చాలా వస్తున్నాయ్‌... వెయిట్‌ చేయండి

గతేడాది కొవిడ్‌-19 ప్రభావంతో మార్కెట్లు మందగించినప్పటికీ సరికొత్త ఆవిష్కరణలతో టెక్ కంపెనీలు గ్యాడ్జెట్‌ ప్రియులను ఆకట్టుకున్నాయి. అలానే రాబోయే రోజుల్లో వివిధ విభాగాల్లో మరొకొన్ని కొత్త మొబైల్స్‌ మార్కెట్లోకి రానున్నాయి....

Updated : 09 Feb 2021 14:31 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: గతేడాది కొవిడ్‌-19 ప్రభావంతో మార్కెట్లు మందగించినప్పటికీ సరికొత్త ఆవిష్కరణలతో టెక్ కంపెనీలు గ్యాడ్జెట్‌ ప్రియులను ఆకట్టుకున్నాయి. కొత్త సంవత్సరంలో కూడా అదే ఒరవడిని కొనసాగిస్తూ జనవరి నెలలో బడ్జెట్‌, మిండ్ రేంజ్‌, 5జీ, ఫ్లాగ్‌షిప్‌ మోడళ్లను తీసుకొచ్చాయి మొబైల్ కంపెనీలు. అలానే రాబోయే రోజుల్లో వివిధ విభాగాల్లో మరికొన్ని కొత్త మొబైల్స్‌ మార్కెట్లోకి రానున్నాయి. అవేంటో.. వాటిలో ఎలాంటి ఫీచర్లు ఇస్తున్నారు.. ఎప్పుడు విడుదల చేస్తారో ఒక్కసారి చూద్దాం. ఇన్ని మొబైల్స్‌ వస్తున్నాయ్‌ కాబట్టి కొత్త ఫోన్‌ కొందామంటే వెయిట్‌ చేయొచ్చేమో!


శాంసంగ్ గెలాక్సీ ఎఫ్‌62

శాంసంగ్ గెలాక్సీ ఎఫ్‌ సిరీస్‌లో కొత్త మోడల్‌ను తీసుకొస్తున్నారు. ఇప్పటికే ఈ సిరీస్‌లో గెలాక్సీ ఎఫ్ 41 ఫోన్‌ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. త్వరలో దానికి కొనసాగింపుగా గెలాక్సీ ఎఫ్‌62 మోడల్‌ రానుంది. ఫిబ్రవరి 15న భారత మార్కెట్లోకి విడుదల చేస్తారని సమాచారం. ఈ ఫోన్‌లో ఎక్సినోస్‌ 9825 ప్రాసెసర్‌ ఉపయోగించారు. 6.7-అంగుళాల అమోలెడ్‌ డిస్‌ప్లే ఇస్తున్నారు. ఆండ్రాయిడ్ 11 ఆధారిత వన్ యూఐ 3.1 ఓఎస్‌తో పనిచేస్తుంది. 7,000 ఎంఏహెచ్‌ బ్యాటరీ ఇస్తున్నారు. క్వాడ్‌ కెమెరా ఉన్న ఈ ఫోన్‌లో 64 ఎంపీ ప్రైమరీ కెమెరా అందిస్తున్నారు. సెల్ఫీల కోసం 32 ఎంపీ కెమెరా ఇస్తున్నారు. సైడ్‌ మౌంట్‌ ఫింగర్‌ ప్రింట్ రీడర్ ఉంటుంది. 8జీబీ/128జీబీ  వేరియంట్ ధర రూ. 25,000 ఉంటుందని మార్కెట్‌ వర్గాల అంచనా.


నోకియా 5.4

హెచ్‌ఎండీ గ్లోబల్‌ సంస్థ నోకియా 5.4 మోడల్‌ను ఫిబ్రవరి 10న భారత మార్కెట్లోకి విడుదల చేయనుంది. ఈ ఫోన్ 4జీబీ/ 64జీబీ, 4జీబీ/128జీబీ, 6జీబీ/64జీబీ వేరియంట్లో లభిస్తుందని సమాచారం. దీని ప్రారంభ ధర రూ.16,000 ఉంటుందని అంచనా. ఆండ్రాయిడ్‌ 10‌తో పనిచేసే ఈ ఫోన్‌లో 6.39 అంగుళాల హెచ్‌డీ+ డిస్‌ప్లే ఇస్తున్నారు. స్నాప్‌డ్రాగన్‌ 662 ప్రాసెసర్‌ ఉపయోగించారు. వెనుకవైపు గుండ్రటి డిజైన్ ఆకృతిలో 48 ఎంపీ ప్రైమరీ కెమెరాతో పాటు నాలుగు కెమెరాలు ఇస్తున్నారు. ముందు 16 ఎంపీ సెల్ఫీ కెమెరా ఉంది. అద్భుతమైన ఆడియో అనుభూతి కోసం ఓజో ఆడియోతో రెండు మైక్రోఫోన్లు ఉన్నాయి. 4,000 ఎంఏహెచ్‌ బ్యాటరీ ఉండనుంది. 


వన్‌ప్లస్‌ 9 ప్రో


(Photo Credit: Dave2D)

9 ప్రో పేరుతో వన్‌ప్లస్‌ కంపెనీ మరో కొత్త ఫ్లాగ్‌షిప్‌ మోడల్‌ను తీసుకొస్తోంది. దీనికి సంబంధించిన వివరాలను డేవ్‌2డీ అనే యూట్యూబ్‌ ఛానెల్‌ వెల్లడించింది. ఇందులో రెండు పెద్ద కెమెరాలతో పాటు రెండు సాధారణ కెమెరాలు ఇస్తున్నారు. అంటే వెనుకవైపు మొత్తం నాలుగు కెమెరాలు ఉంటాయన్నమాట. ఈ ఫోన్‌లో కెమెరాల కోసం వన్‌ప్లస్‌ కంపెనీ స్వీడన్‌కు చెందిన హ్యాసెల్‌బ్లాడ్‌తో కలిసి పనిచేసింది. ఇందులో ఎల్‌ఈడీ ఫ్లాష్‌, లేజర్‌ ఆటోఫోకస్‌ ఉన్నాయి. 129Hz రిఫ్రెష్‌ రేట్‌తో క్యూహెచ్‌డీ+ డిస్‌ప్లే ఇస్తున్నారు. స్నాప్‌డ్రాగన్‌ 888 ప్రాసెసర్‌ ఉపయోగించారు. 12జీబీ /256 జీబీ వేరియంట్లో ఈ ఫోన్ లభిస్తుంది. 


వివో  ఐక్యూఓఓ నియో5 

మార్చి నెలలో వివో కంపెనీ కూడా కొత్త మోడల్‌ ఫోన్‌ని మార్కెట్లోకి తీసుకొస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం వి2055ఏ పేరుతో ఈ మోడల్ వివరాలు గూగుల్ ప్లే కన్సోల్‌లో నమోదైనట్లు టెక్‌ వర్గాలు తెలిపాయి. ఈ ఫోన్‌లో స్నాప్‌డ్రాగన్‌ 870 ప్రాసెసర్‌ను ఉపయోగించారని సమాచారం. ఆండ్రాయిడ్ 11 ఓఎస్‌తో పనిచేస్తుందట. 8జీబీ /128జీబీ, 12జీబీ ర్యామ్/ 256జీబీ వేరియంట్లలో తీసుకొస్తున్నారని తెలుస్తోంది. 2400x1080 పిక్సెల్ రిజల్యూషన్‌తో అమోలెడ్ డిస్‌ప్లే ఇస్తున్నారట. అలానే 88 వాట్‌ ఛార్జింగ్‌ సపోర్ట్ చేస్తుందట.


మోటోరోలా ఇబిజా

మోటోరోలా కంపెనీ తొలి బడ్జెట్‌ 5జీ ఫోన్‌ మార్చి నెలలో భారత మార్కెట్లోకి తీసుకురానుంది. మోటోరోలా ఇబిజా పేరుతో ఈ ఫోన్‌ విడుదల కానుంది. ఇది ఆండ్రాయిడ్ 11 ఓఎస్‌తో పనిచేస్తుంది. 90Hz రిఫ్రెష్‌ రేటుతో హెచ్‌డీ+ డిస్‌ప్లే ఇస్తున్నారు. స్నాప్‌డ్రాగన్ 480 ప్రాసెసర్‌ను ఉపయోగించారు. మొత్తం నాలుగు కెమెరాలు ఉంటాయి. వెనుకవైపు 48 ఎంపీ ప్రధాన కెమెరా, సెల్ఫీల కోసం 13 ఎంపీ కెమెరా ఇస్తున్నారు. 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. 4జీబీ/ 128జీబీ, 6జీబీ/128జీబీ వేరియంట్లలో లభిస్తుంది. ధర గురించి తెలియాల్సి ఉంది.


శాంసంగ్‌ గెలాక్సీ ఏ52


(Photo Credit: Oneleaks Voice) 

గతంలో విడుదల చేసిన గెలాక్సీ ఏ51 మోడల్‌కు కొనసాగింపుగా శాంసంగ్ కంపెనీ మరో కొత్త మోడల్‌ను తీసుకొస్తోంది. గెలాక్సీ ఏ52 పేరుతో రానున్న ఈ ఫోన్ వన్‌ప్లస్‌ నార్డ్‌, రియల్‌మీ ఎక్స్‌7లతో పోటీపడనుంది. మార్చిలో ఈ ఫోన్‌ను విడుదలచేయనున్నారు. 5జీ, 4జీ వేరియంట్లలో లభిస్తుందని సమాచారం. పంచ్‌ హోల్ కటౌట్‌తో 6.52 అంగుళాల సూపర్ అమోలెడ్ డిస్‌ప్లే ఇస్తున్నారు. స్నాప్‌డ్రాగన్‌ 750జీ ప్రాసెసర్‌ ఉపయోగించారు. ఆండ్రాయిడ్ 11 ఆధారిత వన్‌యూఐ 3.0 ఓఎస్‌తో ఈ ఫోన్ పనిచేస్తుంది. 64 ఎంపీ ప్రైమరీ కెమెరాతో పాటు అల్ట్రా-వైడ్, మాక్రో, డెప్త్‌ సెన్సర్‌ కెమెరాలు ఇస్తున్నారు. 4,500 ఎంఏహెచ్‌ బ్యాటరీ ఉండనుంది. ఫాస్ట్‌ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. 6జీబీ / 128జీబీ వేరియంట్లో తీసుకొస్తున్నారు. దీని ప్రారంభ ధర రూ.40,000 ఉంటుందని మార్కెట్‌ వర్గాల అంచనా. 


వివో ఎస్‌9 & ఎస్‌7టీ 5జీ 

వివో కంపెనీ ఎస్‌ సిరీస్‌లో రెండు 5జీ ఫోన్లను తీసుకొస్తోంది. ఎస్‌9, ఎస్‌7టీ పేరుతో వీటిని విడుదల చేయనున్నారు. ఎస్‌9 మోడల్‌లో 90Hz రిఫ్రెష్‌ రేట్‌తో ఫుల్‌ హెచ్‌డీ ఓఎల్‌ఈడీ డిస్‌ప్లే ఇస్తున్నారట. ఆండ్రాయిడ్ 11 ఓఎస్‌తో పనిచేస్తుందని సమాచారం. 4,000 ఎంఏహెచ్‌ బ్యాటరీ ఉంటుందని తెలుస్తోంది. ఇది 33 వాట్‌ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేయనుంది. సెల్ఫీల కోసం 44 ఎంపీ కెమెరా, వెనక వైపు 64 ఎంపీ డిజిటల్ కెమెరా ఇస్తున్నారట. మీడియాటెక్ డైమెన్సిటీ 1100 ప్రాసెసర్‌ ఉపయోగించారని తెలుస్తోంది. 12జీబీ /256 జీబీ వేరియంట్లో తీసుకొస్తున్నారని సమాచారం.  

ఎస్‌7టీలో 6.44-అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ డిస్‌ప్లే ఇస్తున్నారు. మీడియాటెక్ డైమెన్సిటీ 820 ప్రాసెసర్ ఉపయోగించారు. ఆండ్రాయిడ్ 11 ఆధారిత ఓఎస్‌తో పనిచేస్తుంది. వెనుకవైపు 64 ఎంపీ, సెల్ఫీల కోసం 44+8 డ్యూయల్‌ కెమెరాలు అమర్చినట్లు సమాచారం. 4,000 ఎంఏహెచ్‌ బ్యాటరీ 33 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. 8జీబీ‌/ 128జీబీ ధర రూ. 30వేలు పైనే ఉంటుందని మార్కెట్‌ వర్గాల అంచనా. 


ఒప్పో ఎఫ్‌19

ఒప్పో కూడా ఎఫ్‌ 19 సిరీస్‌లో రెండు కొత్త ఫోన్లను మార్చి నెలలో మార్కెట్లోకి  విడుదల చేయనుంది. గతేడాది సెప్టెంబర్ నెలలో విడుదల చేసిన ఎస్‌17 మోడల్‌కు కొనసాగింపుగా ఎఫ్‌19, ఎఫ్19 ప్రో ఫోన్లను తీసుకొస్తున్నారు. వీటిలో ఫుల్‌ హెచ్‌డీ+ డిస్‌ప్లే ఇస్తున్నారట. ఇన్‌-డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్, 64 ఎంపీ/48 ఎంపీ కలయికలో ట్రిపుల్‌ లేదా క్వాడ్ కెమెరాలు ఉంటాయని తెలుస్తోంది. ఈ ఫోన్‌కు సంబంధించిన ఇతర వివరాలు తెలియాల్సి ఉంది. 


శాంసంగ్‌ గెలాక్సీ ఏ12 

మధ్యశ్రేణి మార్కెట్‌ కోసం శాంసంగ్ గెలాక్సీ ఏ12 మోడల్‌ను వచ్చే వారంలో భారత్‌లో విడుదల చేయనుంది. మొత్తం మూడు వేరియంట్లలో ఈ ఫోన్ లభిస్తుంది. 3జీబీ‌/ 32జీబీ, 4జీబీ ‌/64జీబీ, 6జీబీ ‌/128జీబీ వేరియంట్లో తీసుకొస్తున్నారు. ఈ ఫోన్‌ ప్రారంభ ధర రూ. 16,000 ఉంటుందని మార్కెట్‌ వర్గాల అంచనా. ఈ ఫోన్‌లో ఆక్టాకోర్ ప్రాసెసర్‌ ఉపయోగించారు. 6.5 అంగుళాల హెచ్‌డీ+ ఇన్ఫినిటీ-వి డిస్‌ప్లే ఇస్తున్నారు. ఇందులో మొత్తం ఐదు కెమెరాలున్నాయి. వెనుకవైపు 48 ఎంపీ ప్రైమరీ కెమెరాతో పాటు 5 ఎంపీ అల్ట్రా- వైడ్ యాంగిల్ కెమెరా, 2 ఎంపీ కెమెరాలు రెండు ఇస్తున్నారు. ముందు 8 ఎంపీ సెల్ఫీ కెమెరా అమర్చారు. 5,000 ఎంఏహెచ్‌ బ్యాటరీ ఉంటుంది. 15 వాట్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. సైడ్ మౌంట్ ఫింగర్‌ ప్రింట్ సెన్సర్‌ ఉండనుంది.


ఐఫోన్ ఎస్‌ఈ3  

గతేడాది ఎస్‌ఈ సిరీస్‌లో యాపిల్ ఐఫోన్ ఎస్‌ఈ 2 మోడల్‌ను తీసుకొచ్చింది. ఇందులో బయోనిక్‌ ఏ13 ప్రాసెసర్‌ను ఉపయోగించారు. అయితే డిస్‌ప్లే, కెమెరాలో పెద్దగా మార్పులు లేకపోవడంతో యూజర్స్ నిరాశ చెందారు. దీంతో ఐఫోన్ ఎస్ఈ3 మోడల్‌లో కీలక మార్పులు చేయనున్నట్లు టెక్‌ వర్గాల సమాచారం. ఈ మేరకు ఎస్‌ఈ3లో 6.1 అంగుళాల ఎల్‌సీడీ నాచ్‌ డిస్‌ప్లే ఇవ్వనున్నారట. 120 డిగ్రీ అల్ట్రా-వైడ్ యాంగిల్ రెండు 12 ఎంపీ కెమెరాలు ఇస్తున్నారట. ఇది ఆప్టికల్ ఇమేజ్‌ స్టెబిలైజేషన్‌ని కూడా సపోర్ట్ చేస్తుందట. బయోనిక్‌ ఏ14 ప్రాసెసర్‌ను ఉపయోగిస్తారని సమాచారం. 5జీ సపోర్ట్ చేస్తుందట. సైడ్ ఫింగర్‌ ప్రింట్ సెన్సర్‌ ఉంటుందని తెలుస్తోంది. 2022 నాటికి ఈ మోడల్‌ని విడుదల చేస్తారని మార్కెట్లో వర్గాల అంచనా. 

ఇవీ చదవండి..

ఫోన్ కెమెరాతో హార్ట్‌ రేట్ ట్రాకింగ్.. 

ఫోన్‌ ఛార్జింగ్‌..మీరూ ఈ తప్పులు చేస్తున్నారా..?

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు