Camera: ఇంటికి కావాలో కెమెరా..

గ్రామాలు, పట్టణాలు, నగరాలనే తేడా లేకుండా భద్రత కోసం సీసీటీవీ కెమెరాల నిఘా తప్పనిసరైంది. వీటిల్లో తీగతో కూడినవి, తీగలు లేనివి.. రెండు రకాలున్నాయి. వీటికి బయటి నుంచి విద్యుత్తు సరఫరా తప్పనిసరి.

Published : 10 Jul 2024 01:29 IST

గ్రామాలు, పట్టణాలు, నగరాలనే తేడా లేకుండా భద్రత కోసం సీసీటీవీ కెమెరాల నిఘా తప్పనిసరైంది. వీటిల్లో తీగతో కూడినవి, తీగలు లేనివి.. రెండు రకాలున్నాయి. వీటికి బయటి నుంచి విద్యుత్తు సరఫరా తప్పనిసరి. కానీ కొన్ని కెమెరాలు సౌర విద్యుత్తు లేదా బ్యాటరీతోనూ పనిచేస్తాయి. జరుగుతున్నదేంటో ప్రత్యక్షంగా చూడాలంటే అంతర్జాల అనుసంధానం అవసరం. ఇప్పుడు 4జీ సిమ్‌ను సపోర్టు చేసే కెమెరాలు కూడా ఉన్నాయి. కెమెరాలు కొనేముందు రిజల్యూషన్, నైట్‌ విజన్, మోషన్‌ డిటెక్షన్‌ వంటి ఫీచర్లున్నాయేమో చూసుకోవాలి. ప్రస్తుత పరిస్థితుల్లో 1080పీ నాణ్యతతో దృశ్యాలను చిత్రీకరించటానికి కనీసం 2.1 ఎంపీ రిజల్యూషన్‌ గల కెమెరా కావాలి. దూరం నుంచే నిఘా వేయాలనుకుంటే యాప్‌ సపోర్టు, ప్రత్యక్ష ప్రసార సామర్థ్యం గలవి ఎంచుకోవాలి. స్టోరేజీ ఆప్షన్లు రకరకాలుగా ఉండొచ్చు. కొన్నింటికి వెలుపల స్టోరేజీ అవసరమైతే.. కొన్ని కెమెరాలకు మైక్రోఎస్‌డీ కార్డు స్లాట్‌ ఉంటుంది. ఇవి తమకు తామే పాత డేటా మీద కొత్త డేటాను నిక్షిప్తం చేస్తాయి. స్టోరేజీ సామర్థ్యాన్ని బట్టి వారం నుంచి నెల వ్యవధి డేటాను నిల్వ చేసుకుంటాయి. కొన్ని కెమెరాలను ఎవరికివారే ఇన్‌స్టాల్‌ చేసుకోవచ్చు. కొన్నింటికి మాత్రం నిపుణులు అవసరం. మోటర్‌తో కూడిన కెమెరాలు అన్ని కోణాల్లోంచి దృశ్యాలను తీసుకుంటాయి. ఆరుబయట ఏర్పాటు చేయాలనుకుంటే ఇంగ్రెస్‌ రక్షణ ఉన్నవి కొనుక్కోవాలి. ఇటువంటి ఫీచర్లు గలవి, అందుబాటు ధరలో ఉన్నవాటిల్లో కొన్ని సీసీటీవీ కెమెరాలు ఇవీ.. 

ఐఎంఓయూ 360 డిగ్రీ 1080పీ ఫుల్‌ హెచ్‌డీ సెక్యూరిటీ కెమెరా

చవకగా అందుబాటులో గల స్మార్ట్‌ సెక్యూరిటీ కెమెరాల్లో ఇదొకటి. ధర తక్కువే అయినా 1080పీ నాణ్యతతో దృశ్యాలు రికార్డు చేస్తుంది. కదలికలను, మనుషులను పసిగట్టటం, నైట్‌ విజన్‌ ఫీచర్లూ ఉన్నాయి. ఇది గూగుల్‌ అసిస్టెంట్, అమెజాన్‌ అలెక్సాతోనూ అనుసంధానమవుతుంది. 

సీపీ ప్లస్‌ 3ఎంపీ స్మార్ట్‌ వై-ఫై సీసీటీవీ కెమెరా

ఇది రాత్రిపూట తెలుపు, నలుపులో చిత్రాలు తీస్తుంది. పగటి వేళల్లో రంగుల వీడియోలను చిత్రీకరిస్తుంది. అన్ని కోణాల్లో దృశ్యాలను స్వీకరించగలదు. టూ-వే టాక్‌ సపోర్టుతో పాటు అధునాతన మోషన్‌ ట్రాకింగ్‌నూ సపోర్టు చేస్తుంది.

టాపో టీపీ-లింక్‌ సీ200 హోమ్‌ సెక్యూరిటీ వై-ఫై స్మార్ట్‌ కెమెరా

ఇండోర్‌కు అనువైన కెమెరా ఇది. మొత్తం 360 డిగ్రీల్లో తిరిగి దృశ్యాలను రికార్డు చేయగలదు. 120 జీబీ వరకూ మైక్రోఎస్‌డీ కార్డును సపోర్టు చేస్తుంది. దాదాపు 16 రోజుల వరకూ వీడియోను దాచగలదు. వై-ఫై నెట్‌వర్క్‌తో అనుసంధానం చేసుకుంటే స్మార్ట్‌ఫోన్‌తో దూరం నుంచీ నియంత్రించొచ్చు.

ట్రూవ్యూ బుల్లెట్‌ సీసీటీవీ సెక్యూరిటీ కెమెరా

అతి తక్కువ ధరలో 4జీ సిమ్‌ సపోర్టుతో కూడిన సీసీటీవీ సెక్యూరిటీ కెమెరాల్లో ఇదొకటి. 3ఎంపీ సెన్సర్‌తో కూడిన ఇది 1296పీ నాణ్యతతో దృశ్యాలు తీస్తుంది. ఐపీ66 రేటింగ్‌ కూడా సొంతం చేసుకుంది. ఇండోర్, అవుట్‌డోర్‌ ఎక్కడైనా అమర్చుకోవచ్చు. బ్రాడ్‌బాండ్‌ కనెక్షన్‌ లేకపోయినా దూరం నుంచి జరుగుతున్న విషయాలను ప్రత్యక్షంగా చూడాలనుకునే వారికిది అనువుగా ఉంటుంది.

మైజిక్‌ స్మార్ట్‌ హోం కెమెరా

సౌర విద్యుత్తుతో పనిచేసే ఇది 4జీ సిమ్‌ను సపోర్టు చేయగలదు. దీనికి తీగలతో పనిలేదు. స్వతంత్రంగానే పనిచేస్తుంది. ఐపీ66 రేటింగ్‌తో కూడిన దీనికి మైక్రోఎస్‌డీ కార్డ్‌ స్లాట్‌ ఉంటుంది. కెమెరాలోనే డేటాను స్టోర్‌ చేస్తుంది. ప్రత్యక్ష ప్రసారాన్నీ సపోర్టు చేస్తుంది. బ్యాటరీతో కూడుకొని ఉండటం వల్ల ఎండ లేకపోయినా గంటల కొద్దీ పనిచేస్తుంది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని