Infinix Thunder Charge: ఇన్ఫినిక్స్‌ కొత్త ఛార్జర్‌.. 13 నిమిషాల్లో బ్యాటరీ ఫుల్‌!

ఇన్ఫీనిక్స్‌ కంపెనీ 180 వాట్ థండర్‌ ఛార్జ్‌ పేరుతో కొత్త తరం ఛార్జింగ్‌ టెక్నాలజీని తీసుకొస్తున్నట్లు ప్రకటించింది. ఈ కొత్త ఛార్జింగ్‌ సాంకేతికతతో 4,500 ఎంఏహెచ్‌ బ్యాటరీ కేవలం 4 నిమిషాల్లో 50 శాతం, 13 నిమిషాల్లో వంద శాతం ఛార్జ్‌ అవుతుందని తెలిపింది..

Updated : 01 Jul 2022 19:00 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: కొత్త ఫోన్‌ కొనేవారు ఒకప్పుడు ఫోన్‌ బ్యాటరీ సామర్థ్యం ఎంత అనేది చూసేవారు. ప్రస్తుతం ఫోన్‌ ఛార్జర్‌ ఎంత వేగంగా పనిచేస్తుందనే దానిపై దృష్టి సారించారు. గతంలో మాదిరి ఫోన్‌ ఛార్జింగ్‌ కోసం గంటల తరబడి వేచిచూడకుండా నిమిషాల్లో ఛార్జింగ్‌ అయ్యే మోడల్స్‌ వైపే యూజర్లు మొగ్గుచూపుతున్నారు. దీంతో మొబైల్‌ తయారీ కంపెనీలు కూడా ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సాంకేతికతతో ఛార్జర్లను తీసుకొస్తున్నాయి. ఇప్పటి వరకు 33 వాట్, 50 వాట్‌, 80 వాట్‌గా ఉన్న ఛార్జర్లు ప్రస్తుతం 100 వాట్‌ను దాటేశాయి. ఇటీవలే షావోమి కంపెనీ 120 వాట్‌ సామర్థ్యంతో ఛార్జర్‌ను పరిచయం చేసింది. దీంతో కేవలం 17 నిమిషాల్లోనే వంద శాతం బ్యాటరీ ఛార్జ్‌ అవుతుంది. తాజాగా ఇన్ఫీనిక్స్‌ కంపెనీ 180 వాట్ థండర్‌ ఛార్జ్‌ పేరుతో కొత్త తరం ఛార్జింగ్‌ టెక్నాలజీని తీసుకొస్తున్నట్లు ప్రకటించింది. ఈ కొత్త ఛార్జింగ్‌ సాంకేతికతతో 4,500 ఎంఏహెచ్‌ బ్యాటరీ కేవలం 4 నిమిషాల్లో 50 శాతం, 13 నిమిషాల్లో వంద శాతం ఛార్జ్‌ అవుతుందని తెలిపింది. ఇన్ఫీనిక్స్‌ కంపెనీ త్వరలో విడుదల చేయబోతున్న ఫ్లాగ్‌షిప్‌ ఫోన్‌లో ఈ సాంకేతికతను పరిచయం చేయనుందట. 

ఇన్ఫీనిక్స్‌ థండర్‌ ఛార్జ్‌ టెక్నాలజీలో 111 సాఫ్ట్‌వేర్‌, హార్డ్‌వేర్ సెక్యూరిటీ మెకానిజమ్‌ను ఉపయోగించారు. దీనివల్ల ఏదైనా కారణంచేత ఫోన్‌ ఛార్జ్‌ అయ్యేప్పుడు వేడెక్కినా వెంటనే ఫోన్‌కు ఛార్జింగ్‌ సరఫరా ఆపేస్తుంది. ఇందుకోసం 20 టెంపరేచర్‌ సెన్సర్లు ఉన్నాయి. ఇవి యూఎస్‌బీ పోర్ట్‌, ఛార్జింగ్‌ చిప్స్‌, బ్యాటరీ, ఛార్జింగ్‌ కేబుల్ వంటి వాటిని నిరంతరం పర్యవేక్షిస్తూ ఫోన్‌ ఉష్ణోగ్రత 43 డిగ్రీ సెంటిగ్రేడ్‌ కంటే తక్కువ ఉంచుతాయి. అలానే ఫోన్‌పై ఒత్తిడి లేకుండా రెండు 8సీ బ్యాటరీలను ఉపయోగించారట. ఇవి 90 వాట్ పవర్‌ను తట్టుకుంటాయి. దీనివల్ల ఫోన్‌ ఛార్జ్‌ అయ్యేటప్పుడు వేడి ఉత్పన్నం కాకుండా త్వరగా ఛార్జ్‌ అవుతుందని ఇన్ఫినిక్స్‌ తెలిపింది. గతేడాదే 160 వాట్ ఛార్జింగ్‌ సాంకేతికతను పరిచయం చేస్తామని ప్రకటించినప్పటికీ, ఇప్పటి వరకు దాన్ని మార్కెట్లోకి విడుదల చేయలేదు. దానిస్థానంలోనే 180 వాట్ ఛార్జర్‌ను తీసుకొస్తున్నట్లు సమాచారం. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని