WhatsApp పేమెంట్స్‌ చేస్తున్నారా... 

ప్రముఖ మెసేంజర్‌ యాప్‌ వాట్సాప్‌ కొత్తగా యూపీఐ పేమెంట్స్‌ విభాగంలోకి అడుగు పెట్టిన విషయం తెలిసిందే. దేశంలోని 140 బ్యాంకు ఖాతాల ద్వారా...

Updated : 27 Jan 2021 17:09 IST

ఈ చిట్కాలు పాటించండంటున్న వాట్సాప్‌

ఇంటర్నెట్‌ డెస్క్: ప్రముఖ మెసేంజర్‌ యాప్‌ వాట్సాప్‌ కొత్తగా యూపీఐ పేమెంట్స్‌ విభాగంలోకి అడుగు పెట్టిన విషయం తెలిసిందే. దేశంలోని వివిధ బ్యాంకు ఖాతాల ద్వారా వాట్సాప్‌ పేమెంట్స్‌ చేసుకోవచ్చు. అలానే పది ప్రాంతీయ భాషల్లో వాట్సాప్‌ పేమెంట్స్‌ సేవలు అందుబాటులో ఉంటాయి. అయితే వాట్సాప్ పేమెంట్స్‌ చేసే సమయంలో ఎంతో జాగ్రత్తగా ఉండాలని యూజర్లను వాట్సాప్ హెచ్చరించింది. వాట్సాప్‌ చెల్లింపులను ఉపయోగిస్తున్నప్పుడు మోసాలకు గురి కాకుండా ఉండేందుకు పలు చిట్కాలను సూచించింది. దీనికి సంబంధించిన వీడియోను వాట్సాప్‌ విడుదల చేసింది. మరి అవేంటో ఓ సారి చూసేద్దామా..!

ఓటీపీని ఎవరికీ చెప్పొద్దు.. 

వాట్సాప్‌ పేమెంట్స్‌ మాత్రమే కాకుండా ఇతర లావాదేవీలకు సంబంధించి ఓటీపీని తెలియనివారితో అస్సలు పంచుకోకూడదు. ఎవరికీ  షేర్‌ చేయవద్దు. అపరిచిత నంబర్ల నుంచి వచ్చే సమాచారాన్ని నమ్మి ఎలాంటి చెల్లింపులు చేయకూడదు. దుండగులు మీ ఖాతా నుంచి సొమ్ము పోతుందని నమ్మించే ప్రయత్నం చేసినా ఓటీపీని మాత్రం చెప్పకూడదు. ఒక్కసారి మీ ఓటీపీని చెప్పేశారంటే ఖాతాలోని నగదు గల్లంతైనట్లే. అలాంటి సమాచారం ఏదన్నా వస్తే వెంటనే సైబర్‌ క్రైమ్‌ విభాగానికి ఫిర్యాదు చేయాలి. ఈ మధ్య కాలంలో ఓటీపీ స్కామ్‌తో ఏకంగా మీ వాట్సాప్‌ నంబర్‌ను హ్యాక్‌ చేసే సంఘటనలూ చోటు చేసుకుంటున్నాయి. 

అలాంటి లింక్‌లు తెరవద్దు.. 

ఇటీవల సైబర్‌ నేరగాళ్లు తెలివి మీరిపోయారు. బ్యాంకుల నుంచి, ఇతర ఆర్థిక సంస్థల నుంచి  తప్పుడు లింక్‌లను పంపిస్తారు. సమాచారం సరిగా లేదని అప్‌డేట్‌ చేయడానికి  సదరు లింక్‌ మీద క్లిక్‌ చేయాలని సూచిస్తారు. పొరపాటున నమ్మి క్లిక్‌ చేశామా.. ఇక అంతే.. సైబర్‌ క్రైమ్‌ బారిన పడటమే మన వంతు. అలాగే మీరు బహుమతి గెలుచుకున్నారు, లాటరీ వచ్చిందంటూ లింక్‌లను జత చేస్తారు. వాటిని పొందాలంటే కింద ఇచ్చిన లింక్‌ను  తెరవండి అంటూ చెబుతారు. అలాంటి అనుమానాస్పద లింక్‌లను తెరవకపోవడమే ఉత్తమం. అలాంటి కాంటాక్ట్‌ను రిపోర్ట్‌ చేసి బ్లాక్‌ చేయాలి.

తెలియని పేమెంట్‌ అభ్యర్థనను ఆమోదించవద్దు.. 

గుర్తు తెలియని యూపీఐ నుంచి పేమెంట్‌ అభ్యర్థన వస్తే వెంటనే తిరస్కరించాలి. పొరపాటున ఆమోదిస్తే మీ ఖాతా నుంచి నగదు విత్‌డ్రా అయిపోతుంది. అందుకే నమ్మకమైన, తెలిసిన కాంటాక్ట్‌ల నుంచి వచ్చే పేమెంట్‌ అభ్యర్థనలను మాత్రమే అంగీకరించాలి. అప్పుడే సురక్షితంగా వాట్సాప్‌ పేమెంట్స్‌ లావాదేవీలను వినియోగించుకోగలరు.

ఇదీ చదవండి: వాట్సాప్‌ పేమెంట్స్‌ ఎలా చేయాలంటే..


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు