Extraterrestrial life: గ్రహాంతర జీవులు మనమధ్యే!

గ్రహాంతర జీవుల మీద మన ఆసక్తి ఈనాటిది కాదు. వీరి కోసం చాలాకాలంగా అన్వేషిస్తున్నాం. కానీ ఇంతవరకూ కచ్చితమైన జాడేదీ కనిపించలేదు. విశ్వంలో మనలాంటి వాళ్లు ఉన్నారని కొందరు, లేరని మరికొందరు శాస్త్రవేత్తలు వాదిస్తూనే వస్తున్నారు.

Updated : 19 Jun 2024 13:37 IST

గ్రహాంతర జీవుల మీద మన ఆసక్తి ఈనాటిది కాదు. వీరి కోసం చాలాకాలంగా అన్వేషిస్తున్నాం. కానీ ఇంతవరకూ కచ్చితమైన జాడేదీ కనిపించలేదు. విశ్వంలో మనలాంటి వాళ్లు ఉన్నారని కొందరు, లేరని మరికొందరు శాస్త్రవేత్తలు వాదిస్తూనే వస్తున్నారు. ఎన్నెన్నో సిద్ధాంతాలను ముందుకు తెస్తున్నారు. ఇప్పుడు హార్వర్డ్‌ యూనివర్సిటీ అధ్యయనం మరో వాదనను తెరమీదికి తెచ్చింది. గ్రహాంతర జీవులు మన మధ్యే, మనకు తెలియకుండా అజ్ఞాతంగా ఉన్నారని ఇది పేర్కొంటుండటం గమనార్హం.

న్ని విధాలుగా మానవుల పురోగతి కోసం హార్వర్డ్‌ యూనివర్సిటీ 2016లో హ్యూమన్‌ ఫ్లరిషింగ్‌ ప్రోగ్రామ్‌ను చేపట్టింది. ఇది ఇటీవల గ్రహాంతర జీవులకు సంబంధించి కొత్త వాదనను ప్రతిపాదించింది. మనం యూఎఫ్‌ఓలు, ఫ్లయింగ్‌ సాసర్లు అని పిలుచుకునే ‘అన్‌ఐడెంటిఫైడ్‌ అనొమలస్‌ ఫెనోమినా’ (యూఏపీ) అనేవి గ్రహాంతర జీవులకు సంబంధించినవేనని ఆశ్చర్యకరమైన విషయాన్ని పేర్కొంది. గ్రహాంతర జీవులు భూమి లోపల, చంద్రుడి మీద.. ఆ మాటకొస్తే మనతోనే కలిసి నడుస్తుండొచ్చనీ అంటోంది. భూమ్మీదున్న తమ స్నేహితులను కలుసుకోవటానికి గ్రహాంతర జీవులు ఫ్లయింగ్‌ సాసర్లను వాడుకుంటుండొచ్చనీ చెబుతోంది. ఈ అధ్యయనం కొత్తగా క్రిప్టోటెరిస్టీరియల్‌ అనే ఊహా సిద్ధాంతాన్నీ ప్రతిపాదించింది. విశిష్టమైన, రహస్యమైన గ్రహాంతర జీవులను క్రిప్టోటెరిస్టీరియల్స్‌గా పేర్కొంటూ.. వీళ్లు మన భూమికి భవిష్యత్‌ కాలంలో లేదా తెలివైన డైనోసార్ల కన్నా ముందే పుట్టి ఉండొచ్చని చెబుతోంది. తమ సిద్ధాంతాన్ని తాత్కాలికంగా బలపరిచే, అలాగే లోతైన అవగాహనతోనే ఈ ఊహా సిద్ధాంతాన్ని ప్రతిపాదించామని పరిశోధకులు అంటున్నారు. ఇదే గనక నిజమైతే గ్రహాంతర జీవులు మన ఇంటి పక్కనే మసలుతున్నా ఆశ్చర్యపోనవసరం లేదు.


నాలుగు రకాలు

రహస్య గ్రహాంతర జీవులు రకరకాల రూపాల్లో ఉండొచ్చనీ తాజా అధ్యయనం ప్రతిపాదించింది.

హ్యూమన్‌ క్రిప్టోటెరిస్ట్రియల్స్‌: ఇది అధునాతన సాంకేతిక పరిజ్ఞానం తెలిసిన పురాతన మానవ నాగరికత. చాలాకాలం కిందటే చాలావరకూ అంతరించింది. కానీ అవశేష రూపంలో ఇంకా కొనసాగుతూ వస్తోంది.

హోమినిడ్‌ లేదా థెరోపాడ్‌ క్రిప్టోటెరిస్ట్రియల్స్‌: ఇది సాంకేతికంగా పురోగమించిన మానవేతర నాగరికత. అజ్ఞాతంగా (ఉదా: భూగర్భంలో) నివసించేలా పరిణామం చెందిన కొన్ని జంతువులూ దీనిలోని భాగమే. ఇవి తోకలేని కోతుల వంటి హోమినిడ్‌ మానవుల పూర్వీకులు. లేదా ‘అజ్ఞాత, తెలివైన డైనోసార్ల’ పూర్వ రూపాలు.

ఫార్మర్‌ ఎక్స్‌ట్రాటెరిస్ట్రియల్‌ లేదా ఎక్స్‌ట్రాటెంపెస్ట్రియల్‌ క్రిప్టోటెరిస్ట్రియల్స్‌: వీళ్లు విశ్వంలో వేరే ప్రాంతం నుంచి భూమికి వచ్చిన జీవులు లేదా భవిష్యత్‌ మానవులు. చంద్రుడి వంటి చోట్ల అదృశ్యంగా దాచుకొని ఉండొచ్చు.

మ్యాజికల్‌ క్రిప్టోటెరెస్ట్రియల్స్‌: వీళ్లు భూమి మీద పెరిగిన గ్రహాంతర జీవుల కన్నా తక్కువ. ‘భూ అప్సరసల’ కన్నా ఎక్కువ. వీరికి సాంకేతికంగా అంత నైపుణ్యం లేదు. ‘యక్షిణులు, కిన్నెరుల’ వంటివారు. అద్భుతాలు చేయగలవారు.

నిజమేనా?

హార్వర్డ్‌ యూనివర్సిటీ ఊహా సిద్ధాంతం చాలామంది శాస్త్రవేత్తలకు నమ్మకం కలిగించపోవచ్చు. పరిశోధకులు కూడా ఇదే భావిస్తున్నారు. కానీ తార్కిక, విశాల దృక్పథంతో తమ వాదనను మథించి, పరిశీలించాలని కోరుతున్నారు. సమగ్రంగా పరిశోధించకుండా దీన్ని కొట్టిపారేయటం మూర్ఖత్వమే అవుతుందని చెబుతున్నారు. ఈ అధ్యయనాన్ని ఇంకా ఇతర పరిశోధనలతో సమీక్షించి, పరిశీలించాల్సి ఉంది.


రక్షణ కోసమే అద్భుత నిర్మాణాలు!

గ్రహాంతర జీవులు ఉన్నారో లేదోననే వాదోపవాదాలు కొనసాగుతుండగానే రాన్‌ హాలిడే అనే పరిశోధక రచయిత మరో కొత్త విషయాన్ని లేవనెత్తారు. రాక్షస గుళ్ల వంటి రహస్య కట్టడాలు గ్రహాంతర జీవుల నుంచి కాపాడుకోవటానికి ఉద్దేశించినవే కావొచ్చన్నది ఆయన భావన. స్కాట్లాండ్‌లోని స్కారా బ్రీ రాతి నిర్మాణం, మేషోవీ గుమ్మటం, బ్రాక్స్‌ రాతిగోడ వంటి రహస్య కట్టడాలు గ్రహాంతర జీవుల నుంచి ఎదురయ్యే ప్రమాదాల నుంచి కాపాడుకోవటానికి నిర్మించినవే కావొచ్చని అంటున్నారు. వీటిని కట్టడానికి వాడిన కొన్ని రాళ్లపై దేన్నుంచో తప్పించుకోవటానికి ప్రయత్నిస్తున్నట్టుగా జానపద కథలను తలపించే చిత్రాలున్నాయని చెబుతున్నారు. పురాతత్వవేత్తలు పేర్కొనే వాటికన్నా ఇవి పూర్తిగా భిన్నంగా ఉన్నాయని వివరిస్తున్నారు. ఈ కట్టడాల నిర్మాణం, ఉద్దేశాలు అర్థం కావటం లేదని.. అవి అసలు ఉద్దేశాన్ని కప్పి పుచ్చేలా ఉన్నాయంటున్నారు. బ్రాక్స్‌ రాతి టవర్లు గ్రహాంతర జీవులతో అనుసంధానమయ్యేందుకు నిర్మించి ఉండొచ్చని.. ఇవి పిరమిడ్ల వంటి రహస్య కట్టడాలతో పోలి ఉన్నాయంటున్నారు. వీటిని గ్రహాంతర జీవులను ఆకర్షించటానికో లేదా వారి నుంచి కాపాడుకోవటానికో కట్టి ఉండొచ్చు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని