Published : 11/01/2021 21:36 IST

వాట్సాప్‌ వద్దా..ఇవిగో వీటిని ప్రయత్నించండి..

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఇటీవల ఒక భర్తని భార్య ఇలా అడిగిందట. ఎందుకు ఈ మధ్య మీరు ప్రతి విషయాన్ని చిన్నగా వినిపించి..వినపించకుండా చెప్తుతున్నారు..ఏమైంది మీకు అని. అందుకు భర్త ఇలా సమాధానామిచ్చాడు..మనం మాట్లాడే ప్రతి మాటని కొందరు వింటున్నారు. వారికి వినబడకూడదని ఇలా మాట్లాడుతున్నాను అంటూ భార్యకి బదులిచ్చాడట సదరు భర్త. ఇదీ గత కొద్ది రోజులుగా వాట్సాప్‌ కొత్త పాలసీని ఉద్దేశిస్తూ సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్న జోకు. ఇదే కాదు ఎంతో మంది యూజర్స్‌ మరి కొద్ది రోజులు మాత్రమే వాట్సాప్‌లో అందుబాటులో ఉంటామని..తర్వాత సిగ్నల్‌కి మారిపోతున్నామంటూ..అందరూ సిగ్నల్‌ యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకోవాలని కోరుతూ కొద్ది రోజులుగా తమ వాట్సాప్ గ్రూపుల్లో మెసేజ్‌లు పంపుతున్నారు. వాట్సాప్‌ తీసుకొస్తున్న కొత్త పాలసీపై యూజర్స్‌ ఏ స్థాయిలో అసంతృప్తితో ఉన్నారనేది దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. 

గతంలో ఏదైనా కంపెనీ తమ విదివిధానాల్లో మార్పులు చేస్తే వాటిని అంగీకరించాలా వద్దా అనేది యూజర్స్‌ చేతుల్లో ఉండేది. కానీ ఫేస్‌బుక్‌ అనుబంధ సంస్థ వాట్సాప్‌ తాజా పాలసీని తప్పనిసరిగా అంగీకరించాల్సిందే. ఫిబ్రవరి 8 నుంచి అమల్లోకి రానున్న ఈ కొత్త పాలసీని ప్రతి యూజర్‌‌ తప్పక అంగీకరించాల్సిందేనని వాట్సాప్‌ స్పష్టం చేసింది. లేదంటే ఆ రోజు నుంచి వారి వాట్సాప్‌ ఖాతా పనిచేయదని తెలిపింది. ఈ నిబంధన యూజర్స్‌కి తీవ్ర ఆగ్రహం తెప్పించింది. దీంతో వాట్సాప్‌ ప్రత్యామ్నాయాలపై దృష్టి సారించారు. అంతేకాదు ప్రపంచ కుబేరుడు ఎలాన్‌ మస్క్‌ కూడా వాట్సాప్‌ నిర్ణయాన్ని తప్పుబడుతూ యూజర్స్‌ అందరు సిగ్నల్  ఉపయోగించాలని సూచించాడు. ఈ నేపథ్యంలో వాట్సాప్‌కు ప్రత్యామ్నాయాలు ఏంటి..అవి ఎలా పనిచేస్తాయో చూద్దాం..


సిగ్నల్‌ (Signal)

వాట్సాప్‌కు బదులుగా ఇటీవల ఎక్కువ వినిపిస్తున్న పేరు సిగ్నల్‌. వాట్సాప్‌ తరహాలోనే ఇది కూడా ఎండ్‌-టు-ఎండ్‌ ఎన్‌క్రిప్షన్‌ ప్రొటోకాల్‌తో పనిచేస్తుంది. కొద్ది రోజుల ముందు వరకు ఈ యాప్‌ను ఎక్కువగా జర్నలిస్టులు, విద్యావేత్తలు, పరిశోధకులు మాత్రమే ఉపయోగించేవారు. ఎలాన్‌ మస్క్‌ ట్వీట్‌ తర్వాత ఈ యాప్‌ డౌన్‌లోడ్‌లు పెరిగిపోయాయి. ఒకానొక దశలో యూజర్‌ రిజిస్ట్రేషన్‌ కోసం ఓటీపీలు పంపలేక సిగ్నల్‌ టీమ్‌ చేతులెత్తేసిందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. అయితే ఇది ఓపెన్ సోర్స్‌ ప్రొటోకాల్ కావడంతో భద్రత, గోప్యతపై పలువురు సందేహాలు లేవనెత్తారు. వాట్సాప్‌ తరహాలోనే ఇందులో కూడా డిస్‌అప్పియరింగ్ మెసేజెస్‌, స్క్రీన్‌ లాక్‌, గ్రూప్‌ ఛాట్ సెక్యూరిటీ, వీడియో/ఆడియో కాల్ ఫీచర్స్‌ ఉన్నాయి. అన్ని రకాల డివైజ్‌లను ఇది సపోర్ట్ చేస్తుంది. సిగ్నల్‌ యూజర్‌ ఫోన్ నంబర్‌ మినహా ఇతర వివరాలను సేకరించదు. 


టెలిగ్రాం (Telegram) 

సిగ్నల్, వాట్సాప్‌ మాదిరి టెలిగ్రాం సంభాషణలు ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్‌ కాదు. కానీ ఇందులో సీక్రెట్ ఛాట్ ఫీచర్‌ ద్వారా మనకు కావాల్సిన వ్యక్తులతో సురక్షితంగా సంభాషించవచ్చు. అంతేకాదు టైం లిమిట్‌తో సందేశాలను పంపుకోవచ్చు. అవతలి వ్యక్తి వాటిని చూసిన వెంటనే మీరు పెట్టిన టైం లిమిట్‌ లోపల అవి డిలీట్ అయిపోతాయి. ఇందులో మెసేజ్‌ ఛాట్‌తో పాటు ఆడియో/వీడియో కాల్స్ మాట్లాడుకోవచ్చు. 1.5జీబీ సామర్థ్యం కలిగిన ఫైల్స్‌ని పంపుకోవచ్చు. ఒక గ్రూపులో‌ సుమారు 2 లక్షల మందిని యాడ్ చెయ్యొచ్చు. ఆండ్రాయిడ్, ఐఓఎస్‌, విండోస్‌, విండోస్‌ ఎన్‌టీ, మాక్‌ఓఎస్‌, లైనెక్స్‌ ఓఎస్‌లను సపోర్ట్ చేస్తుంది. టెలిగ్రాం యూజర్‌ ఫోన్‌ నంబర్‌, కాంటాక్ట్స్‌, యూజర్ ఐడీ వివరాలను ప్రైవసీ నిబంధనలకు లోబడి సేకరిస్తుంది. 


వైబర్‌ (Viber) 

వాట్సాప్‌కి ప్రత్యామ్నాయంగా అందుబాటులో ఉన్న మరో యాప్‌ వైబర్‌. ఇది ఎండ్‌-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్‌ని సపోర్ట్ చేస్తుంది. అన్ని రకాల మెసేజ్‌లు, ఫొటోలు, వీడియోలు, ఆడియో/వీడియో కాల్స్‌, గ్రూప్‌ ఛాట్స్‌ ఎన్‌క్రిప్ట్‌ చేయబడతాయి. మన ఛాటింగ్‌ను గూగుల్ డ్రైవ్‌లో స్టోర్‌ చేసుకుని కావాల్సినప్పుడు వాటిని తిరిగి రీస్టోర్‌ చేసుకోవచ్చు. ఈ యాప్‌ ఆండ్రాయిడ్, ఐఓఎస్‌, విండోస్‌  ఓఎస్‌లను సపోర్ట్ చేస్తుంది. ఒక గ్రూప్‌లో 250 మందిని సభ్యులుగా చేర్చుకోవచ్చు. ఇందులో కూడా టెలిగ్రాం తరహాలోనే సీక్రెట్ ఛాట్‌ ఫీచర్ ఉంది. అయితే ఈ యాప్‌ కూడా యూజర్‌ నుంచి లొకేషన్‌, డివైజ్‌ ఐడీ, ఫోన్‌ నంబర్‌, యూజర్‌ ఐడీ, ఈ-మెయిల్ ఐడీ, పేరు, కాంటాక్ట్స్‌ వంటి వివరాలను సేకరిస్తుంది. 


ఎలిమెంట్స్‌ (Elyments) 

చైనా యాప్‌లపై నిషేధం తర్వాత పూర్తి దేశీయ పరిజ్ఞానంతో రూపుదిద్దుకున్న తొలి దేశీయ సోషల్ మీడియా యాప్‌ ఎలిమెంట్స్‌. ఈ యాప్‌ ద్వారా యూజర్స్‌ ఉచితంగా ఆడియో/వీడియో కాల్స్‌, వ్యక్తిగత/గ్రూప్‌ ఛాట్స్‌ చేసుకోవచ్చు. ఎండ్‌-టు-ఎండ్‌ ఎన్‌క్రిప్షన్‌ని సపోర్ట్‌ చేస్తుంది. సుమారు ఎనిమిది భారతీయ భాషల్లో ఈ యాప్‌ అందుబాటులో ఉంది.


 థ్రీమా (Threema)

స్విట్జర్లాండ్‌కు చెందిన థ్రీమా యాప్‌ కూడా వాట్సాప్‌లానే ఎండ్‌-టు-ఎండ్‌ ఎన్‌క్రిప్షన్‌ మెసేజ్‌లు, గ్రూప్‌ ఛాట్స్‌, ఫైల్స్‌, స్టేటస్‌ మెసేజ్‌లు, ఆడియో/వీడియో కాల్స్‌ని సపోర్ట్ చేస్తుంది. యూజర్‌ నుంచి ఈ యాప్‌ ఎలాంటి డేటా సేకరించదు. అలానే యూజర్స్‌ పంపే సందేశాలు అవతలి వ్యక్తులకు డెలివరీ అయిన వెంటనే డిలీట్ అయిపోతాయి. అయితే ఈ యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకోవాలంటే 2.99 డాలర్లు చెల్లించాలి. గూగుల్‌ ప్లే స్టోర్‌, యాపిల్‌ యాప్‌ స్టోర్ ‌నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. 


కిక్‌  (Kik) 

ఈ యాప్‌లో ఉపయోగించాలంటే ఫోన్‌ నంబర్‌తో పనిలేదు. కేవలం మెయిల్ ఐడీతో రిజిష్టర్‌ చేసుకోవచ్చు. ఛాటింగ్‌లను ఫోన్‌లో స్టోర్ చేసుకోవచ్చు. కానీ యాప్‌ని ఒకే యూజర్‌ ఐడీతో వేరే డివైజ్‌లో ఉపయోగిస్తే ఛాట్ డేటా మొత్తం డిలీట్ అవుతుంది. ఫొటోలు, వీడియోలు, గిఫ్‌లు, గేమ్స్‌ను ఈ యాప్‌ ద్వారా స్నేహితులతో షేర్ చేసుకోవచ్చు.  


వైర్‌ (Wire) 

 ఈ యాప్‌ని స్కైప్‌ సహ వ్యవస్థాపకుడు జానస్‌ ఫ్రిస్‌ రూపొందించాడు. ఎండ్‌-టు-ఎండ్‌ ఎన్‌క్రిప్షన్‌ని సపోర్ట్ చేస్తుంది. ఫైల్స్‌, డాక్యుమెంట్స్‌, వెబ్‌ లింక్‌ షేరింతో పాటు ఆడియో/వీడియో కాల్స్‌ చేసుకోవచ్చు. వ్యాపారపరంగా ఆన్‌లైన్ సమావేశాలు నిర్వహించే వారికి ఈ యాప్‌ ఎంతో ఉపయోగకరం. 


 

ఇవీ చదవండి..

ఐఫోన్‌ vs ఆండ్రాయిడ్‌: ఎవరు గెలిచారు?

గూగుల్‌ సెర్చ్‌లో వివరాలు.. వాట్సాప్‌ క్లారిటీ

Read latest Technology News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని