Spam Calls: స్పామ్‌ కాల్స్‌ రాకుండా ఏం చేయాలి?

తీరికలేని పనిలో ఉన్నప్పుడు తెలియని నంబర్‌ నుంచి పోన్ రాగానే.. కొత్తవారు చేస్తున్నారనే ఆసక్తితో కాల్ లిఫ్ట్‌ చేస్తాం.  స్పామ్‌ కాల్ అని తెలిసి కోపంగా ఫోన్ పెట్టేస్తాం. విసుగుపుట్టించే స్పామ్‌ కాల్స్‌ రాకుండా ఏం చేయాలి? అందుకు గూగుల్ ఎలాంటి సూచనలు చేస్తుందో చూద్దాం.

Published : 22 Oct 2022 12:12 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: లోన్‌ కావాలా?, క్రెడిట్‌ కార్డ్‌ ఇస్తామంటూ రోజూ ఎన్నో ఫోన్‌ కాల్స్ వస్తుంటాయి. కొత్త నంబర్‌ నుంచి ఫోన్ రాగానే ఎవరు చేస్తున్నారనే ఆసక్తితో కాల్ అటెండ్ చేస్తాం. స్పామ్‌ కాల్ అని తెలిసి పట్టరానంత కోపం వస్తుంది.  అవసరంలేదని చెప్పినా.. పదే పదే ఇలాంటి కాల్స్‌ వస్తుంటే.. ఒకింత అసహనానికి గురవుతాం. మరోవైపు లాటరీ తగిలిందని, మీ క్రెడిట్/డెబిట్ కార్డ్‌ వ్యాలిడిటీ ముగిసిందంటూ మోసపూరిత కాల్స్‌ వస్తుంటాయి. మరి, విసుగు పుట్టించే స్పామ్‌ కాల్స్‌ ఎలా అడ్డుకోవాలి? అసలు స్పామ్‌ కాల్స్‌లో ఎన్ని రకాలున్నాయి? వాటికి చెక్‌ పెట్టేందుకు ఫోన్‌ సెట్టింగ్స్‌లో ఏమేం మార్పులు చేయాలో తెలుసుకుందాం. 

స్పామ్‌ కాల్స్‌లో టెలీమార్కెటింగ్‌ కాల్స్‌, రోబో కాల్స్‌, స్పామ్‌ కాల్స్‌ అని మూడు రకాలున్నాయి. స్పామ్‌ కాల్స్‌ కొన్ని యూజర్లను మోసం చూసేందుకు చేస్తుంటారు. వీటి బారి నుంచి బయటపడేందుకు ఆండ్రాయిడ్ యూజర్లకు  కాలర్‌ ఐడీ (Caller ID), స్పామ్‌ ప్రొటెక్షన్ (Spam Protection) అనే రెండు ఫీచర్లను గూగుల్ అందిస్తుంది. యూజర్లు తమ ఫోన్లలో వీటిని ఎనేబుల్‌ చేసి స్పామ్‌ కాల్స్‌ను అడ్డుకోవచ్చని గూగుల్ చెబుతోంది. వీటిని ఎలా ఎనేబుల్ చేయాలో చూద్దాం.

  •  ఆండ్రాయిడ్ ఫోన్‌లో ఫోన్ యాప్‌ (Phone App) ఓపెన్ చేసి కుడివైపు పైన మూడు చుక్కలపై క్లిక్ చేసి సెట్టింగ్స్‌ ఓపెన్‌ చేయాలి. 
  • అందులో కాలర్‌ ఐడీ అండ్ స్పామ్‌ ప్రొటెక్షన్ (Caller ID and Spam Protection) అనే ఆప్షన్‌ ఉంటుంది. దాన్ని ఎనేబుల్ చేస్తే, కింద నిబంధనలకు  అంగీకరిస్తున్నారా? అని అడుగుతూ అగ్రీ (Agree) బటన్‌ చూపిస్తుంది. దానిపై క్లిక్ చేస్తే కాలర్‌ ఐడీ అండ్‌ స్పామ్‌ ప్రొటెక్షన్ ఫోన్‌లో యాక్టివేట్ అవుతుంది. 
  • ఈ ఆప్షన్‌ ఎనేబుల్ చేసినా స్పామ్‌ కాల్స్‌ వస్తుంటే.. గూగుల్ మరో ఆప్షన్‌ను సూచిస్తుంది. అదేంటో చూద్దాం.
  • ఫోన్‌ యాప్‌ ఓపెన్‌ చేసి కింద ఉన్న రీసెంట్స్‌ సెక్షన్‌పై క్లిక్ చేయాలి. తర్వాత మీకు వచ్చిన స్పామ్‌ కాల్‌ నంబర్‌పై క్లిక్ చేసి ఫోన్‌, మెసేజ్‌, వీడియో, ఐ అని ఐకాన్స్‌ కనిపిస్తాయి. 
  • వాటిలో ఐ ఐకాన్‌పై క్లిక్ చేస్తే బ్లాక్‌, రిపోర్ట్ అని రెండు ఆప్షన్లు ఉంటాయి. స్పామ్‌ కాల్‌ వచ్చిన నంబర్‌ను బ్లాక్ చేయాలంటే బ్లాక్‌ ఆప్షన్‌పై, సదరు నంబరుపై రిపోర్ట్ చేయాలంటే రిపోర్టు ఆప్షన్‌పై క్లిక్ చేస్తే, దాని నుంచి మీకు ఫోన్‌కాల్స్‌ రావు.
Read latest Technology News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts