SmartPhones: ఐకూ నుంచి ప్రీమియం 5జీ ఫోన్లు.. రియల్‌మీ నార్జో సిరీస్‌లో బడ్జెట్‌ ఫోన్‌!

ఐకూ కంపెనీ 9 సిరీస్‌లో మూడు కొత్త ఫోన్లను, రియల్‌మీ నార్జో సిరీస్‌లో ఒక మోడల్‌ను భారత మార్కెట్లోకి విడుదల చేశాయి. మరి ఈ ఫోన్లలో ఫీచర్లు ఎలా ఉన్నాయో చూద్దాం. 

Updated : 24 Feb 2022 19:20 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: భారత్‌లో 5జీ సేవలు అందుబాటులోకి రానుండటంతోపాటు, గేమింగ్‌ రంగానికి డిమాండ్ పెరుగుతుండటంతో మొబైల్‌ కంపెనీలు 5జీ, గేమింగ్‌కు అనుకూలమైన ఫీచర్లతో ఫోన్లను విడుదల చేస్తున్నాయి. కొత్తగా ఐకూ (iQoo) కంపెనీ 9 సిరీస్‌లో మూడు ఫోన్లను, రియల్‌మీ నార్జో (Realme Narzo)సిరీస్‌లో ఒక ఫోన్‌ను భారత మార్కెట్లోకి విడుదల చేశాయి. ఈ ఫోన్ల ధర, ఫీచర్లపై ఓ లుక్కేద్దామా మరి! 


ఐకూ 9 సిరీస్‌

ఐకూ కంపెనీ 9 సిరీస్‌లో ఐకూ 9 ప్రో 5జీ (iQoo 9 Pro 5G), ఐకూ 9 5జీ (iQoo 9 5G), ఐకూ 9 ఎస్‌ఈ 5జీ (iQoo 9 SE 5G) మోడల్స్‌ను విడుదల చేసింది. ఈ మూడు ఫోన్లు ఆండ్రాయిడ్ 12 ఆధారిత ఫన్‌టచ్‌ ఓఎస్‌ 12తో పనిచేస్తాయి. అమెజాన్‌, ఐకూ ఇండియా వెబ్‌సైట్ల ద్వారా ముందస్తు బుకింగ్స్‌ చేసుకోవచ్చు. గేమింగ్‌ ప్రియుల కోసం ప్రత్యేకంగా ఐకూ గేమింగ్‌ ప్యాడ్‌ను తీసుకొచ్చింది. గేమ్స్‌ ఆడేప్పుడు ఈ డివైజ్‌ను మొబైల్‌కు కనెక్ట్‌ చేసి గేమింగ్‌ను ఆస్వాదించవచ్చు. ఈ డివైజ్‌ను ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే 150 గంటలపాటు నిరంతరాయంగా పనిచేస్తుంది. దీని ధర రూ. 2,999. దీంతోపాటు ఐకూ కంపెనీ 50 వాట్‌ వైర్‌లెస్ ఛార్జర్‌ను కూడా విడుదల చేసింది. దీని ధర రూ. 4,499.


ఐకూ 9 ప్రో 5జీ

ఈ ఫోన్‌లో 120 హెర్జ్‌ రిఫ్రెష్‌ రేట్‌, 300 హెర్జ్‌ టచ్‌ శాంప్లింగ్‌ రేట్‌తో 6.78 అంగుళాల 2K E5 అమోలెడ్ డిస్‌ప్లే ఇస్తున్నారు. దీనికి 3డీ కర్వ్‌డ్ గ్లాస్‌ ప్రొటెక్షన్‌ ఉంది. స్నాప్‌డ్రాగన్‌ 8 జనరేషన్‌ 1 5జీ ప్రాసెసర్‌ను ఉపయోగించారు. ఐకూ 9 ప్రో 5జీలో మొత్తం నాలుగు కెమెరాలున్నాయి. వెనుక మూడు, ముందు ఒక కెమెరా అమర్చారు. వెనుకవైపు కెమెరాల కోసం ప్రత్యేకమైన చతురస్రాకార డిజైన్‌ను ఇస్తున్నారు. ఇందులో శాంసంగ్‌ ఐసోసెల్‌ జీఎన్‌5 ప్రైమరీ సెన్సర్‌తో 50 ఎంపీ కెమెరాతోపాటు, 50 ఎంపీ వైడ్‌-యాంగిల్‌, 16 ఎంపీ పొట్రెయిట్‌ సెన్సర్‌ కెమెరాలున్నాయి. ముందు సెల్ఫీల కోసం 16 ఎంపీ కెమెరా ఉంది. 4,700 ఎంఏహెచ్‌ బ్యాటరీ, 120 వాట్‌ ఫ్లాష్‌ ఛార్జింగ్‌కు, 50 వాట్ వైర్‌లెస్‌ ఛార్జింగ్‌కు సపోర్ట్‌ చేస్తుంది. ఐకూ 9 ప్రో 5జీ రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంది. 8 జీబీ ర్యామ్‌/256 జీబీ అంతర్గత మెమొరీ వేరియంట్‌ ధర రూ. 64,990. 12 జీబీ ర్యామ్‌/256 జీబీ ధర రూ. 69,990. 


ఐకూ 9 5జీ 

ఇందులో స్నాప్‌డ్రాగన్‌ 888+ 5జీ ప్రాసెసర్‌ను ఉపయోగించారు. 120 హెర్జ్‌ రిఫ్రెష్‌ రేట్, 300 టచ్‌ శాంప్లింగ్ రేట్‌తో 6.56 అంగుళాల ఫుల్‌ హెచ్‌డీ+ 10-బిట్ అమోలెడ్‌ డిస్‌ప్లే ఇస్తున్నారు. ఈ ఫోన్‌లో నాలుగు కెమెరాలున్నాయి. వెనుక 48 ఎంపీ ప్రైమరీ కెమెరాతోపాటు రెండు 13 ఎంపీ కెమెరాలు ఇస్తున్నారు. ముందు 16 ఎంపీ సెల్ఫీ కెమెరా అమర్చారు. 4,350 ఎంఏహెచ్‌ బ్యాటరీ ఉంది. ఇది 120 ఫ్లాష్‌ ఛార్జింగ్‌కు సపోర్ట్‌ చేస్తుంది. ఐకూ 9 5జీ రెండు వేరియంట్లలో లభిస్తుంది. 8 జీబీ ర్యామ్‌/ 128 జీబీ స్టోరేజ్‌ ధర రూ. 42,990. 12 జీబీ/256 జీబీ ధర రూ.46,990. 


ఐకూ 9 ఎస్‌ఈ 5జీ

120 హెర్జ్‌ రిఫ్రెష్‌ రేట్‌, 300 టచ్‌ శాంప్లింగ్‌తో 6.62 అంగుళాల ఫుల్‌హెచ్‌డీ+ అమోలెడ్ డిస్‌ప్లే ఇస్తున్నారు. స్నాప్‌డ్రాగన్‌ 888 5జీ ప్రాసెసర్‌ను ఉపయోగించారు. వెనుకవైపు 48 ఎంపీ ప్రైమరీ కెమెరాతోపాటు, 13 ఎంపీ వైడ్‌-యాంగిల్‌, 2 ఎంపీ మోనోక్రోమ్‌ కెమెరాలున్నాయి. ముందు 16 ఎంపీ  సెల్ఫీ కెమెరా ఉంది. 4,500 ఎంఏహెచ్‌ బ్యాటరీ ఇస్తున్నారు. ఇది 66 వాట్‌ ఫ్లాష్‌ ఛార్జ్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. ఐకూ 9 ఎస్‌ఈ 5జీ రెండు వేరియంట్లలో లభిస్తుంది. 8 జీబీ ర్యామ్/ 128 జీబీ మెమొరీ వేరియంట్‌ ధర రూ. 33,990. 12 జీబీ/256 జీబీ ధర రూ. 37,990. 


రియల్‌మీ నార్జో 50 

ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 11 ఆధారిత రియల్‌మీ యూఐ 2.0తో పనిచేస్తుంది. 120 హెర్జ్‌ రిఫ్రెష్‌ రేట్‌తో 6.6 అంగుళాల ఫుల్‌హెచ్‌డీ+ ఐపీఎస్‌ ఎల్‌సీడీ డిస్‌ప్లే ఇస్తున్నారు. మీడియాటెక్‌ హీలియో జీ96 ప్రాసెసర్‌ను ఉపయోగించారు. ర్యామ్‌ను పెంచుకునే ఫీచర్‌ ఉంది. రియల్‌మీ నార్జో 50లో నాలుగు కెమెరాలున్నాయి. వెనుక 50 ఎంపీ ప్రైమరీ కెమెరాతోపాటు రెండు 2 ఎంపీ కెమెరాలు ఇస్తున్నారు. ముందు 16 ఎంపీ సెల్ఫీ కెమెరా అమర్చారు. 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 33 వాట్‌ సూపర్‌డార్ట్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. రియల్‌మీ నార్జో 50 రెండు వేరియంట్లలో లభిస్తుంది. 4 జీబీ ర్యామ్‌/64 జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌ ధర రూ. 12,999. 6 జీబీ/128 జీబీ ధర రూ. 15,499. మార్చి 3 నుంచి రియల్‌మీ, అమెజాన్‌ వెబ్‌సైట్ల నుంచి కొనుగోలు చేయొచ్చు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని