Instagram Update: ఇకపై ఇన్‌స్టాలో కూడా వాయిస్‌ మెసేజ్‌, ఫొటో రిప్లై ఫీచర్‌!

ఇన్‌స్టాగ్రామ్‌ మరో కొత్త ఫీచర్‌ను యూజర్లకు పరిచయం చేయనుంది. ప్రస్తుతం పరీక్షల దశలో ఉన్న ఈ ఫీచర్‌ను త్వరలోనే యూజర్లకు అందుబాటులోకి తీసుకురానుంది. 

Published : 29 Mar 2022 03:16 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఫొటో/వీడియో షేరింగ్ యాప్‌ ఇన్‌స్టాగ్రామ్‌ వరుసగా కొత్త ఫీచర్లను పరిచయం చేస్తోంది. కొద్దిరోజుల క్రితం పేరెంటల్ కంట్రోల్‌, మినిమమ్‌ టైమ్‌ లిమిట్, స్టోరీ లైక్‌ వంటి ఫీచర్లను పరిచయం చేసింది. తాజాగా మరో కొత్త ఫీచర్‌ను యూజర్లకు అందబాటులోకి తీసుకురానుంది. ఈ ఫీచర్‌ సాయంతో యూజర్లు ఇన్‌స్టా స్టోరీలకు వాయిస్‌ మెసేజ్‌, ఫొటోతో రిప్లై ఇవ్వవచ్చు. ప్రస్తుతం పరీక్షల దశలో ఉన్న ఈ ఫీచర్‌ను త్వరలోనే యూజర్లకు అందుబాటులోకి తీసుకురానుంది. దీనికి సంబంధించిన స్క్రీన్‌ షాట్‌లను అలెసాండ్రో అనే సాఫ్ట్‌వేర్‌ డెవలపర్‌ తన ట్విటర్‌ ఖాతాలో షేర్ చేశారు. దీనితోపాటు యూజర్లు క్యూఆర్‌ కోడ్ సాయంతో ఇన్‌స్టా పోస్టులు షేర్‌ చేసుకునేలా మరో కొత్త ఫీచర్‌ను పరిచయం చేయనున్నట్లు సమాచారం. 

గత నెలలో ఇతరుల ఇన్‌స్టా స్టోరీలకు డైరెక్ట్‌గా లైక్‌ చేసేందుకు ప్రైవేట్‌ స్టోరీ లైక్‌ అనే కొత్త ఫీచర్‌ను ఇన్‌స్టాగ్రామ్ పరిచయం చేసింది. అంతకముందు ఇతరుల స్టోరీలకు స్పందన తెలియజేయాలంటే ఎమోజీ లేదా టెక్ట్స్‌ పంపితే, అది డైరెక్ట్ మెసేజ్ ఇన్‌బాక్స్‌లో మాత్రమే కనిపించేది. ప్రైవేట్ స్టోరీ లైక్‌ ఫీచర్‌తో స్టోరీలకు యూజర్లు పంపే స్పందనలు వ్యూయర్‌ షీట్‌లో కనిపిస్తాయి. తాజాగా తీసుకొస్తున్న వాయిస్‌ మెసేజ్‌, ఫొటో రిప్లై ఫీచర్‌తో ప్రైవేట్ స్టోరీ లైక్‌ ఫీచర్‌ ఇకపై ఉండదని సమాచారం. ఇన్‌స్టాగ్రామ్‌ హెడ్ ఆడమ్‌ మొస్సెరీ తాజాగా విడుదల వీడియోలో కూడా ఇన్‌స్టాగ్రామ్‌లో కీలక మార్పులు చోటుచేసుకోబోతున్నట్లు చెప్పారు. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని