Huawei Smart Phones: ‘6G’ నెట్‌వర్క్‌తో వస్తామంటున్న హువావే!

‘6G’ నెట్‌వర్క్‌తో ఉత్పత్తులను తీసుకు వచ్చేందుకు హువావే పరిశోధనలు

Updated : 06 Sep 2022 16:30 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రపంచంలో ఇప్పటికీ 5G సేవలు అందని దేశాలు ఉన్నాయి. అయితే హువావే సంస్థ మరో ముందడుగు వేసి 6G (ఆరో జనరేషన్‌) టెక్నాలజీతో తమ ఉత్పత్తులను తీసుకురావాలనే ప్రయత్నాలను ముమ్మరం చేస్తోంది. 2030వ సంవత్సరానికల్లా మార్కెట్లోకి విడుదల చేయాలని హువావే భావిస్తోంది. 2017 నుంచే 6G టెక్నాలజీ మీద వర్క్‌ చేస్తున్నట్లు హువావే యాక్టివ్‌ ఛైర్మన్‌ జు ఎరిక్‌ వెల్లడించారు. గతంలో 5G సాంకేతికతను వృద్ధి చేయడం, ప్రపంచానికి పరిచయం చేయడంలో హువావే కీలక పాత్ర పోషించింది. అమెరికా, యూకే సహా పలు దేశాల్లో 5G నెట్‌వర్క్‌ను హువావే విడుదల చేసింది. అయితే అమెరికాలో ఆంక్షలు విధించడంతో హువావే అక్కడ నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే. 

క్లౌడ్‌, బ్లాక్‌ చైన్, బిగ్‌ డేటా సాంకేతిక విప్లవంలో 6G కీలక పాత్ర పోషిస్తుందని హువావే విశ్వసిస్తోందని జు ఎరిక్‌ అభిప్రాయపడ్డారు. అయితే 6G నెట్‌వర్క్‌ పరిశోధనలపై ముందుగానే అంచనా వేస్తున్నప్పటికీ.. అందులో ఏ టెక్నాలజీస్‌ ఇమిడి ఉంటాయో చెప్పలేమని పేర్కొన్నారు. అధిక వేగం, కెపాసిటీ, తక్కువ జాప్యం వంటి వాటికి 6G నెట్‌వర్క్‌ పరిష్కారంగా నిలవబోతోందని వెల్లడించారు. సాంకేతికపరంగా నమ్మదగినదిగా 6జీ నెట్‌వర్క్‌ ఉండనుందని హువావే సంస్థ తెలిపింది. ‘రాబోయే కాలంలో హువావే తప్పనిసరిగా 5.5G, 6G నెట్‌వర్క్‌ల మీద పరిశోధనలు చేస్తుంది.  ప్రస్తుతం ఉన్న 5G నెట్‌వర్క్‌ను 6G అధిగమిస్తుందా లేదా అనేది పారిశ్రామిక రంగానికి పరీక్ష లాంటిది’’ అని హువావే యాక్టివ్‌ ఛైర్మన్‌ జు ఎరిక్‌ తెలిపారు. ట్రిలియన్‌ డాలర్ల సంపదను సృష్టించే అవకాశం 6G నెట్‌వర్క్‌తో సాధ్యమవుతుందని అనేక దేశాలు భావిస్తున్నాయి. ఇప్పటికే చైనాతో సహా యూరప్‌లోని నార్త్‌ఫిన్లాండ్‌ ఆరో జనరేషన్‌ మీద కసరత్తులను ప్రారంభించాయి. అమెరికా, జపాన్‌ కూడా 6G నెట్‌వర్క్‌పై గురి పెట్టాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని