Apple iPhone: కొత్త ఐఫోన్లు వచ్చేస్తున్నాయ్‌.. వివరాలివే!

ఈ ఏడాది యాపిల్ ఐఫోన్ ఎస్‌ఈ3, ఐఫోన్ 14 మోడల్స్‌ను విడుదలచేయనుంది. మరి వీటిలో ఎలాంటి ఫీచర్లున్నాయో చూద్దాం. 

Updated : 12 Aug 2022 15:37 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: యాపిల్ ఉత్పత్తులకు మార్కెట్లో ఉండే డిమాండ్ గురించి తెలిసిందే. ధర ఎక్కువగా ఉన్నా ఒక్కసారైనా వాటిని ఉపయోగించాలని చాలా మంది ఆశపడుతుంటారు. గతేడాది ఐఫోన్ 13 సిరీస్‌తోపాటు, మరికొన్ని యాపిల్ ఉత్పత్తులను విడుదల చేసింది. అలానే యాపిల్ ఈ ఏడాది ఐఫోన్ 14 వెర్షన్‌తోపాటు, ఐఫోన్ మిడ్‌-రేంజ్‌ వేరియంట్‌ ఎస్‌ఈ 3ను తీసుకురానుంది. ఈ మోడల్స్‌కు సంబంధించిన ఫీచర్లను యాపిల్‌ పాపులర్ టిప్‌స్టర్‌ మింగ్‌ చి కూ వెల్లడించారు. మరి వీటిలో ఎలాంటి ఫీచర్లు రానున్నాయో చూద్దాం!


ఐఫోన్ ఎస్‌ఈ3

2020 నుంచి ఎస్‌ఈ వేరియంట్‌ను అప్‌డేట్ చేయలేదు. దీంతో ఈ ఏడాది ఏప్రిల్‌లో విడుదలకానున్న ఎస్‌ఈ3 వేరియంట్‌ కోసం ఐఫోన్‌ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ మోడల్‌ ఐఫోన్ ఎక్స్‌ఆర్‌ను పోలి ఉంటుందట. తొలుత ఇందులో నాచ్‌లెస్‌ డిస్‌ప్లే ఉంటుందనే వార్తలు వెలువడ్డాయి. తాజా సమాచారం ప్రకారం ఫేస్‌ ఐడీ ఫీచర్‌తో  5.69 అంగుళాల హెచ్‌డీ రెటీనా నాచ్ డిస్‌ప్లే ఇస్తున్నారట. వెనుక 12 ఎంపీ, ముందు 7 ఎంపీ కెమెరాలుంటాయని సమాచారం. 5జీ సపోర్ట్‌తో ఏ15 బయోనిక్ చిప్ ఉపయోగించారని తెలుస్తోంది. ఈ మోడల్‌ను 128 జీబీ మెమొరీ వేరియంట్‌లో మాత్రమే తీసుకొస్తున్నారట. మార్చి నెలలో జరిగే యాపిల్‌ వర్చువల్ ఈవెంట్‌లో ఐఫోన్ ఎస్‌ఈ3ను విడుదల చేయనున్నట్లు సమాచారం. 


ఐఫోన్ 14 సిరీస్‌

ఈ సారి ఐఫోన్‌ 14లో మినీ వేరియంట్ ఉండదనే ఊహగానాలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. కేవలం ఐఫోన్ 14, ఐఫోన్ 14 మాక్స్‌‌, ఐఫోన్ 14 ప్రో, ఐఫోన్ 14 ప్రో మాక్స్‌ మోడల్స్‌ను మాత్రమే విడుదలవుతాయని సమాచారం. అలానే ఈ మోడల్స్‌లో సాధారణ సిమ్‌కు బదులు ఈ-సిమ్‌ ఫీచర్‌ను పరిచయం చేయనున్నారు. 120 హెర్జ్‌ రిఫ్రెష్ రేట్‌తో ప్రో మోషన్‌ నాచ్‌లెస్ డిస్‌ప్లే ఉంటుందని తెలుస్తోంది. ఇప్పటి వరకు విడులైన ఐఫోన్‌ మోడల్స్‌లో కేవలం ప్రో వేరియంట్లలో మాత్రమే ఈ డిస్‌ప్లేను ఇచ్చారు. అలానే ఐఫోన్ 14 ఫోన్లలో అల్ట్రా-స్మూత్‌ వ్యూయింగ్‌, గేమింగ్ ఎక్స్‌పీరియన్స్‌ను అందించేలా డిస్‌ప్లేను రూపొందించారట.

ఈ ఏడాది విడుదలయ్యే ఐఫోన్‌ 14 మోడల్స్‌లో 6 జీబీ ర్యామ్‌ ఉంటుందట. ఫోన్ల ధరలు తగ్గించాలనే భావనతో యాపిల్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఐఫోన్‌ 14 సిరీస్‌లో వెనుకవైపు 48 ఎంపీ ప్రధాన కెమెరాతోపాటు, 12 ఎంపీ అల్ట్రా వైడ్ యాంగిల్‌, టెలీ లెన్స్‌ అమర్చినట్లు సమాచారం. ఐఫోన్ 13 తరహాలోనే వీటిలో కూడా శాటిలైట్‌ నెట్‌వర్క్‌ కనెక్టివిటీ ఫీచర్‌ ఉంటుందట. ఈ ఫోన్లలో యాపిల్ 5ఎన్‌ఎమ్‌ ఏ 16 బయోనిక్ చిప్ ఉపయోగించారని తెలుస్తోంది. ఐఫోన్‌ 14, 14 ప్రో మోడల్స్‌లో 6.1 అంగుళాల డిస్‌ప్లే, మాక్స్‌, ప్రో మాక్స్‌ మోడల్స్‌లో 6.7 అంగుళాల డిస్‌ప్లే ఇస్తున్నారట.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని