Instagram: స్టోరీ లైక్‌.. ఇన్‌స్టాలో మీ స్పందనకు ఓ లెక్కుంది!

ఫొటో/వీడియో షేరింగ్‌ యాప్‌ ఇన్‌స్టాగ్రామ్ మరో కొత్త ఫీచర్‌ణు యూజర్లకు అందుబాటులోకి తీసుకొచ్చింది. మరి ఈ ఫీచర్‌ ఎలా పనిచేస్తుందో చూద్దాం.

Published : 15 Feb 2022 21:22 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఇన్‌స్టాగ్రామ్‌ (Instagram) మరో కొత్త ఫీచర్‌ను యూజర్లకు పరిచయం చేసింది. స్టోరీ లైక్‌ (Story Like) పేరుతో తీసుకొచ్చిన ఈ ఫీచర్‌తో యూజర్లు ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీలకు తమ సపోర్ట్‌ను తెలియజేయవచ్చు. గతంలో ఇన్‌స్టాలో ఇతరులు షేర్‌ చేసిన స్టోరీలకు స్పందన చేసేందుకు ఎమోజీ లేదా టెక్ట్స్‌ మెసేజ్‌ పంపితే, అది డైరెక్ట్ మెసేజ్‌ (Direct Message - DM) ఇన్‌బాక్స్‌లో కనిపించేది. తాజాగా తీసుకొచ్చిన ఫీచర్‌తో స్టోరీలకు యూజర్స్‌ పంపే స్పందనలు వ్యూయర్‌ షీట్‌ (Viewer Sheet)లో కనిపిస్తాయని ఇన్‌స్టాగ్రామ్‌ హెడ్ ఆడమ్‌ మొస్సెరీ తెలిపారు. ‘‘ఇక నుంచి స్టోరీస్‌ కోసం మీరు పంపే ప్రతి ఎమోజీ లేదా టెక్ట్స్‌ మెసేజ్‌లు స్టోరీ పబ్లిష్‌ చేసిన వారి డైరెక్ట్ మెసేజ్‌ థ్రెడ్‌లో కాకుండా, వ్యూయర్‌ షీట్‌లో కనిపిస్తాయి’’ అని ఆడమ్‌ ట్వీట్‌ చేశారు.

గతంలో ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీస్‌లో లైక్‌ కౌంట్‌ బటన్ ఉండేది కాదు. అలానే పోస్ట్‌కు ఎన్ని లైకులు వచ్చాయనేది ఇతరులకు కనిపించకుండా ఉంచే ఫీచర్‌ కోసం ఇన్‌స్టాగ్రామ్ సుమారు రెండు సంవత్సరాల సమయం తీసుకంది. తర్వాత లైక్‌ కౌంట్‌ హైడ్‌ ఫీచర్‌ను ఎనేబుల్/డిసేబుల్ చేయాలా అనే నిర్ణయాన్ని యూజర్లకు వదిలేస్తూ కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది. ప్రస్తుతం స్టోరీ లైక్‌లో ఎవరెవరు మీ స్టోరీని లైక్‌ చేశారు అనేది మీకు మాత్రమే వ్యూయర్‌ షీట్‌లో కనిపిస్తుంది. దీనివల్ల యూజర్స్‌ ఒకరికొకరు సపోర్ట్ చేసుకోవడంతోపాటు డైరెక్ట్‌ మెసేజ్‌ ఇన్‌బాక్స్‌ కొంత ఖాళీ అవుతుందని ఇన్‌స్టాగ్రామ్‌ తెలిపింది. 

ఇన్‌స్టాగ్రామ్‌ను యూజర్‌ ఫ్రెండ్లీ ఫ్లాట్‌ఫామ్‌గా మార్చడంలో భాగంగా వరుస కొత్త ఫీచర్లను పరిచయం చేస్తుంది. కొద్ది రోజుల క్రితం ఇన్‌స్టాలో ఎక్కువ సమయం గడిపే వారి కోసం టేక్ ఏ బ్రేక్‌ (Take A Break) పేరుతో కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది. దీంతో యూజర్స్‌ అదే పనిగా ఇన్‌స్టాగ్రామ్‌ చూస్తుంటే స్క్రీన్‌ మీద టేక్‌ ఏ బ్రేక్ అనే పాప్‌-అప్‌ విండో ప్రత్యక్షమవుతుంది. అందులో సూచించిన టైమ్‌ లిమిట్స్‌తో ఒకదాన్ని ఎంచుకుంటే, ఇన్‌స్టాగ్రామ్‌ వినియోగం నుంచి విరామం తీసుకుని కొంత సమయం తర్వాత తిరిగి ఉపయోగించుకునే వెసులుబాటు కల్పిస్తుంది. అలానే పిల్లలు ఇన్‌స్టాగ్రామ్‌ను ఎంత సమయం, ఎందుకు కోసం ఉపయోగిస్తున్నారనేది తల్లిదండ్రులు తెలుసుకునేందుకు వీలుగా మరో కొత్త ఫీచర్‌ను తీసుకొస్తున్నట్లు కంపెనీ తెలిపింది. ప్రస్తుతం ఉన్న యువర్ యాక్టివిటీ (Your Activity) ఫీచర్‌కు అదనంగా ఈ ఫీచర్‌ను తీసుకురానున్నట్లు సమాచారం. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని