Published : 31 Dec 2020 19:19 IST

2020లో నిషేధించిన పాపులర్ యాప్స్‌..

ఇంటర్నెట్‌ డెస్క్‌: 2020..ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్కరికి గుర్తుండిపోయే ఏడాది. కొవిడ్-19 మిగిల్చిన చేదు జ్ఞాపకాలతో పాటు గత కొద్ది నెలలుగా చైనాతో సరిహద్దు వివాదంపై ప్రతిష్ఠంభన, ఈ నేపథ్యంలో ఆ దేశంతో జరిగిన ఘర్షణలో 20 భారత జవాన్లు అమరులవ్వడం వంటి ఘటనలు చోటుచేసుకున్నాయి. భారత్‌తో సరిహద్దుల్లో కయ్యానికి కాలు దువ్వుతున్న చైనాను కట్టడి చేసేందుకు భారత్‌ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే చైనాకు చెందిన సుమారు 150కి పైగా యాప్‌లపై భారత్‌ నిషేధం విధించిన సంగతి తెలిసిందే. 

ఈ యాప్‌ల వల్ల భారత సార్వభౌమత్వం, సమగ్రత, ప్రజల వ్యక్తిగత గోప్యతకు భంగం వాటిల్లుతుందని ఐటీ చట్టంలోని 69-ఏ కింద వీటిని నిషేధిస్తున్నట్లు భారత ప్రభుత్వం ప్రకటించింది. వీటిలో చాలా వరకు భారత ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా మార్పులు చేసి తిరిగి తమ సేవలను ప్రారంభించేందుకు సిద్ధమైపోతున్నాయి. ఈ నేపథ్యంలో 2020లో భారత్‌లో అత్యంత ప్రజాదరణ కలిగి నిషేధానికి గురైన యాప్స్‌ ఏంటో ఒక్కసారి చూద్దాం..


టిక్‌టాక్‌

15 సెకన్ల నిడివితో చిన్న చిన్న వీడియోలు రూపొందించేందుకు ఎక్కువ మంది ఉపయోగించే యాప్‌గా టిక్‌టాక్‌ ఎంతో పాపులర్. నిషేధానికి గురయ్యేనాటికి భారత దేశంలో సుమారు నెలకు 120 మిలియన్‌ యాక్టివ్ యూజర్స్ ఉన్నారంటే..ఈ యాప్‌ ఎంత పాపులరో అర్థం చేసుకోవచ్చు. చైనాకు చెందిన బైట్‌డాన్స్‌ రూపొందించిన యాప్‌ను భారత్‌ నిషేధిచండంతో టిక్‌టాక్‌ యూజర్స్‌ తీవ్ర నిరాశకు గురైనప్పటికీ తర్వాత ప్రత్యామ్నాయాలపై దృష్టి సారించారు. ఇందులో భాగంగా పూర్తి స్వదేశ పరిజ్ఞానంతో రూపొందిన చింగారీ యాప్‌తో పాటు, ఇన్‌స్టాగ్రాం రీల్స్‌, యూట్యూబ్ షార్ట్స్‌, ఫేస్‌బుక్‌ షార్ట్‌ వంటి వాటి వినియోగం పెరిగింది.  


పబ్‌జీ

మా వాడితో పెద్ద చిక్కొచ్చి పడిందండీ..ఎంత చెప్పినా వినడు..ఎప్పుడూ మొబైల్‌లో పబ్‌జీ ఆడుతుంటాడు. ఇది పబ్‌జీ నిషేధానికి ముందు వరకు పిల్లలపై తల్లిదండ్రుల ఫిర్యాదు. పబ్‌జీకి బానిసలైన కొంత మంది గేమ్‌ నిషేధం తర్వాత ఆత్మహత్యకు పాల్పడ్డ ఘటనలు చోటుచేసుకున్నాయి. పబ్‌జీ ఆటపై నిషేధం తర్వాత దేశీయంగా తల్లిదండ్రుల నుంచి హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో పబ్‌జీకి ధీటుగా ఫౌజీ పేరుతో కొత్త ఆటను రూపొందిస్తున్నట్లు బాలీవుడ్ నటుడు అక్షయ్‌కుమార్‌ ప్రకటించారు. ఇదిలాఉంటే..చైనా కంపెనీతో తెగతెంపులు చేసుకుని మైక్రోసాఫ్ట్‌కు చెందిన అజ్యూర్‌తో కలిసి కొత్త లుక్‌తో పబ్‌జీ గేమ్‌ను భారత్‌లో విడుదల చేస్తున్నట్లు పబ్‌జీ కార్పొరేషన్‌ మాతృ సంస్థ క్రాప్టన్‌ వెల్లడించింది. 


కామ్‌స్కానర్‌

ఈ యాప్‌తో డాక్యుమెంట్స్, ఫొటోలు స్కాన్‌ చేసి జేపీజీ, పీడీఎఫ్‌ ఫార్మాట్‌లోకి మార్చుకోవచ్చు. ఇది కూడా యూజర్స్‌ డేటాను చైనాకు చేరవేస్తుందనే ఆరోపణలతో దీనిపై నిషేధం విధించారు. ఇది ఐఓఎస్‌, ఆండ్రాయిడ్ డివైజ్‌లలో పనిచేస్తుంది. దీనికి ప్రత్యామ్నాయంగా స్వదేశీ పరిజ్ఞానంతో కాగజ్‌ పేరుతో యాప్‌ను తీసుకొచ్చారు. ఇందులో కూడా కామ్‌స్కానర్‌ తరహాలోనే అనేక రకాల ఫీచర్స్‌ అందుబాటులో ఉన్నాయి.     


యూసీ బ్రౌజర్‌

ఆలీ బాబా డిజిటల్ మీడియాకు చెందిన యూజీ బ్రౌజర్ యాప్‌ను కూడా కేంద్రం నిషేధించింది. యూజీవెబ్ రూపొందించిన ఈ యాప్‌ను చాలా మొబైల్స్‌లో డీఫాల్ట్‌గా ఇవ్వడంతో ఎక్కువ మంది మొబైల్‌ బ్రౌజర్‌గా ఈ యాప్‌ను ఉపయోగిస్తున్నారు. యూజర్‌ డేటా తరలిస్తుందనే ఆరోపణలతో దీనిపై నిషేధం విధించడంతో ప్రత్యామ్నాయంగా గూగుల్‌ క్రోమ్‌, ఒపేరా, మొజిల్లా ఫైర్‌ఫాక్స్‌ వినియోగంపై యూజర్స్‌ దృష్టి సారించారు. 


హెలో

ఫేస్‌బుక్‌, ట్విటర్‌, ఇన్‌స్టాగ్రాం తర్వాత ఎక్కువ మంది ఉపయోగించిన యాప్‌ హెలో. ఫేస్‌బుక్‌, ట్విటర్‌ తరహాలోనే ఇందులో యూజర్స్‌ తమ అభిప్రాయాలను వ్యక్తపరుచుకోవచ్చు. అయితే ఈ యాప్స్‌ వాడటం వల్ల యూజర్‌ డేటా చైనాకు తరలిపోతుందనే వార్తలు రావడంతో దీనిపై కూడా భారత ప్రభుత్వం నిషేధం విధించింది. దీనికి ప్రత్యామ్నాయంగా స్వదేశీ పరిజ్ఞానంతో ‘కూ’ యాప్‌ను రూపొందించారు.    


షేర్‌ ఇట్‌

ఫోన్‌ నుంచి ఫోన్‌కు సులభంగా ఫొటోలు, వీడియోలు, యాప్స్‌, ఫైల్స్‌ ఇలా వేటినైనా షేర్‌ చేసేందుకు షేర్‌ఇట్‌ యాప్‌ను ఉపయోగించేవారు. చైనా కంపెనీ రూపొందించిన యాప్‌ కావడంతో దీనిపై భారత ప్రభుత్వం నిషేధం విధించింది. దాని స్థానంలో షేర్‌ ఫైల్స్‌, ఫైల్స్‌ బై గూగుల్  వంటి వాటిని ఉపయోగించుకోవచ్చు. ఇవే కాకుండా వుయ్ ఛాట్, ఆలీ బాబా గ్రూప్‌కు చెందిన ఆలీ ఎక్స్‌ప్రెస్‌ వంటి వాటితో పాటు పలు వీడియో కంటెంట్‌ రూపొందించే యాప్‌లపై భారత ప్రభుత్వం నిషేధం విధించింది.

ఇవీ చదవండి..

ఈ ఏటి మేటి స్మార్ట్‌వాచ్‌లివే..! 

బడ్జెట్‌ ఫోనా..ఇవిగో 2020 బెస్ట్‌ మోడల్స్‌.. 

Read latest Technology News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని