Google Ads: మనకు నచ్చని యాడ్స్‌పై ఇక మనదే పెత్తనం..!

గూగుల్‌ యాన్యువల్ డెవలపర్స్‌ కాన్ఫరెన్స్‌ గూగుల్ ఐ/ఓ 2022 (Google I/O)లో కీలక ప్రకటన చేసింది. యాడ్స్‌ను నియంత్రించుకునేలా ‘మై యాడ్‌ సెంటర్‌’ అనే ఫీచర్‌ను తీసుకురానున్నట్లు ప్రకటించింది.

Published : 15 May 2022 20:36 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: స్మార్ట్‌ఫోన్‌లో మనం ఏ వస్తువు గురించైనా సెర్చ్‌ చేస్తే చాలు మరుక్షణమే దానికి సంబంధించిన ప్రకటనలు (Ads) కుప్పలు తెప్పలుగా ప్రత్యక్షమవుతుంటాయి. ఫేస్‌బుక్‌, ట్విటర్‌, యూట్యూబ్‌ ఇతరత్రా ఎక్కడ చూసినా అవే దర్శనమిస్తుంటాయి. అంతలా టెక్నాలజీ మనల్ని, మన అభిరుచుల్ని ఫాలో అవుతుందన్నమాట. అయితే, ఆన్‌లైన్‌ యాడ్స్‌ను నియంత్రించటానికి తాజాగా కొత్త ఫీచర్‌ను తీసుకు వస్తున్నట్లు గూగుల్‌ ప్రకటించింది. అదేంటో ఓసారి చూద్దాం..

గూగుల్‌ యాన్యువల్ డెవలపర్స్‌ కాన్ఫరెన్స్‌ గూగుల్ ఐ/ఓ 2022 (Google I/O)లో కీలక ప్రకటన చేసింది. యాడ్స్‌ను నియంత్రించుకునేలా ‘మై యాడ్‌ సెంటర్‌’ అనే ఫీచర్‌ను తీసుకురానున్నట్లు ప్రకటించింది. దీంతో యూజర్లు చూడాలనుకున్న బ్రాండ్‌ యాడ్స్‌ను తామే సెలక్ట్‌ చేసుకోవచ్చు. ఈ ఫీచర్‌ ఏడాది చివరి నాటికి యూజర్లకు అందుబాటులోకి వస్తుందని గూగుల్‌ వెల్లడించింది.


ఎలా పనిచేస్తుంది?

గూగుల్ ‘మై యాడ్‌ సెంటర్‌’లో మొత్తం యాడ్‌ నెట్‌వర్క్‌ ఏమీ ఉండదు. యూజర్లు గతంలో ఎక్కువగా వెతికిన బ్రాండ్ల పేర్లను మాత్రమే ఇందులో చూపిస్తుంది. ఇవి కూడా కేటగిరిల వారీగా ఉంటాయి. వీటిలో యూజర్లకు ఇష్టమైన కేటగిరిని సెలెక్ట్‌ చేసుకొని యాడ్స్‌ను ఆస్వాదించవచ్చు. అంతేకాకుండా ‘పర్సనలైజ్‌డ్‌ యాడ్స్’ను టర్న్‌ ఆఫ్‌ చేసుకునే సదుపాయం ఉంటుంది.

మై యాడ్‌ సెంటర్‌లో ఇటీవల మనం చూసిన యాడ్స్‌ను చూడటానికి ‘హోమ్‌ ట్యాబ్‌’లో మోస్ట్‌ రీసెంట్‌ ఆప్షన్‌ ఉంటుంది. ప్రైవసీలో మన వ్యక్తిగత సమాచారాన్ని యాడ్‌/ఎడిట్‌ చేసుకోవచ్చు. మెనూలో బ్రాండ్‌, టాపిక్, సెన్సిటీవ్‌ అనే మూడు ఆప్షన్లు ఉంటాయి. టాపిక్‌ ట్యాబ్‌లో మనకు కావాల్సిన, ఆసక్తి ఉన్న వాటి సమాచారాన్ని సెలెక్ట్‌ చేసుకోవచ్చు. బ్రాండ్‌లో మనకు ఇష్టమైన బ్రాండ్ల పేర్లను ఎంచుకోవచ్చు. యాడ్స్‌ను కంట్రోల్‌ చేయడంతోపాటు ఫీడ్‌బ్యాక్‌ ఇవ్వటానికి  లైక్‌, బ్లాక్‌, రిపోర్ట్‌ వంటి ఆప్షన్స్‌ కూడా ఉంటాయి. ఇదిలా ఉండగా.. ‘మై యాడ్‌ సెంటర్‌’ ఫీచర్‌ వల్ల చాలా బ్రాండ్లకు నష్టం వాటిల్లే అవకాశమూ లేకపోలేదు. అయితే, దీనికి సంబంధించి సరైన స్పష్టత రావాల్సి ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని