్‌ డీల్స్‌ను ఈ యాప్‌ అందిస్తుంది. ఫ్యాషన్‌, బ్యూటీ, మొబైల్స్‌, ఫుట్‌వేర్‌.. ఇలా వేర్వేరు కేటగిరీలకు సంబంధించిన బెస్ట్ డీల్స్‌ను చూపిస్తుంది. ఈ యాప్‌ను ఫ్లిప్‌కార్ట్ అందిస్తుంది. 

నచ్చిన యాప్‌కు ఓటు వేసేందుకు ఈ లింక్‌ క్లిక్‌ చేయండి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని