Metaverse phone:హెచ్‌టీసీ నుంచి ‘మెటావర్స్‌ ఫోన్‌’.. విడుదల ఎప్పుడంటే?

ప్రముఖ ఎలక్ట్రానిక్‌ కంపెనీ హెచ్‌టీసీ ఏప్రిల్‌ నెలలో కొత్త మోడళ్లను ఆవిష్కరిస్తామని ప్రకటించింది. వీటిలో అధునాతన మెటావర్స్ ఫీచర్స్‌ను తీసుకొస్తున్నట్లు తెలిపింది.

Published : 08 Mar 2022 01:24 IST

ప్రముఖ ఎలక్ట్రానిక్‌ కంపెనీ హెచ్‌టీసీ ఏప్రిల్‌ నెలలో కొత్త మోడళ్లను ఆవిష్కరిస్తామని ప్రకటించింది. ఇటీవల జరిగిన మొబైల్‌ వరల్డ్‌ కాంగ్రెస్‌లో ఈ విషయాన్ని వెల్లడించింది. కొత్తగా రూపొందించే  స్మార్ట్‌ఫోన్లలో అధునాతన మెటావర్స్ ఫీచర్స్‌ను తీసుకొస్తున్నట్లు తెలిపింది. మరి మెటావర్స్ అంటే ఏమిటి? ఈ కొత్త ఫోన్‌ విశేషాలు ఏంటో చూద్దాం..

మొబైల్‌ వరల్డ్‌ కాంగ్రెస్‌ 2022 సందర్భంగా హెచ్‌టీసీ తన ఆవిష్కరణల గురించి వెల్లడించింది. ఈ మేరకు హెచ్‌టీసీ ఆసియా పసిఫిక్‌ జనరల్‌ మేనేజర్‌ చార్లెస్‌ హుయాంగ్‌ ‘మెటావర్స్‌ ఫోన్‌’ను ఏప్రిల్‌లో తీసుకొస్తున్నట్లు స్పష్టం చేశారు. వర్చువల్ రియాలిటీ స్పేస్‌లో హెచ్‌టీసీ అగ్రగామిగా నిలిచిపోతుందని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు.

హెచ్‌టీసీ చివరగా డిసెంబర్‌ 2018లో  ఎక్సోడస్‌ 1 మోడల్‌ను విడుదల చేసింది. ఎక్సోడస్‌ 1 స్మార్ట్‌ఫోన్‌ క్రిప్టోకరెన్సీ ఔత్సాహికుల కోసం క్రిప్లో వ్యాలెట్‌ ఫీచర్‌ను తీసుకొచ్చింది. అప్పట్నుంచి అంతర్జాతీయ మార్కెట్‌లో మళ్లీ కొత్త మోడళ్లను ఆవిష్కరించలేదు. ప్రస్తుతం వర్చువల్‌ రియాలిటీ అనుభూతిని పరిచయం చేసేందుకు కంపెనీ మెటావర్స్‌ స్మార్ట్‌ఫోన్లను తీసుకొస్తోంది. అయితే, ఈ ఫోన్లలో ఏయే ఫీచర్లు ఉంటాయనే విషయం మాత్రం తెలియరాలేదు. 


గతేడాది హెచ్‌టీసీ వైవ్‌ ఫ్లో పేరుతో వర్చవల్‌ రియాలిటీ (VR) హెడ్‌సెట్‌ను ఆవిష్కరించింది. ఇందులో సన్‌గ్లాస్ లాంటి డిజైన్‌తో రెండు ఎల్‌సీడీ డిస్‌ప్లేలు ఉన్నాయి. ముందు భాగంలో రెండు కెమెరాలు కూడా ఉన్నాయి. అయితే, హెచ్‌టీసీ తన మెటావర్స్‌ స్మార్ట్‌ఫోన్లను వైవ్‌ ఫ్లో వీఆర్‌ ఇంటిగ్రేషన్‌తో విడుదల చేయవచ్చని అంచనా. శాంసంగ్‌, వన్‌ప్లస్‌ వంటి ఇతర ఫ్లాగ్‌షిప్‌ స్మార్ట్‌ఫోన్లకు దీటుగా మెటావర్స్‌ స్మార్ట్‌ఫోన్లు ఉండనున్నాయని మాత్రం తెలుస్తోంది.


మెటావర్స్‌ అంటే?

మనుషుల్ని వర్చువల్‌ ప్రపంచంలోకి తీసుకెళ్లే సాంకేతికతనే ‘మెటావర్స్‌’గా పిలుస్తారు. ప్రస్తుతం ఇంటర్నెట్‌ చాలావరకు టెక్స్ట్‌, ఇమేజెస్‌, వీడియోల మీదే ఆధారపడి ఉంది. దీనికి భవిష్యత్‌ రూపమే మెటావర్స్‌. ఇందులో 3డీ వర్చువల్‌ స్పేసెస్‌దే కీలక పాత్ర. ఇవి భావనాత్మక వర్చువల్‌ విశ్వంలో ఒకదాంతో మరొకటి అనుసంధానమై ఉంటాయి. అంటే మెటావర్స్‌లో 3డీ రూపంలో ఒకరితో ఒకరు కలవటం నిజ ప్రపంచంలో మాదిరిగానే ఉంటుందని చెప్పుకోవచ్చు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు