Music Players: ఐపాడ్ ప్రత్యామ్నాయాలివిగో.. వాటి ధరలు, ఫీచర్లు మీకోసం

కొద్దిరోజుల క్రితం యాపిల్ కంపెనీ ఐపాడ్‌ ఉత్పత్తిని నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఐపాడ్ ప్రత్యామ్నాయాలపై ఓ లుక్కేద్దామా..

Updated : 17 May 2022 14:41 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఐపాడ్ ఉత్పత్తిని నిలిపివేస్తున్నట్లు యాపిల్ ప్రకటించడం యాపిల్ అభిమానులను ఒక్కసారిగా షాక్‌కు గురిచేసింది. 2002లో యాపిల్ కంపెనీ ఐపాడ్‌ను పరిచయం చేసింది. ఇప్పుడు ఐపాడ్‌ను నిలిపేసిన నేపథ్యంలో ఐపాడ్‌ అందించే మ్యూజిక్‌ ఫీచర్లు కోరుకునే వారికి ప్రత్యామ్నాయంగా మార్కెట్లో అందుబాటులో ఉన్న ఉత్పత్తులపై ఓ లుక్కేద్దాం.


సోనీ వాక్‌మెన్‌

ఐపాడ్ నానో, షఫిల్ మోడల్స్‌కు పోటీగా సోనీ కంపెనీ వాక్‌మెన్‌ పేరుతో పోర్టబుల్ ఆడియో ప్లేయర్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది. ఐపాడ్‌ అందించే ఫీచర్లతో తక్కువ ధరకే లభించడంతో చాలా మంది వీటి కొనుగోలుకు మొగ్గు చూపారు. అప్పటి వరకు వాక్‌మెన్‌ అంటే క్యాసెట్ ప్లేయర్ మాత్రమే. అదే పేరుతో సోనీ కంపెనీ ఆడియో ప్లేయర్‌ను తీసుకొచ్చింది. ప్రస్తుతం సోనీ కంపెనీ ఐదు రకాల వాక్‌మెన్‌ మోడల్స్‌ను విక్రయిస్తోంది. వాటిలో రెండు డిస్‌ప్లే మోడల్స్‌ కాగా, ఒకటి యూఎస్‌బీ మోడల్‌, మిగిలిన రెండు నెక్‌ బ్యాండ్‌ మోడల్స్‌. ఇవి ₹ 4,990 నుంచి ₹ 25,990 మధ్య ధరల్లో అందుబాటులో ఉన్నాయి. 


ఏస్టెల్‌ అండ్‌ కెర్న్‌ 

యాపిల్, సోనీ తర్వాత మ్యూజిక్ ప్లేయర్స్‌ను ఏస్టెల్‌ అండ్‌ కెర్న్‌ కంపెనీ ఉత్పత్తి చేస్తోంది. హై క్వాలిటీ ఆడియో, 3.1-అంగుళాల డిస్‌ప్లే, 9 గంటల ప్లేబ్యాక్ టైమ్‌, 64 జీబీ మెమొరీ వంటి ఫీచర్లున్నాయి. ఇది దాదాపు అన్ని రకాల మ్యూజిక్ ఫార్మాట్లను సపోర్ట్ చేస్తాయి. భారతీయ మార్కెట్లో ఐదు మోడల్స్‌ అందుబాటులో ఉన్నాయి. వీటి ప్రారంభ ధర ₹ 59,990.  


మైటీ వైబ్‌ 

ఇవి చూసేందుకు అచ్చం ఐపాడ్‌ షఫిల్ మోడల్‌లానే ఉంటాయి. వెయ్యికిపైగా పాటలను ఇందులో స్టోర్ చేసుకోవచ్చు. ఈ డివైజ్‌ను స్పీకర్స్‌, హెడ్‌ఫోన్స్‌కు కనెక్ట్ చేసుకొని మ్యూజిక్‌ను ఆస్వాదించవచ్చు. బ్లూటూత్ కనెక్టివిటీ కూడా ఉంది. ఫోన్‌, ఇంటర్నెట్‌ సదుపాయం లేకుండానే స్పోటిఫై, అమెజాన్‌ మ్యూజిక్‌లను సపోర్ట్ చేస్తుంది. దీని ధర ₹ 11,000. 


సాన్‌డిస్క్‌

ఇందులో 8,000 పాటల వరకు స్టోర్‌ చేసుకోవచ్చు. ఐట్యూన్స్‌తోపాటు అన్ని రకాల మ్యూజిక్‌ ఫార్మాట్‌లను సపోర్ట్ చేస్తుంది. బిల్ట్‌-ఇన్‌ ఎఫ్‌ఎమ్‌ రేడియో ఫీచర్‌ కూడా ఉంది. 32 జీబీ/16 జీబీ/ 8 జీబీ స్టోరేజ్‌ వేరియంట్లతో 18 గంటల బ్యాటరీ లైఫ్‌ అందిస్తుంది. వీటి ప్రారంభ ధర ₹ 6,000. ఇవేకాకుండా అందుబాటు ధరల్లో మరికొన్ని కంపెనీల వాక్‌మెన్‌లు, మ్యూజిక్‌ ప్లేయర్లు మార్కెట్లో, ఈ-కామర్స్‌ వెబ్‌సైట్లలో ఉన్నాయి. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని