August Smartphones: కొత్త మొబైల్స్‌ కోసం వెయిట్‌ చేస్తున్నారా?

యూజర్స్‌ అవసరాలకు తగినట్లుగా ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్స్‌తో మొబైల్ కంపెనీలు కొత్త మోడల్స్‌ని విడుదల చేస్తుంటాయి.

Updated : 05 Aug 2022 16:45 IST

యూజర్స్‌ అవసరాలకు తగినట్లుగా ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్స్‌తో మొబైల్ కంపెనీలు కొత్త మోడల్స్‌ని విడుదల చేస్తుంటాయి. జులైలో వరుస లాంఛ్‌లతో అదరగొట్టిన కంపెనీలు..ఆగస్టులోనూ కొత్త మోడల్స్‌ను తీసుకొచ్చేందుకు సిద్ధమయ్యాయి. వీటిలో కొన్నింటి లాంఛ్‌ అధికారికంగా ప్రకటించగా, ఇంకొన్ని తెలిసిన సమాచారాలు. మరి ఆ మొబైల్స్‌ ధరెంత?ఎలాంటి ఫీచర్లు ఉంటాయనేది తెలుసుకుందాం.


ఇన్ఫీనిక్స్ స్మార్ట్‌ 5ఏ (Infinix Smart 5A)

ఆగస్టు 2న ఇన్ఫీనిక్స్ కంపెనీ బడ్జెట్ శ్రేణిలో కొత్త ఫోన్ విడుదల చేయనుంది. ఇన్ఫీనిక్స్ స్మార్ట్ 5ఏ పేరుతో తీసుకొస్తున్న ఈ ఫోన్ ధర రూ. 7,000 ఉంటుందని మార్కెట్ వర్గాల అంచనా. 6.52-అంగుళాల హెచ్‌డీ+ డిస్‌ప్లే ఇస్తున్నారట. మీడియాటెక్ హీలియో జీ25 ప్రాసెసర్‌ను ఉపయోగించారని తెలుస్తోంది. వెనుకవైపు 13ఎంపీ ప్రైమరీ కెమెరాతోపాటు అదనంగా 2ఎంపీ కెమెరా ఉంటుందని సమాచారం. 2జీబీ ర్యామ్‌/32జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్లో ఈ ఫోన్ తీసుకొస్తున్నారట. 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇస్తున్నారట.   


శాంసంగ్‌ (Samsung)

శాంసంగ్ కంపెనీ ఆగస్టు 11న స్పెషల్ ఈవెంట్ నిర్వహించనున్నట్లు ప్రకటించింది. ఈ కార్యక్రమంలో శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫ్లిప్3, శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 3 అనే కొత్త మోడల్ ఫోల్డింగ్ ఫోన్లను విడుదల చేయనున్నట్లు సమాచారం. ఇప్పటికే ఈ ఫోన్లకు సంబంధించిన ఫీచర్లు అంటూ వార్తలు నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి.  శాంసంగ్ గెలాక్సీ జెడ్‌ ఫోల్డ్‌ 3లో 120Hz రిఫ్రెష్‌ రేట్‌తో ఫోన్ తెరిచినప్పుడు 7.55-అంగుళాలు, ఫోన్ మడతబెట్టినప్పుడు 6.23-అంగుళాల డిస్‌ప్లే ఉంటుందట. ఎక్సినోస్ 2100 ప్రాసెసర్‌ ఉపయోగించారని తెలుస్తోంది. అలానే స్నాప్‌డ్రాగన్‌ 888 ప్రాసెసర్‌తో మరో వేరియంట్‌ను తీసుకొస్తారని సమాచారం. అలానే బయటివైపు డిస్‌ప్లేకి 10ఎంపీ కెమెరా, లోపలివైపు డిస్‌ప్లేకి 16ఎంపీ సెల్ఫీ కెమెరా ఇస్తున్నారట. ఈ ఫోన్ 4,400 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుందని సమాచారం. ఇది 25 వాట్ వైర్‌, 15 వాట్ వైర్‌లెస్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుందట. 

అలానే గెలాక్సీ జెడ్‌ ఫ్లిప్ 3లో 6.9-అంగుళాల ప్రైమరీ కెమెరా, 1.9-అంగుళాల సెకండరీ డిస్‌ప్లే ఇస్తున్నారట. దీనికి కార్నింగ్ గొరిల్లా గ్లాస్‌ ప్రొటెక్షన్ కూడా ఉంటుందని తెలుస్తోంది. ఇందులో స్నాప్‌డ్రాగన్ 888 ప్రాసెసర్‌ ఉపయోగించారని సమాచారం. 3,900 ఎంఏహెచ్ బ్యాటరీ ఇస్తున్నారని తెలుస్తోంది. గెలాక్సీ ఎం52 ధర సుమారు రూ. 25,000, ఎఫ్‌52 ప్రారంభ ధర రూ. 15,000 ఉంటుందని అంచనా. వీటిలో హై-రిఫ్రెష్‌ రేట్‌తో ఎల్‌సీడీ డిస్‌ప్లే ఇస్తున్నారట. ఇవేకాకుండా గెలాక్సీ ఏ12 పేరుతో మరో కొత్త మోడల్‌ను శాంసంగ్ విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. ఇందులో ఎక్సినోస్ 850 ప్రాసెసర్‌ను ఉపయోగించారని సమాచారం.


అసుస్‌ 8జెడ్‌ (Asus  8Z) 

కాంపాక్ట్ డిజైన్‌తో అసుస్ 8జెడ్‌ పేరుతో కొత్త మోడల్ ఫోన్‌ను ఆగస్టులో భారత మార్కెట్లోకి తీసుకురానుంది. ఇందులో స్నాప్‌డ్రాగన్‌ 888 5జీ ప్రాసెసర్‌ను ఉపయోగించారు. 120Hz రిఫ్రెష్‌ రేట్‌తో 5.9-అంగుళాల సూపర్ అమోలెడ్ డిస్‌ప్లే ఇస్తున్నారు. అడ్రినో 660 గ్రాఫిక్‌ కార్డ్‌ ఇస్తున్నారు.  వెనకవైపు సోనీ లెన్స్‌తో 64 ఎంపీ ప్రధాన కెమెరాతో పాటు 12 ఎంపీ సెకండరీ కెమెరా ఉన్నాయి. ముందు భాగంలో సెల్ఫీల కోసం 12 ఎంపీ సోనీ లెన్స్ కెమెరా అమర్చారు. 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ, 30వాట్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. ర్యామ్‌, స్టోరేజ్, ధర వంటి వివరాలు తెలియాల్సి ఉంది.


రియల్‌మీ జీటీ మాస్టర్‌ ఎడిషన్ (Realme GT Master Edition) 

ఫ్లాగ్‌షిప్‌ ఫీచర్లతో రియల్‌మీ జీటీ మాస్టర్‌ ఎడిషన్ ఫోన్‌ను తీసుకొస్తోంది. ఇందులో స్నాప్‌డ్రాగన్ 778జీ ప్రాసెసర్‌ ఉపయోగించారట. హై-రిఫ్రెష్ రేట్‌తో డిస్‌ప్లే ఇస్తున్నారని సమాచారం. వెనకవైపు మూడు కెమెరాలు ఉంటాయని తెలుస్తోంది. దీని ధర రూ. 25,000 వరకూ ఉంటుందని మార్కెట్ వర్గాల అంచనా. ఫ్లాగ్‌షిప్‌ సెగ్మెంట్‌లో ఈ మోడల్‌ గేమ్ ఛేంజర్ అవుతుందని రియల్‌మీ భావిస్తోంది. దీనితోపాటు మైక్రోమాక్స్‌ ఇన్, రెడ్‌మీ 10 సిరీస్‌ వేరియంట్లకు పోటీగా బడ్జెట్ ధరలో రియల్‌మీ సీ సిరీస్ పేరుతో కొత్త మోడల్స్‌ను తీసుకురానుంది. వీటిని ఆగస్టు చివరి వారం లేదా సెప్టెంబరు మొదటి వారంలో మార్కెట్లోకి విడుదల చేస్తారని తెలుస్తోంది. 


మోటోరోలా (Motorola)

మోటోరోలా కూడా రెండు కొత్త స్మార్ట్‌ఫోన్ మోడల్స్‌ని ఆగస్టులో విడుదల చేయనుంది. వీటిలో ఒక ఫోన్‌లో స్నాప్‌డ్రాగన్ 778 ప్రాసెసర్ ఉపయోగించారని తెలుస్తోంది. వెనక వైపు మూడు కెమెరాలు ఇస్తున్నారట. దీని ధర సుమారు రూ. 20,000 ఉండొచ్చని సమాచారం. మరో మోడల్‌లో స్నాప్‌డ్రాగన్‌ 879 ప్రాసెసర్ ఉపయోగించారట. దీని ధర సుమారు రూ. 25,000 ఉంటుందని మార్కెట్‌ వర్గాల అంచనా. ఈ మోడల్‌ను ఆగస్టు చివరి వారం లేదా సెప్టెంబరు మొదటి వారంలో విడుదల చేయనున్నారు.   


పోకో ఎక్స్‌3 జీటీ (Poco X3 GT)

కొద్దిరోజుల క్రితం గేమింగ్‌ ఫీచర్లతో ఎఫ్3 జీటీ మోడల్‌ను పోకో కంపెనీ భారత మార్కెట్లోకి విడుదల చేసింది. తాజాగా ఎక్స్‌3 జీటీ పేరుతో మరో కొత్త మోడల్‌ని ఆగస్టు చివరి వారంలో విడుదల చేయనున్నట్లు సమాచారం. ఇందులో 6.6-అంగుళాల డిస్‌ప్లేతోపాటు 64ఎంపీ ప్రధాన కెమెరా, 5,000 ఎంఏహెచ్‌ బ్యాటరీ వంటి ఫీచర్స్ ఇస్తున్నారట. 


వివో వీ21 ప్రో (Vivo v21 Pro)

ఈ సిరీస్‌లో వివో ఇప్పటికే వీ21, వీ21ఈ  5జీ మోడల్స్‌ను విడుదల చేసింది. త్వరలో వీ21 ప్రో పేరుతో మరో కొత్త మోడల్‌ను పరిచయం చేయనుంది. ఇందులో 6.44-అంగులాల ఫుల్ హెచ్‌డీ+ అమోలెడ్ డిస్‌ప్లేతోపాటు మీడియాటెక్ డైమెన్సిటీ 800 ప్రాసెసర్‌, 64 ఎంపీ ప్రైమరీ కెమెరా వంటి  ఫీచర్లు ఉంటాయని సమాచారం. ఆగస్టు చివరి వారం లేదా సెప్టెంబరు మొదటి వారంలో ఈ ఫోన్‌ను భారత మార్కెట్లోకి విడుదల చేస్తారని తెలుస్తోంది. 


గూగుల్ పిక్సెల్ 6 సిరీస్‌ (Google Pixel 6 Series)

గతంలో వచ్చిన పిక్సెల్‌ మోడల్స్‌కి భిన్నంగా గూగుల్ పిక్సెల్ 6 , 6ప్రో మోడల్స్‌ని తీసుకొస్తున్నారు. ఇందులో గూగుల్ వైట్‌ఛాపెల్ చిప్‌సెట్‌ను ఉపయోగించారని సమాచారం. ఓఎల్‌ఈడీ డిస్‌ప్లే, 50 ఎంపీ ప్రైమరీ కెమెరాతోపాటు 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి ఫీచర్స్ ఉన్నాయని తెలుస్తోంది. 8జీబీ ర్యామ్‌/ 512జీబీ అంతర్గత మెమొరీ వేరియంట్లో విడుదల చేయనున్నారు. వీటి ధర సుమారు రూ. 55,000 వరకు ఉండొచ్చని తెలుస్తోంది. ఆగస్టు రెండో వారంలో భారత మార్కెట్లో విడుదల చేస్తారని మార్కెట్‌ వర్గాలు భావిస్తున్నాయి. 


- ఇంటర్నెట్‌డెస్క్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని