Android 12: ఆండ్రాయిడ్ 12 అప్‌డేట్‌.. ఏయే ఫోన్లలో ఎప్పుడెప్పుడంటే..?

ఆండ్రాయిడ్ 12 అప్‌డేట్‌ను గూగుల్ ఇప్పటికే పిక్సెల్‌ 6 ఫోన్‌లో పరిచయం చేసింది.  మరి ఇతర మొబైల్స్‌లో ఎప్పుడు అప్‌డేట్ కానుందనేది చూద్దాం.

Published : 11 Feb 2022 12:14 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది ఉపయోగించేది ఆండ్రాయిడ్ మొబైల్‌ ఫోన్లు. అందుకే గూగుల్ కంపెనీ ఏటా ఓఎస్‌ను అప్‌డేట్‌ చేస్తూ యూజర్లకు సరికొత్త ఫీచర్లను పరిచయం చేస్తుంది. ఈ ఏడాది కూడా ఆండ్రాయిడ్‌ కొత్త ఓఎస్‌ ఆండ్రాయిడ్ 12ను యూజర్లకు పరిచయం చేయనుంది. ఈ కొత్త ఓఎస్‌లో యూజర్‌ ఇంటర్‌ఫేస్‌ మారడంతోపాటు వన్‌హ్యాండ్ మోడ్‌, ప్రత్యేకమైన గేమింగ్‌ మోడ్‌, టేక్‌ మోర్ బటన్‌, యూఆర్‌ఎల్ షేరింగ్ వంటి ఎన్నో కొత్త ఫీచర్లను పరిచయం చేసింది. అయతే ఈ కొత్త ఓఎస్‌ను కొన్ని మొబైల్‌ కంపెనీలు తాజాగా విడుదల చేసిన మోడల్స్‌లో పరిచయం చేశాయి. మరికొన్ని కంపెనీలు త్వరలో విడుదల కాబోయే తమ కంపెనీ ఫోన్లలో పరిచయం చేయనున్నట్లు వెల్లడించాయి. మరి ఈ కొత్త ఓఎస్‌ను ఏయే కంపెనీలు ఎప్పుడెప్పుడు తీసుకొస్తున్నాయనేది చూద్దాం. 


షావోమి 

షావోమి ఆండ్రాయిడ్ 12 ఆధారిత ఎమ్‌ఐయూఐ 13 ఓఎస్‌ బీటా వెర్షన్‌ను గతేడాది ఆగస్టు నుంచి ఎమ్‌ఐయూఐ 11 ఆధారిత ఫోన్లలో అప్‌డేట్ చేస్తుంది. అయితే అధికారికంగా మాత్రం ఆండ్రాయిడ్ 12 ఆధారిత ఓఎస్‌ను షావోమి విడుదల చేయలేదు. అయితే షావోమి 12, షావోమి 12 ప్రో, షావోమి 12ఎక్స్‌, ఎంఐ 11 అల్ట్రా, ఎంఐ 11 ప్రో, ఎంఐ 11 మొబైల్స్‌లో మొదట ఈ ఓఎస్‌ అందుబాటులోకి రానుందని తెలుస్తోంది. ఫిబ్రవరి చివరికి లేదా మార్చి మొదటి వారంలో అప్‌డేట్ అవుతుందని సమాచారం. 


శాంసంగ్ 

శాంసంగ్ ఆండ్రాయిడ్ 12 ఆధారిత వన్‌యూఐ 4స్కిన్‌ ఓఎస్‌ బీటా వెర్షన్‌ను గెలాక్సీ ఎస్‌21, గెలాక్సీ జెడ్ ఫ్లిప్‌3, ఫోల్డ్3, గెలాక్సీ ఏ13 మోడల్స్‌లో పరిచయం చేసింది. త్వరలో పూర్తిస్థాయి వెర్షన్‌ను పరిచయం చేయనుంది. ముందుగా ఎస్‌20, ఎస్‌10 మోడల్స్‌తోపాటు గెలాక్సీ ఏ52 మోడల్‌కు ఈ అప్‌డేట్‌ను విడుదల చేయనున్నారు. ఏప్రిల్‌లో గెలాక్సీ ఏ32 వంటి మిడ్‌-రేంజ్‌, జులైలో గెలాక్సీ ఏ12, గెలాక్సీ ఏ03ఎస్‌ వంటి లో-ఎండ్‌ మోడల్స్‌లో పరిచయం చేస్తారని సమాచారం. తర్వాత శాంసంగ్ ఓఎస్‌ అప్‌డేట్ పాలసీ ప్రకారం మిగిలిన మోడల్స్‌లో ఆండ్రాయిడ్ 12 అప్‌డేట్ అవుతుందని టెక్‌ వర్గాలు చెబుతున్నాయి. 


వన్‌ప్లస్‌ & ఒప్పో & రియల్‌మీ 

ఆక్సిజన్‌ఓఎస్‌ 12 పేరుతో వన్‌ప్లస్‌ కంపెనీ కొత్త ఫోన్లలో ఓఎస్‌ అప్‌డేట్‌ను విడుదల చేసింది. అయితే అది కేవలం వన్‌ప్లస్‌, ఒప్పో కంపెనీల విలీనం తర్వాత రెండు కంపెనీల ఫోన్ల కోసం కొత్తగా విడుదల చేసిన అప్‌డేట్‌గా టెక్ వర్గాలు చెబుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో వన్‌ప్లస్ డిసెంబరులో విడుదల చేసిన వన్‌ప్లస్ 9, 9 ప్రో మోడల్స్‌లో ఆండ్రాయిడ్ 12ను విడుదల చేసింది. ఇందులో బగ్స్ ఎక్కువగా ఉండటంతో దాన్ని నిలిపివేసినట్లు సమాచారం. ప్రస్తుతం ఆండ్రాయిడ్ 12 ఆధారిత వన్‌ప్లస్‌ ఆక్సిజన్‌ఓఎస్‌ 13 పేరుతో మరో కొత్త అప్‌డేట్‌ను విడుదల చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఆక్సిజన్‌, కలర్‌ ఓఎస్‌ కలయికగా ఆండ్రాయిడ్ 12 ఫీచర్స్‌తో వన్‌ప్లస్‌, ఒప్పో ఫోన్ల కోసం కొత్త ఓఎస్‌ను పరిచయం చేస్తారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఏదేమైనప్పటికీ ఈ ఏడాది తొలి త్రైమాసికంలోనే ఆండ్రాయిడ్ 12ను యూజర్స్‌కు పరిచయం చేయనున్నట్లు సమాచారం. 


అసుస్‌

అసుస్‌ కంపెనీ గతేడాది డిసెంబరులో విడుదల చేసిన జెన్‌ఫోన్‌ 8, 8 ఫ్లిప్‌లో ఆండ్రాయిడ్  12ను పరిచయం చేసింది. అసుస్ గేమింగ్‌ ఫోన్లు రోగ్‌ ఫోన్5, 5ఎస్‌లలో 2022 తొలి త్రైమాసికంలో అప్‌డేట్ చేయనున్నట్లు తెలిపింది. అలానే అసుస్ జెన్‌ఫోన్‌ 7, రోగ్‌ ఫోన్‌ 3 మోడల్స్‌కు రెండో త్రైమాసికంలో అప్‌డేట్ చేయనుంది. 


గూగుల్ 

గతేడాది గూగుల్ పిక్సెల్‌ సిరీస్‌లో పిక్సెల్‌ 6, పిక్సెల్‌ 6 ప్రో మోడల్స్‌ను అక్టోబరు 19న విడుదల చేసింది. తొలిసారిగా ఆండ్రాయిడ్ 12ను గూగుల్ ఈ ఫోన్లలోనే పరిచయం చేసింది. అదేరోజుల ఆన్‌-ఎయిర్‌ ద్వారా పిక్సెల్‌ సిరీస్‌లోని అన్ని మోడల్స్‌ (పిక్సెల్ 3 సిరీస్, పిక్సెల్ 4 సిరీస్‌, పిక్సెల్ 5 సిరీస్‌)కు ఆండ్రాయిడ్ 12 అప్‌డేట్‌ను గూగుల్ పంపింది.  


నోకియా

నోకియా మాత్రం ఆండ్రాయిడ్ 12ను ఎప్పుడు అప్‌డేట్ చేయనుందనే దానిపై ఎలాంటి ప్రకటన చేయలేదు. గతేడాది డిసెంబరులో విడుదల చేసిన నోకియా ఎక్స్10లో ఆండ్రాయిడ్‌ 12 విడుదల చేస్తారని భావించినప్పటికీ కంపెనీ ఆండ్రాయిడ్‌ 11తోనే మార్కెట్లోకి తీసుకొచ్చింది. 


మోటోరోలా 

ఫిబ్రవరి చివరి వారానికి 2020-21 మధ్య కాలంలో విడుదలైన మోడల్స్‌లో ఆండ్రాయిడ్ 12 ఆధారిత ఓఎస్ అప్‌డేట్ అవుతుందని మోటోరోలా తెలిపింది. ఈ జాబితాలో ముందు వరుసలో మోటో రేజర్‌, మోటోరోలా ఎడ్జ్‌ సిరీస్‌ ఫోన్లు ఉన్నాయి. అయితే ఈ అప్‌డేట్ ప్రపంచవ్యాప్తంగా అన్ని మార్కెట్లకు వర్తిస్తుందా లేక ఎంపిక చేసిన మార్కెట్లకే పరిమితమవుతుందా అనేది మాత్రం వెల్లడించలేదు. ఆండ్రాయిడ్ 12తోపాటు మై యూఎక్స్‌ పేరుతో అదనపు ఫీచర్లను మోటోరోలా యూజర్లకు అందివ్వనుంది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని