అంధుల కోసం వినూత్న స్మార్ట్‌వాచ్‌!

కళ్లు కనిపించనివారి కోసం ఐఐటీ కాన్పూర్‌ సరికొత్త స్మార్ట్‌వాచ్‌ను రూపొందించింది. ఇది సంప్రదాయ పరిజ్ఞానాలతో కూడిన వాచ్‌ల కన్నా మరింత బాగా ఉపయోగపడగలదని భావిస్తున్నారు.

Updated : 08 Feb 2023 03:01 IST

ళ్లు కనిపించనివారి కోసం ఐఐటీ కాన్పూర్‌ సరికొత్త స్మార్ట్‌వాచ్‌ను రూపొందించింది. ఇది సంప్రదాయ పరిజ్ఞానాలతో కూడిన వాచ్‌ల కన్నా మరింత బాగా ఉపయోగపడగలదని భావిస్తున్నారు. ప్రస్తుతం అంధుల కోసం నాలుగు రకాల చేతి గడియారాలు అందుబాటులో ఉన్నాయి. స్పర్శ (టాక్టయిల్‌) గడియారాలను వేలితో తాకినప్పుడో, అవి దేనికైనా గీసుకుపోయినప్పుడో ముల్లు విరిగే ప్రమాదముంది. సమయాన్ని మాట రూపంలో తెలిపే గడియారాలు గోప్యతకు భంగం కలిగించొచ్చు. కంపన గడియారాలు సంక్లిష్టమైనవైతే.. బ్రెయిలీ వాచ్‌లు ఖరీదైనవి. ఇలాంటి ఇబ్బందులను తొలగించే ఉద్దేశంతోనే ఐఐటీ కాన్పూర్‌ స్పర్శ, కంపన పరిజ్ఞానాలతో వినూత్న వాచ్‌ను తీసుకొచ్చింది. దీని డయల్‌ చుట్టూ గంటలను సూచించటానికి 12 టచ్‌ మార్కర్లు ఉంటాయి. వీటి మీద తాకితే సమయం తెలుస్తుంది. ఉదాహరణకు- సమయం 4.30 అయ్యిందనుకోండి. అప్పుడు 4, 6 మార్కర్లు యాక్టివ్‌గా ఉంటాయి. వేలితో తాకినప్పుడు అవి కంపనాలను సృష్టిస్తాయి. 4వ ముల్లును తాకినప్పుడు దీర్ఘ కంపనం పుడుతుంది. ఇది గంటలకు సూచిక. 6వ ముల్లు వద్ద స్వల్ప కంపనం పుడుతుంది. ఇది నిమిషాలకు సంకేతం. ఈ స్మార్ట్‌వాచ్‌లో గుండె వేగం, అడుగుల సంఖ్యను తెలిపే ఫీచర్లతో పాటు దాహం వేస్తున్న సంగతిని గుర్తు చేసే సదుపాయామూ ఉంది. షార్ట్‌ టైమర్‌నూ సెట్‌ చేసుకోవచ్చు. రెండు సార్లు, మూడు సార్లు తట్టటం వంటి తేలికైన పద్ధతులతోనే ఈ ఫీచర్లను ఉపయోగించుకోవచ్చు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని