Diwali Photography: దీపావళి ఫొటోలు బాగా రావాలంటే.. ఈ టిప్స్‌ ప్రయత్నించండి!

దీపాల వెలుగుల్ని, ఆకాశంలో తారాజువ్వల కాంతుల్ని అందంగా ఫొటో తీయాలనుకుంటున్నారా..? ఇంటిల్లిపాది చక్కగా ముస్తాబై సెల్ఫీలు దిగాలనుకుంటున్నారా..? పండుగ హడావుడిలో ప్రతి క్షణాన్ని గుర్తుండిపోయేలా ఫోన్‌ కెమెరాలో బంధించాలనుకుంటే ఈ టిప్స్‌ను ప్రయత్నించండి. 

Updated : 24 Oct 2022 17:57 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: దీపావళి పండుగ అనగానే చిన్నా, పెద్ద అని తేడా లేకుండా ప్రతి ఒక్కరూ టపాసులు కాల్చేందుకు ఉత్సాహం కనబరుస్తారు.  ఇంటిని దీపాలతో అలంకరించడం నుంచి మిఠాయిలు తినిపించడం,  కొత్త బట్టలు, బాణాసంచా వెలుగులు.. ఇలా ఎన్నో అనుభూతులను దీపావళి పండుగ తెస్తుంది.  ఈ క్షణాలు గుర్తుండిపోయేలా.. ప్రతి మూమెంట్‌ను క్యాప్చర్ చేస్తాం. మరి, మీ ఫోన్‌ కెమెరాతో బంధించే ప్రతి క్షణం అందంగా ఉండాలంటే.. ఈ టిప్స్‌ ప్రయత్నించి చూడండి. 

  • ఎక్కువ శాతం ఫొటోలు ఫోన్‌ వెనుకవైపు కెమెరాతో క్యాప్చర్‌ చేస్తుంటాం. అందుకోసమే.. ముందుగా కెమెరా లెన్స్‌పై ఎలాంటి దుమ్ము లేకుండా శుభ్రం చేసుకోవాలి. ఫొటో తీసేప్పుడు మోషన్ ట్రాకింగ్‌, హెచ్‌డీఆర్‌ మోడ్‌, గ్రిడ్ లైన్స్‌ వంటి ఫీచర్లు ఉపయోగించండి. వీటివల్ల ఫొటోలు కచ్చితత్వంతోపాటు, క్వాలిటీగా వస్తాయి. 
  • రాత్రిపూట ఎక్కువ ఫొటోలు తీస్తాం కాబట్టి.. ఫోన్ కెమెరాలో నైట్‌ మోడ్‌ ఉపయోగించండి. దానివల్ల ఫ్లాష్‌ అవసరం లేకుండా ప్రమిదలు, టపాసుల ఫొటోలు చక్కగా వస్తాయి. కొన్నిసార్లు ఫ్లాష్‌ ఉపయోగించడంవల్ల బ్యాగ్రౌండ్ ఆబ్జెక్ట్ మొత్తం చీకటిగా ఉండి.. ముందున్న ఆబ్జెట్‌ మీద మాత్రమే లైట్ పడుతుంది. 
  • ఆకాశంలో తారాజువ్వల వెలుగులను క్యాప్చర్‌ చేసేందుకు జూమ్‌ చేస్తుంటాం. ఫోన్ కెమెరా లెన్స్‌ పరిమితిని దాటి జూమ్‌ చేయడం వల్ల ఫొటో క్వాలిటీ తగ్గిపోతుంది.  కాబట్టి జూమ్‌ పరిమితి దాటకుండా టెలీఫొటో ఫీచర్‌ను ఉపయోగించడం మేలు. దానితోపాటు ఫోన్‌ను ట్రైపాడ్‌కు అటాచ్‌ చేస్తే ఫొటోలు బ్లర్‌ లేకుండా క్లారిటీగా వస్తాయి. 
  • నేచురల్‌ లుక్‌తో ఫొటో దిగడం ఇష్టం లేని వారు కెమెరా ఫిల్టర్స్‌ను ప్రయత్నించండి. ఇవి, మీ ఫొటోలకు కొత్త లుక్‌ను ఇవ్వడంతోపాటు, ఫొటో ఎడిటింగ్‌ పనిని కొంతమేర తగ్గిస్తాయి. వీటితోపాటు ప్రో, మాన్యువల్, స్పోర్ట్స్‌ మోడ్‌లలో కెమెరా షట్టర్‌ స్పీడ్, ఐఎస్ఓ, ఫోకర్‌ ఆప్షన్లను యూజర్ పరిస్థితులకు అనుగుణంగా మార్చుకోవచ్చు. దీనివల్ల షిల్‌అవుట్‌, షాడో వంటి వాటితోపాటు వేగంగా పేలే టపాసులు, తారాజువ్వలను కెమెరాలో బంధించుకునే అవకాశం ఉంటుంది. 
  • సెల్ఫీ తీసుకునేప్పుడు చుట్టుపక్కల లైటింగ్ ఉండేలా చూసుకోండి. దీపాల వెలుగులు ఫొటోకు మరింత అందాన్ని ఇవ్వడంతోపాటు, పండుగ వాతావరణాన్ని మరింత ఆహ్లాదంగా మారుస్తాయి. ఫోన్‌ కెమెరాలోని స్లో మోషన్‌ మోడ్‌తో కూడా టపాసులను వీడియో తీయొచ్చు. ఇవి, బాణాసంచా ఒత్తి అంటుకోవడం నుంచి పేలే వరకు ప్రతి క్షణాన్ని స్లో మోషన్‌లో అందంగా చూపిస్తాయి. 
  • చివరగా.. టపాసులు కాల్చేప్పుడు జాగ్రత్తగా ఉండండి. ప్రతి క్షణాన్ని కెమెరాలో బంధించాలనే అత్యుత్సాహంతో ప్రమాదాల బారిన పడకండి. పండుగను ఆనందంగా జరుపుకోండి. 
Read latest Technology News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని