iPhone SE3: యాపిల్‌ ఐఫోన్ ఎస్‌3.. ఐదు ఆసక్తికర విశేషాలు!

యాపిల్ కంపెనీ ఐఫోన్‌ ఎస్‌ఈ 3 మోడల్‌ను మార్చి 8న జరిగే వర్చువల్ ఈవెంట్‌లో విడుదల చేయనుంది. మరి ఈ ఫోన్‌లో ఎలాంటి ఫీచర్లు ఇస్తున్నారనేది తెలుసుకుందాం. 

Updated : 10 Feb 2022 14:09 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: యాపిల్ కంపెనీ మార్చి 8 తేదీన వర్చువల్ ఈవెంట్‌ నిర్వహించనుంది. ఇందులో యూజర్స్ ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న మూడో జనరేషన్ ఐఫోన్ ఎస్‌ఈ 3ను ఈ కార్యక్రమంలో విడుదల చేయనుందనే వార్తలు నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి. దీంతోపాటు యాపిల్ రెండు కొత్త మ్యాక్‌బుక్ ప్రో మోడల్స్‌, రెండు కొత్త ఐపాడ్‌లను విడుదల చేయనున్నట్లు సమాచారం. అయితే ఐఫోన్ ఎస్‌ఈ 3 ఫీచర్ల గురించి ప్రముఖ యాపిల్‌ అనలిస్ట్‌ మింగ్ చికూ ఆసక్తికర వివరాలను వెల్లడించారు. మరి ఆ ఫీచర్లపై ఓ లుక్కేద్దాం. 

ఐఫోన్ ఎస్‌ఈ అంటే?: చాలా మంది యూజర్లు ఐఫోన్ ఇతర ఫోన్ మోడల్స్‌ తరహాలోనే ఎస్‌ఈను ఒక మోడల్ అనుకుంటారు. కానీ ఎస్‌ఈ అంటే స్పెషల్ ఎడిషన్‌. యాపిల్ కంపెనీ ఎస్‌ఈ మోడల్‌ను తొలిసారిగా 2016లో విడుదల చేసింది. యాపిల్ ఫ్లాగ్‌షిప్‌ మోడళ్లకు భిన్నంగా అందుబాటు ధరలో ఒక ఫోన్‌ను తీసుకురావాలనే ఉద్దేశంతో ఎస్‌ఈను పరిచయం చేసింది. ఏటా కొత్త ఫోన్లను విడుదల చేసే యాపిల్‌, తొలి తరం ఎస్‌ఈ మోడల్‌ విడుదలైన నాలుగు సంవత్సరాలకు ఎస్‌ఈ 2ను విడుదల చేసింది. సెకండ్ జనరేషన్ వచ్చిన రెండేళ్లకు ఎస్‌ఈ 3ను తీసుకురానుంది.

డిజైన్‌లో మార్పులుంటాయా?: ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం ఎస్‌ఈ 3లో డిజైన్‌ పరంగా ఎలాంటి మార్పులు ఉండవు. ఎస్‌ఈ 2 తరహాలోనే ఉంటుందని మింగ్ చి కూ తెలిపారు. అంటే 4.7 అంగుళాల హెచ్‌డీ డిస్‌ప్లే, టచ్‌ ఐడీ హోమ్‌ బటన్‌ ఇస్తున్నారట. అలానే ఐపీ67 వాటర్‌, డస్ట్‌ రెసిస్టెంట్ ఫీచర్‌ ఉంటుందని సమాచారం. 

ప్రాసెసర్‌ మాటేంటి?: యాపిల్‌ ఐఫోన్ 13లో ఉపయోగించిన ఏ15 బయోనిక్‌ చిప్‌నే యాపిల్‌ ఎస్‌ఈ 3లో ఉపయోగించింది. దీంతో ఫోన్ పనితీరు మరింత మెరుగ్గా ఉంటుందని యాపిల్ చెబుతోంది. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న ఐఫోన్ ఎస్‌ఈ 2లో ఏ13 బయోనిక్ చిప్‌ను ఉపయోగించారు. 

కెమెరాలు: ఎస్ఈ 2లో మాదిరిగానే ఎస్‌ఈ 3లో కూడా రెండు కెమెరాలు ఇస్తున్నారు. వెనుక ఒకటి, ముందు ఒకటి ఉంటాయి. వెనుక వైపు 12 ఎంపీ కెమెరా, ముందు 7 ఎంపీ సెల్ఫీ కెమెరాలు అమర్చినట్లు తెలుస్తోంది. వెనుక కెమెరాలో వైడ్‌-యాంగిల్‌ ఫీచర్‌ ఇస్తున్నట్లు సమాచారం. 

5జీ ఉంటుందా?: అవుననే అంటున్నాయి టెక్‌ వర్గాలు. యాపిల్ ఎస్‌ఈ 3లో 5జీ సాంకేతికతను ఇస్తున్నట్లు సమాచారం. ఇందుకోసం ఫోన్‌లో క్వాల్‌కోమ్‌ ఎక్స్‌60 5జీ మోడెమ్‌ను ఉపయోగించారని తెలుస్తోంది. యాపిల్ ఈ ఫోన్‌ను మిడ్‌-రేంజ్‌లో తీసుకురావాలని భావిస్తోంది. ఐఫోన్‌ ఎస్‌ఈ 3 ధర రూ. 22 వేల నుంచి రూ. 30 వేల మధ్య ఉంటుందని మార్కెట్‌ వర్గాల అంచనా.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని