Vloggers Apps: వ్లాగ్స్‌ చేస్తున్నారా.. చేయాలనుకుంటున్నారా?

గతంలో ఫొటో లేదా వీడియో తీయాలంటే దానికోసం ప్రత్యేకంగా కెమెరా, లైట్ ఇలా ఎంతో శ్రమ ఉండేది. స్మార్ట్‌ఫోన్లు అందుబాటులోకి వచ్చాక క్షణాల్లో ఫొటోలు, వీడియోలు తీసి అంతర్జాలంలో అప్‌లోడ్ చేసేస్తున్నారు. అంతేకాకుండా రికార్డ్ చేసిన వీడియోలను మొబైల్‌లోనే ఎడిట్‌ చేసేందుకు ఎన్నో రకాల యాప్‌లు అందుబాటులో ఉన్నాయి...

Updated : 30 Jul 2021 19:13 IST

ఇంటర్నెట్‌డెస్క్: గతంలో ఫొటో లేదా వీడియో తీయాలంటే దానికోసం ప్రత్యేకంగా కెమెరా, లైట్ ఇలా ఎంతో శ్రమ ఉండేది. స్మార్ట్‌ఫోన్లు అందుబాటులోకి వచ్చాక క్షణాల్లో ఫొటోలు, వీడియోలు తీసి అంతర్జాలంలో అప్‌లోడ్ చేసేస్తున్నారు. అంతేకాకుండా రికార్డ్ చేసిన వీడియోలను మొబైల్‌లోనే ఎడిట్‌ చేసేందుకు ఎన్నో రకాల యాప్‌లు అందుబాటులో ఉన్నాయి. వాటిలో యూజర్‌ ఫ్రెండ్లీ ఫీచర్స్‌తో, సులువుగా వీడియోలు ఎడిట్ చేసుకునే పది ఆండ్రాయిడ్ యాప్‌ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..


ఇన్‌షాట్ (InShot)

కొత్తగా వ్లాగింగ్ చేసేవారికి ఈ యాప్ ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. ఇందులో వీడియో క్లిప్‌లను ఎడిట్ చేసుకోవడమే కాకుండా మీకు నచ్చిన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌ను యాడ్ చేసుకోవచ్చు. క్లిప్‌ రొటేషన్‌ ఫీచర్‌తోపాటు స్టిక్కర్స్‌, టెక్ట్స్‌ యానిమేషన్‌, పిక్చర్ ఇన్ పిక్చర్‌ ఎఫెక్ట్‌ వంటి ఫీచర్స్‌ ఉన్నాయి. ఈ యాప్‌ పూర్తిగా ఉచితం. 


స్ల్పైస్‌ (Splice)

పేరుకు తగ్గట్టుగానే ఇందులో వేర్వేరు వీడియో క్లిప్‌లను ఒక దగ్గరికి చేర్చడం ఎంతో సులభం. క్లిప్‌ల మధ్యలో క్రాస్‌ఫేడ్‌లను కూడా చేర్చడం తేలిక. ఎడిటింట్‌ ఫీచర్స్ విషయానికొస్తే దాదాపుగా ఇన్‌షాట్‌లో ఉండే టూల్స్‌ ఇందులోనూ ఉన్నాయి. వీడియో ఎడిట్‌ చేసేప్పుడు టైంలైన్‌ మీద ఉన్న క్లిప్‌ను జూమ్‌ చేసి చూడొచ్చు. దానివల్ల మనం కట్‌ చేయాలనుకున్న పాయింట్‌ను మరింత కచ్చిత్వంతో గుర్తించగలుగుతాం. అలానే బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్, విభిన్న రకాల టెక్ట్స్‌లు ఇందులో ఉన్నాయి. 


కైన్‌మాస్టర్‌ (KineMaster)

 ఫోన్‌లో వీడియోలు ఎడిట్ చేసేందుకు అందుబాటులో ఉన్న మరో యాప్ కైన్‌ మాస్టర్. ఇందులో బ్యాక్‌గ్రౌండ్‌ కలర్‌ మార్చుకునే సదుపాయం ఉంది. అలానే వీడియోకు మ్యూజిక్, రికార్డ్ చేసిన వాయిస్‌ యాడ్ చేసుకోవచ్చు. వీడియోలు, టెక్ట్స్‌, క్లిప్‌ స్పీడ్‌తోపాటు ఇతర ఎఫెక్ట్స్‌ కోసం ఇందులో వేర్వేరు లేయర్లు ఉన్నాయి. ఈ యాప్ ఉచిత వెర్షన్‌లో ప్రకటనలు ఉంటాయి. యాడ్‌ఫ్రీ కోరుకునేవారు సబ్‌స్క్రైబ్‌ చేసుకోవాలి. 


యుకట్ (YouCut)

సామాజిక మాధ్యమాలు, ఇతర వ్లాగ్‌ సైట్లలో తరచుగా వీడియోలు పోస్ట్ చేసేవారు తమ వీడియోలను ఇందులో సులభంగా ఎడిట్ చెయ్యొచ్చు. ఆడియో మ్యూట్‌, వీడియో స్పీడ్‌ కంట్రోల్‌, వీడియో మెర్జ్‌, ఫొటో స్లైడ్‌షో మేకర్, టెక్ట్స్‌ యానిమేషన్ వంటి ఫీచర్స్ ఉన్నాయి. ఇందులో ఉచితంగా మ్యూజిక్ లైబ్రరీ ఉంది. దీనివల్ల వీడియో ఎడిట్ చేసేప్పుడు మరోచోటు నుంచి ఆడియోను క్లిప్‌ను తెచ్చుకోవాల్సిన అవసరం ఉండదు. 


వ్లోగ్‌నౌ (VlogNow)

కైన్‌ మాస్టర్‌లానే ఇందులో కూడా మ్యూజిక్, సబ్‌టైటిల్స్, స్టిక్కర్స్‌ వంటి వాటి కోసం టైమ్‌లైన్‌లో మల్టిపుల్ లేయర్స్ ఉన్నాయి. అలానే ఆడియోలో డెసిబుల్‌ లెవల్స్‌ తగ్గించుకునే సదుపాయం కూడా ఉంది. మూవీ మేకర్, హెచ్‌డీ వీడియో ఎడిటర్‌ వంటి ఫీచర్స్‌ సాయంతో కంప్యూటర్‌ స్థాయి వీడియో ఎడిటింగ్‌ను ఆస్వాదించవచ్చు. ఫిల్టర్ ఎఫెక్ట్స్‌, కర్వ్‌ షిఫ్టింగ్‌, గ్రీన్‌ స్క్రీన్‌, క్రోమా కీ వంటి ఇతర ఆప్షన్స్‌ కూడా ఉన్నాయి. 


అడోబ్ ప్రీమియర్‌ రష్‌ (Adobe Premier Rush)

ఆండ్రాయిడ్ మొబైల్‌ వినియోగదారుల కోసం అడోబ్‌ సంస్థ ప్రీమియర్ రష్‌ యాప్‌ను అభివృద్ధి చేసింది. అడోబ్ డెస్క్‌టాప్ వీడియో ఎడిటర్ ప్రీమియర్‌ ప్రో తరహాలోనే ఇందులో ఎన్నో రకాల ఫీచర్లు ఉన్నాయి. ఇతర అడోబ్ యాప్‌లలానే ప్రీమియర్‌ రష్ కూడా అడోబ్‌ క్రియేటివ్ క్లౌడ్‌తో సింక్‌ అవుతుంది. కస్టమ్ ఎఫెక్ట్స్‌, కలర్ కోడింగ్, ట్రాన్ఫర్మేషన్స్‌ ఫీచర్స్ ఉన్నాయి. మొబైల్‌లో ఎక్కువగా వీడియోలు ఎడిట్‌ చేసేవారు పూర్తిస్థాయి ఎడిటింగ్ టూల్స్‌ కోసం ఈ యాప్‌ను సబ్‌స్క్రైబ్ చేసుకోవచ్చు. 


వీడియో గురు (Video Guru)

యూట్యూబ్‌తో పాటు ఇతర సామాజిక మాధ్యమాల్లో అప్‌లోడ్ చేసే వీడియోల కోసం ఈ యాప్‌లో ఫిల్టర్స్, ఎఫెక్ట్స్‌, ట్రాన్సిషన్స్‌, యానిమేటెడ్ టెక్ట్స్‌ వంటి ఫీచర్స్ ఉన్నాయి. వీడియోలకు బ్యాక్‌గ్రౌండ్ యాడ్ చేసుకోవడంతోపాటు వందకు పైగా మ్యూజిక్‌ ట్రాక్స్‌ యాప్‌లో ఉన్నాయి. అలానే ఇందులో ఫొటోలతో స్లైడ్‌షోలు కూడా చేసుకోవచ్చు. 


వైవా వీడియో (Viva Video)

చాలా కాలంగా ఆండ్రాయిడ్ యూజర్స్‌కి ఈ యాప్ అందుబాటులో ఉంది. ఇందులో వీడియో క్లిప్‌లను రీసైజ్‌ చేసుకోవడం, క్లిప్‌లను కలపడం, వీడియోల స్పీడ్‌ను పెంచడం.. తగ్గించడం వంటి వాటితోపాటు రొటేట్‌ కూడా సులభంగా చెయ్యొచ్చు. బ్యాక్‌గ్రౌండ్‌ థీమ్స్‌, మ్యూజిక్‌ ట్రాక్స్‌ ఉన్నాయి. ఇందులోని క్రీ-ఫ్రేమింగ్ సాయంతో వివిధ రకాల ఎఫెక్ట్‌లను రూపొందించవచ్చు. అయితే ఈ యాప్‌లో వీడియో ఎడిట్ చేసి ఎక్స్‌పోర్ట్‌ చేసినప్పుడు వీడియోలో వాటర్‌ మార్క్‌ వస్తుంది. 


ఫిల్మోరా గో (Filmora Go)

ఈ యాప్‌ ప్రముఖ వీడియో ఎడిటింగ్ సాఫ్ట్‌వేర్‌ ఫిల్మోరా మొబైల్ వెర్షన్‌. దీని టైమ్‌లైన్‌ యూజర్‌ ఇంటర్‌ఫేస్‌ యూజర్‌ ఫ్రెండ్లీగా ఉంటుంది. ఇందులో మ్యూజిక్‌ ట్రాక్‌లను సులభంగా యాడ్ చేసుకోవచ్చు. వీడియో రీసైజ్‌, టెక్ట్స్‌, ఎమోజీ, ట్రాన్సిషన్స్‌, యానిమేషన్‌, ఎఫెక్ట్స్‌, ఫిల్టర్స్‌, టెంప్లేట్‌ వంటి ఫీచర్లు వీడియోలను మరింత అందంగా రూపొందించేదుకు సాయపడతాయి. ఇందులో కూడా వాటర్ మార్క్‌ ఉంటుంది.  


పవర్‌ డైరెక్టర్‌  (Power Director)

ఇందులో ట్రిమ్‌, వీడియో రొటేట్‌, బ్రైట్‌నెస్ కంట్రోల్‌, కలర్‌, వీడియో ఛేంజ్‌ ఆప్షన్లు ఉన్నాయి. వీడియోకు టెక్ట్స్‌, టైటిల్‌ కూడా పెట్టుకోవచ్చు. యాప్‌ను వారంపాటు ఫ్రీగా వాడుకోవచ్చు. ఆ తర్వాత డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. వాటిలో రకరకాల ప్యాకేజీలు ఉంటాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని