Instagram: ఇన్‌స్టాలోనే గడిపేస్తున్నారా..? ఈ ఫీచర్‌ మీ కోసమే!

ఇన్‌స్టాగ్రామ్ టే ఏ బ్రేక్ ఫీచర్‌ను భారత్‌లో యూజర్లకు పరిచయం చేసింది. మరి ఈ ఫీచర్ ఎలా పనిచేస్తుంది. దీంతో ఎలాంటి ఉపయోగాలున్నాయో తెలుసుకుందాం. 

Published : 05 Feb 2022 02:40 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: సోషల్‌ మీడియాలో యువత ఎక్కువ సమయం గడపకుండా ఉండేందుకు ఫొటో/వీడియో షేరింగ్ యాప్‌ ఇన్‌స్టాగ్రామ్‌ కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా ‘టేక్‌ ఏ బ్రేక్’ (Take A Break)పేరుతో సరికొత్త ఫీచర్‌ను భారత్‌లో పరిచయం చేసింది. దీంతో మెరుగైన, సురక్షితమైన సామాజిక మాధ్యమ వేదికగా ఇన్‌స్టాగ్రామ్‌ ఉంటుందని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ ఫీచర్‌తో యూజర్స్ ఇన్‌స్టాగ్రామ్‌ వినియోగం నుంచి విరామం తీసుకుని కొంత సమయం తర్వాత తిరిగి ఉపయోగించుకునే వెసులుబాటు కల్పిస్తుంది. అలానే ఇన్‌స్టాగ్రామ్‌లో ఎంత సమయం గడుపుతున్నారు? ఎలాంటి అంశాలను ఎక్కువగా చూస్తున్నారు? వంటి అంశాలను విశ్లేషించుకొని తిరిగి అర్థవంతంగా ఇన్‌స్టాగ్రామ్‌ను ఉపయోగించేందుకు ఈ ఫీచర్‌ సాయపడుతుందని ఫేస్‌బుక్‌ తెలిపింది.

ఒకవేళ యూజర్ ఎక్కువ సమయం ఇన్‌స్టాగ్రామ్‌ చూస్తున్నట్లయితే ఫోన్‌ స్క్రీన్‌పైన టేక్‌ ఏ బ్రేక్‌ పాప్‌-అప్‌ మెసేజ్‌ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేస్తే ఎంత సమయం బ్రేక్ తీసుకోవాలనే దానికి సంబంధించి టైమ్‌ పరిమితులు కనిపిస్తాయి. వాటిని సెలెక్ట్ చేసిన తర్వాత కొన్ని సూచనలు చేస్తుంది. అందులో టేక్‌ ఏ డీప్ బ్రీత్‌, మీరు ఏం ఆలోచిస్తున్నారో రాయమని, మీకు నచ్చిన పాటలు వినమని, టు-డు లిస్ట్‌లోని పనులు పూర్తి చేయమని ఇన్‌స్టాగ్రామ్‌ సూచిస్తుంది. ఈ ఫీచర్‌ గురించి యువతకు అవగాహన కల్పించేందుకు  వుయ్‌ ది యంగ్ (We The Young) అనే ఇన్‌స్టాగ్రామ్‌ పేజ్‌తో కలిసి ‘బ్రేక్ జరూరీ హై’ అనే క్యాంపెన్‌ను నిర్వహిస్తుంది. ఈ పేజ్‌ సమాజంలోని ఇన్‌స్టాగ్రామ్‌ కంటెంట్ క్రియేటర్స్, మానసిక నిపుణులతో కలిసి పనిచేస్తూ టేక్‌ ఏ బ్రేక్‌ ఫీచర్‌ను యువత ఉపయోగించుకునేలా నెల రోజులపాటు కార్యక్రమాలు నిర్వహించనుంది.

ఇదేకాకుండా తమ పిల్లలు ఎంతసేపు ఇన్‌స్టాగ్రాం చూస్తున్నారనేది తెలుసుకునేలా తల్లిదండ్రులు, గార్డియన్స్‌ కోసం మరో కొత్త ఫీచర్‌ను తీసుకురానుంది. దీని సాయంతో నిర్ణీత సమయం వరకు మాత్రమే ఇన్‌స్టాగ్రామ్ ఉపయోగించేలా టైమ్‌ లిమిట్‌ కూడా పెట్టుకోవచ్చని సంస్థ వెల్లడించింది. ప్రస్తుతం ఈ ఫీచర్‌ పరీక్షల దశలో ఉందని, మార్చి నెలలో అందుబాటులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నట్లు ఇన్‌స్టాగ్రాం బ్లాగ్‌లో వెల్లడించింది.  ప్రస్తుతం ఎక్కువ శాతం యూజర్స్‌ అధిక సమయం డిజిటల్‌ డివైజ్‌లతో గడుపుతుండటంతో టెక్ సంస్థలు డిజిటల్ వెల్‌ బీయింగ్ ఫీచర్లను పరిచయం చేస్తున్నాయి. ఇప్పటికే గూగుల్, శాంసంగ్ వంటి సంస్థలు ఈ తరహా ఫీచర్లను తీసుకొచ్చాయి. తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌ టేక్‌ ఏ బ్రేక్‌ను తెచ్చింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని