Robots: మనిషిలా మరమనుషులు!

విచిత్రమైన రోబోల గురించి చాలానే విని ఉంటారు. ఇవి రోజురోజుకీ ఇంకా వినూత్నంగానూ మారుతున్నాయి. వీటికి మనిషి మెదడును జోడించాలని కొందరు శాస్త్రవేత్తలు ప్రయత్నిస్తుంటే.. మనుషుల్లా కనిపించేలా సజీవ చర్మాన్ని జత చేయాలని ఇంకొందరు కృషి చేస్తున్నారు.

Updated : 10 Jul 2024 06:57 IST

విచిత్రమైన రోబోల గురించి చాలానే విని ఉంటారు. ఇవి రోజురోజుకీ ఇంకా వినూత్నంగానూ మారుతున్నాయి. వీటికి మనిషి మెదడును జోడించాలని కొందరు శాస్త్రవేత్తలు ప్రయత్నిస్తుంటే.. మనుషుల్లా కనిపించేలా సజీవ చర్మాన్ని జత చేయాలని ఇంకొందరు కృషి చేస్తున్నారు. మొత్తమ్మీద కొత్తరకం రోబోల సృష్టి అధునాతన పోకడలు పోతోంది.


రోబోకు మెదడు

రోబోలకు కృత్రిమ మేధ జోడించటానికి చాలా ప్రయత్నాలే జరుగుతున్నాయి. దీని సాయంతో రోబోలు ఫ్యాక్టరీల్లో పనిచేయటం దగ్గరి నుంచి దివ్యాంగులకు, వృద్ధులకు సహకరించటం వరకూ ఎన్నెన్నో పనులు చేసి పెడుతున్నాయి. మరి వీటికి కృత్రిమ మెదడునూ జోడిస్తే? అసాధ్యమని కొట్టి పారేయకండి. చైనాలోని టియాంజిన్‌ యూనివర్సిటీ, సదరన్‌ యూనివర్సిటీ ఆఫ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ పరిశోధకులు రూపొందించిన రోబో గురించి తెలిస్తే ఔరా అనాల్సిందే. ఇది ప్రయోగశాలలో వృద్ధి చేసిన కృత్రిమ మెదడుతో పనిచేస్తుంది మరి.

చిప్‌ల మీద అవయవ (ఆర్గాన్‌ ఆన్‌ చిప్‌) పరిజ్ఞానం రోజురోజుకీ కొత్త పుంతలు తొక్కుతోంది. దీని విషయంలో చైనా పరిశోధకులు మరో ముందడుగు వేసి, బ్రెయిన్‌ ఆన్‌ చిప్‌గా మలిచారు. ప్రపంచంలోనే తొలిసారిగా చిప్‌ మీద ‘నిజమైన’ మెదడును అమర్చి, దాన్ని రోబోకు అనుసంధానం చేయటంలో విజయం సాధించారు. ఈ మెదడు సాయంతో వస్తువులను పట్టుకోవటం, అడ్డంకులను అధిగమించటం వంటి పనులను రోబో తేలికగా నేర్చుకోవటం విశేషం. ఇంతకీ ఈ చిప్‌ మీద మెదడును ఎలా సృష్టించారు? నిజానికిది పూర్తి స్థాయి మెదడు కాదు. ప్రయోగశాలలో వృద్ధి చేసిన మెదడులాంటి అవయవం. మనిషి పిండం మూలకణాలను ప్రయోగపాత్రలో ఉంచి, వాటిని స్వయంగా సంయోగం, విభజన చెందేలా చేయటం ద్వారా దీన్ని సృష్టించారు. ఇది మెదడులాంటి నిర్మాణాలు కలిగుంటుంది. ఎదుగుతూ ఉన్న మెదడు మాదిరిగా ప్రవర్తిస్తుంది. దీన్ని ఎలక్ట్రోడ్లతో కూడిన చిప్‌ మీద పెట్టి, రోబో తల భాగంలో అమర్చారు. 

మనిషి-రోబో తెలివి సంయోగం

మెదడును కంప్యూటర్‌ ఇంటర్ఫేసెస్‌తో అనుసంధానం చేయటమనేది ఒక కొత్త పరిజ్ఞానం. మనిషి మెదడులోని విద్యుత్‌ సంకేతాల సాయంతో కంప్యూటర్‌ మీద పనులు చేయించటం దీనిలోని కీలకాంశం. టెస్లా అధినేత ఇలాన్‌ మస్క్‌ ఇటీవల న్యూరాలింక్‌ చిప్‌ను ఆరంభించిన తర్వాత ఇది విస్తృతంగా చర్చల్లో నానుతోంది కూడా. ఇది బ్రెయిన్‌-కంప్యూటర్‌ ఇంటర్ఫేస్‌. దీన్ని మనిషి మెదడులో అమరుస్తారు. పైకేమీ తెలియదు. కానీ దీని సాయంతో బయట కంప్యూటర్‌ను నియంత్రించొచ్చు. మొబైల్‌ ఫోన్‌తో పనులు చేసుకోవచ్చు. ప్రమాదంలో గాయపడి అవయవాలు చచ్చుబడిన ఒకరికి ఇటీవల దీన్ని అమర్చారు కూడా. దీని సాయంతో ఆయన కంప్యూటర్‌ తెర మీద కర్సర్‌ను కదిలించటం, పాటలు వినటం, చదరంగం వంటి ఆటలు ఆడటం వంటి పనులెన్నో చేయగలిగారు. అందుకే బ్రెయిన్‌-కంప్యూటర్‌ ఇంటర్ఫేస్‌ పరిజ్ఞానం నాడీ సమస్యలతో బాధపడేవారికి మున్ముందు కొత్త జీవితాన్ని ప్రసాదించగలదని ఆశిస్తున్నారు. తాజా బ్రెయిన్‌ అన్‌ చిప్‌ పరిజ్ఞానం దీనికి  కొనసాగింపని చెప్పుకోవచ్చు. రోబోలు మనలాగా చూడలేవు కదా. ఇక్కడే ‘కృత్రిమ’ మెదడు తోడ్పడుతుంది. ఇది విద్యుత్‌ సంకేతాల ద్వారా పరిసరాలను గమనించటానికి తోడ్పడుతుంది. సిద్ధాంతపరంగా చూస్తే, సిమ్యులేట్‌డ్‌ వాతావరణంలో సంచరించటాన్ని రోబోలు నేర్చుకుంటాయన్నమాట. ఇది మనిషి-రోబో సంయుక్త విషయగ్రహణ పరిజ్ఞానాన్ని, తెలివితేటలను అభివృద్ధి చేయటానికి దోహదపడగలదని పరిశోధకులు ఆశిస్తున్నారు.


మెదడులాంటి గణన

ప్రపంచంలో తొలి ఓపెన్‌ సోర్స్‌ బ్రెయిన్‌ ఆన్‌ చిప్‌ పరిజ్ఞానంగా పేర్కొంటున్న దీనికి మెటాబాక్‌ అని పేరు పెట్టారు. సాధారణంగా మెదడు అవయవాలు, చిన్న మెదళ్లను ప్రయోగాల కోసం వాడుకుంటారు. గతంలోనూ ఇలాంటి ప్రయోగాలు జరిగాయి. ఆరేళ్ల క్రితం ఆదిమ మానవుల శిలాజాల నుంచి సేకరించిన డీఎన్‌ఏతో సృష్టించిన మెదడుతో సాలీడులాంటి రోబోను నియంత్రించటానికి ప్రయత్నించారు. తాజా రోబో-మెదడు సమ్మేళనం రెండు మైలురాళ్లను అధిగమించిందని చెప్పుకోవచ్చు. ఒకటి- బంతిలా గుండ్రంగా ఉండటం. అంటే కణాలు 2డీలో కాకుండా 3డీలో వృద్ధి చెందాయన్నమాట. ఫలితంగా మరిన్ని సంక్లిష్టమైన నాడీ అనుసంధానాలకు వీలవుతుంది. తక్కువ తీవ్రత అల్ట్రాసౌండ్‌ సిమ్యులేషన్‌ కింద చిన్న మెదళ్లను అభివృద్ధి చేయటం ద్వారా ఇది సాధ్యమైంది. మరింత మెరుగైన తెలివిని సంతరించుకోవటానికీ ఉపయోగపడింది. రెండోది- కృత్రిమ మేధ ఆల్గారిథమ్‌లతో జత చేయటం. దీంతో మెదడు అవయవాలకు ఇంకా ఎక్కువ సామర్థ్యాలు అబ్బాయి.


జబ్బుల ప్రయోగాలకూ

రోబోలకు అమర్చటానికే కాకుండా మెదడు మరమ్మతు, నాడీ సమస్యల అర్థం చేసుకోవటానికీ మెదడు అవయవాలు మంచి వేదిక కాగలవనీ భావిస్తున్నారు. అయితే ఇవి అంతగా పరిపక్వ దశకు చేరుకోకపోవటం, అవసరమైన పోషకాల సరఫరా కాకపోవటం వంటి అడ్డంకులు తలెత్తొచ్చని అనుకుంటున్నారు. అయితే తక్కువ తీవ్రతతో కూడిన అల్ట్రాసౌండ్‌ సిమ్యులేషన్‌లో వస్తున్న అధునాతన పద్ధతులు మెదడు అవయవాల వృద్ధి, పరికరాలతో సమ్మేళనంలో గణనీయమైన మార్పు తీసుకొచ్చే అవకాశముంది. నాడీ సమస్యల చికిత్స, మెదడు మరమ్మతు వ్యూహాలకు వీలు కల్పించనుంది. చిప్‌ మీద మెదడు పరిజ్ఞానం ప్రయోగదశలో ఆసక్తి కలిగిస్తున్నా ఇంకా చేయాల్సింది ఎంతో ఉంది. ఉదాహరణకు- ప్రస్తుతం రోబో హెల్మెట్‌లో అమర్చింది మెదడు నమూనా మాత్రమే. అసలు మెదడు కణజాలాన్ని ఇంకా పరీక్షించాల్సి ఉంది. అది విజయవంతమైతే రోబోలకు మనిషి మెదడును అమర్చటం మేలి మలుపు తిరుగు తుందనటం నిస్సందేహం.


రోబోకు సజీవ చర్మం

రోబోలు అనగానే లోహంతో కూడిన రూపమే గుర్తుకొస్తుంది. ఇవి మనలాంటి చర్మంతో ఉంటే? జపాన్‌లోని యూనివర్సిటీ ఆఫ్‌ టోక్యో పరిశోధకులు అలాంటి ఘనతే సాధించారు. రోబో ముఖాలకు ‘సజీవ’ చర్మాన్ని అతికించే విధానాన్ని గుర్తించారు. దీంతో రోబో ముఖ కవళికలు సహజంగా ఉంటాయి. నవ్వినప్పుడు మన ముఖం మాదిరిగా కనిపిస్తుంది. 
మనుషుల కణజాలాల నిర్మాణాలను అనుకరించటం ద్వారా  జపాన్‌ పరిశోధకులు ఈ సజీవ చర్మాన్ని రూపొందించారు. ప్రయోగాత్మకంగా తయారుచేసిన ఇది చూడటానికి ఆటబొమ్మలా కనిపిస్తున్నప్పటికీ నిజం చర్మంలా కనిపించేలా చేయొచ్చని చెబుతున్నారు. ప్రయోగశాలలో సజీవ కణాల సాయంతో ఈ కృత్రిమ చర్మాన్ని అభివృద్ధి చేశారు. ఇది నిజం చర్మంలా మృదువుగానే కాకుండా ఎక్కడైనా తెగితే తనకు తానే మరమ్మతు చేసుకోగలదు. అందువల్ల మున్ముందు కదిలే హ్యూమనాయిడ్‌ రోబోలకు త్వరగా చిరగని, తమకు తామే నయమయ్యే చర్మాన్ని తయారు చేయటానికి తోడ్పడగలదని భావిస్తున్నారు. చర్మం ముడతలు, సౌందర్య సాధనాలు, శస్త్ర చికిత్సలు, చివరికి ప్లాస్టిక్‌ సర్జరీ వంటి వాటిపై చేసే పరిశోధనలకూ ఇది ఉపయోగపడగలదని భావిస్తున్నారు.


మన చర్మ నిర్మాణాన్ని అనుకరిస్తూ.. 

ఇంతకుముందు కృత్రిమ చర్మాన్ని రోబోకు అతికించటం కష్టంగా ఉండేది. చిన్న మేకుల సాయంతో అతికించినా రోబో కదిలినప్పుడు చిరిగిపోయేది. సాధారణంగా మన చర్మం పొర కొలాజెన్, ఎలాస్టిన్‌ వంటివాటికి అతుక్కొని ఉంటుంది. పరిశోధకులు కూడా దీన్నే అనుకరించారు. రోబోకు చిన్న చిన్న రంధ్రాలు చేసి కొలాజెన్‌తో కూడిన జిగురుద్రవాన్ని పూశారు. దాని మీద కృత్రిమ చర్మాన్ని అతికించారు. జిగురు ద్రవం అటువైపున రంధ్రాలకు అంటుకొని, ఇటువైపున చర్మాన్ని పట్టి ఉంచుతుంది. సహజంగా మృదువుగా ఉండటం వల్ల రోబో కదిలినా చిరగదు, ఊడిరాదు. రోబో లోపల అధునాతన యాక్చుయేటర్లను (కండరాలు) అమర్చితే మనుషుల మాదిరిగానే ముఖ కవళికలను సాధించొచ్చని పరిశోధకులు చెబుతున్నారు. చర్మ, తైల గ్రంథులు, రంధ్రాలు, రక్తనాళాలు, కొవ్వు, నాడులను జోడించటం ద్వారా మరింత మందమైన, నిజమైన చర్మాన్ని సృష్టించొచ్చనీ వివరిస్తున్నారు. తమకు తామే మరమ్మతు చేసుకుంటూ, పరిసరాలను మరింత కచ్చితంగా గుర్తిస్తూ మనుషుల మాదిరిగా నైపుణ్యంతో రోబోలు పనిచేస్తే ఇంకేం కావాలి? 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని