Instagram Update: ఇన్‌స్టాగ్రామ్‌లో కొత్తగా ఏడు ఫీచర్లు.. పోలింగ్, క్విక్ షేర్‌, ఈజీ రిప్లై..ఇంకా!

ఇన్‌స్టాగ్రామ్‌ యూజర్ల కోసం కొత్తగా ఏడు ఫీచర్లను పరిచయం చేసింది. వీటితో యూజర్లు మెసేజ్‌ చాటింగ్, క్విక్‌ షేరింగ్ వంటివి చేయొచ్చని ఇన్‌స్టాగ్రామ్‌ తన బ్లాగ్‌లో పేర్కొంది. 

Updated : 03 Apr 2022 11:49 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: మెటా కంపెనీ తమ సోషల్‌ మీడియా యాప్‌లలో వరుస కొత్త పీచర్లను తీసుకొస్తూ యూజర్లను ఆకట్టుకుంటోంది. ఇటీవలే వాట్సాప్ వాయిస్‌ మెసేజ్‌లో ఆరు కొత్త ఫీచర్లను పరిచయం చేసిన మెటా, తాజాగా ఫొటో/వీడియో షేరింగ్ యాప్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో ఏడు కొత్త మెసేజింగ్‌ ఫీచర్లను తీసుకొచ్చింది. వీటి సాయంతో యూజర్లు మ్యూజిక్‌ ప్రివ్యూస్‌, సైలెంట్ మెసేజెస్‌, క్విక్ షేర్‌, ఈజీ రిప్లై, చాటింగ్‌కు ఆన్‌లైన్‌లో ఎవరున్నారనేది చూడటం వంటివి చేయొచ్చని ఇన్‌స్టాగ్రామ్‌ వెల్లడించింది. ఈ ఏడాది చివరినాటికి ఇన్‌స్టాగ్రామ్‌ మెసేజింగ్‌లో మరిన్ని కొత్త ఫీచర్లను యూజర్లకు పరిచయం చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు కంపెనీ పేర్కొంది. ఇంకేం మరి ఈ ఏడు ఫీచర్లపై ఓ లుక్కేద్దాం..

రిప్లై మరింత సులువుగా (Reply While You Browse)

ఇన్‌స్టా ఫీడ్‌ను బ్రౌజ్‌ చేస్తున్నప్పుడు మెసేజ్‌ వస్తే.. ఇన్‌బాక్స్‌లోకి వెళ్లకుండా, మీరు చూస్తున్న ఫీడ్‌ నుంచి బయటికి వెళ్లకుండా సదరు మెసేజ్‌కు రిప్లై ఇవ్వవచ్చు. ఈ ఫీచర్‌తో ఇన్‌స్టాగ్రామ్‌లో చాటింగ్ మరింత సులువుగా చేయొచ్చని కంపెనీ తన బ్లాగ్‌లో పేర్కొంది. 

క్విక్‌ షేర్‌ (Quickly Send To Friends)

ఇన్‌స్టాలో ఎవరైనా షేర్‌ చేసిన ఫొటో/వీడియో ఆస్తకికరంగా ఉంటే ఇతరులకు రీషేర్ చేస్తాం. ప్రతిసారీ అలా రీషేర్ చేయాలంటే కొంత సమయం వృథా అవుతుంది. తాజా అప్‌డేట్‌తో ఒక్క క్లిక్‌తో మీకు నచ్చిన కంటెంట్‌ను సులువుగా షేర్‌ చేయొచ్చని తెలిపింది. 

ఆన్‌లైన్‌లో ఎవరున్నారో చూడొచ్చు (See Who's Online)

ఈ ఫీచర్‌తో ఇన్‌స్టాలో చాట్ చేసేందుకు ఎవరు అందుబాటులో ఉన్నారనేది తెలుసుకోవచ్చు. దీంతో యూజర్స్‌ సమయం ఆదా అవడంతోపాటు, స్నేహితులతో సులువుగా కనెక్ట్ కావచ్చు.

పాట నచ్చిందా..షేర్‌ చేసేయడమే (Play, pause and re-play)

త్వరలోనే యాపిల్‌ మ్యూజిక్‌, అమెజాన్‌ మ్యూజిక్‌, స్పోటిఫై వంటి యాప్‌లను ఇన్‌స్టాగ్రామ్‌తో అనుసంధానించనున్నారు. దీంతో యూజర్స్‌ పాటలు వింటూ.. తమకు నచ్చిన పాటకు సంబంధించిన 30 సెకన్ల ప్రివ్యూని షేర్‌ చేయొచ్చు. మీరు షేర్‌ చేసిన పాటను చాట్ పేజీ నుంచి మీ స్నేహితులు, ఇతరులు వినవచ్చు.

సైలెంట్ మెసేజ్‌ (Send silent Messages)

ఇన్‌స్టాలో మెసేజ్‌ పంపితే నోటిఫికేషన్‌లో తెలుస్తుంది. అయితే మీ మెసేజ్‌ నోటిఫికేషన్‌ వల్ల అవతలి వారి పనికి భంగం కలగవచ్చు లేదా వాళ్లు తీరికలేకుండా ఉండొచ్చు. అలాంటి వారి కోసం ఇన్‌స్టాగ్రామ్‌ సైలెంట్ మెసేజ్‌ ఫీచర్‌ను తీసుకొచ్చింది. మీరు పంపే మెసేజ్‌కు ముందు @Silent అని టైప్‌ చేస్తే మెసేజ్‌ నోటిఫికేషన్‌ సైలెంట్‌గా అవతలి వారికి చేరుతుంది. 

చాట్‌ థీమ్‌ (Keep it on ye lo-fi)

ఇతరులతో చాట్ చేసేప్పుడు మీ మనసుకు నచ్చిన థీమ్‌ను చాట్ పేజ్‌ బ్యాక్‌గ్రౌండ్‌లో పెట్టుకోవచ్చు. దానివల్ల చాట్ పేజీ మరింత ఆకర్షణీయంగా మారుతుంది. 

పోలింగ్‌ (Create a Poll with your squad)

స్నేహితులతో కలిసి డిన్నర్‌కు వెళదామనుకున్నారు. ఎక్కడికి వెళ్లాలనే దాని కోసం స్నేహితుల అభిప్రాయం తీసుకునేందుకు పోల్ నిర్వహించవచ్చు. ఇందుకోసం మెసేంజర్‌లోని గ్రూప్‌ చాట్‌ ఫీచర్‌ను ఇన్‌స్టాలో పరిచయం చేశారు. దీంతో ఇన్‌స్టాలో కూడా ఇతరుల అభిప్రాయం తెలుసుకునేందుకు పోలింగ్ నిర్వహించవచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని