
Emotional Wellness: అతిగా ఎమోషనల్ అవుతున్నారా..? ఈ యాప్‌లపై ఓ లుక్కేయండి..!
ఇంటర్నెట్ డెస్క్: మనిషి జీవితం సాఫీగా సాగాలంటే భావోద్వేగాలను నియంత్రించుకోవాలి. లేదంటే అనవసర సమస్యలను కొని తెచ్చుకున్న వారవుతాం. మరి ఎమోషన్స్‌ను నియంత్రించుకోవడం ఎలా? ఫిజికల్ ఫిట్నెస్కి ఎంత ప్రాధాన్యం ఇస్తామో.. ఎమోషనల్ ఫిట్‌నెస్‌కూ అంతే ప్రాధాన్యం ఇవ్వాలంటున్నారు మానసిక నిపుణులు. ఇందు కోసం ఎలాంటి యాప్‌లు అందుబాటులో ఉన్నాయో తెలుసుకుందాం.
మై లైఫ్ మెడిటేషన్ (My Life Meditation)
ఈ యాప్‌లో వివిధ రకాల భావోద్వేగాల నియంత్రణకు సంబంధించి 400కు పైగా యాక్టివిటీలు ఉన్నాయి. అందులో మీకు నచ్చిన భావోద్వేగాన్ని ఎంచుకుంటే దానికి తగినట్లుగా రోజువారీ యాక్టివిటీలను యాప్ సూచిస్తుంది. వాటిని క్రమం తప్పకుండా సాధన చేయడం ద్వారా మీలోని కోపం, ఆందోళన, నిద్రలేమితనం వంటి వాటిని అధిగమించవచ్చు. ఈ యాప్‌ను గూగుల్ ప్లేస్టోర్, యాపిల్ యాప్‌స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఉచిత, సబ్స్క్రిప్షన్ వెర్షన్లలో అందుబాటులో ఉంది.
ఒరా (Aura)
ఎమోషన్ల్ వెల్నెస్కు ప్రధాన శత్రువు ఒత్తిడి అంటున్నారు మనస్తత్వ నిపుణులు. ఒత్తిడికి వేర్వేరు కారణాలుంటాయి. అయితే కొన్ని సందర్భాల్లో ఒత్తిడిని అధిగమించగల్గుతాం. మరికొన్నిసార్లు సాధ్యంకాదు. ప్రస్తుత పోటీ ప్రపంచంలో ప్రతి ఒక్కరి జీవితం ఒత్తిళ్లమయమే. మరి ఒత్తిడిని ఎలా జయించాలి. అందు కోసం రూపొందిందే ఒరా యాప్. ఇది ఒత్తిడిని తగ్గించుకునేందుకు మెడిటేషన్, రిలాక్సేషన్ వంటి యాక్టివిటీలను సూచిస్తుంది. మీరు యాప్ ఓపెన్ చేసి ఒత్తిడిగా ఉన్నట్లు తెలియజేస్తే ఒరా మీకు శ్రావ్యమైన సంగీతం వినిపించడం, జీవిత సత్యాలను బోధించే కథలు చెప్పడం, జీవితంలో చేయాల్సిన గొప్ప పనుల గురించి చెప్పడం వంటివి చేస్తుంది. ఆండ్రాయిడ్, ఐఓఎస్ యూజర్లకు ఈ యాప్ అందుబాటులో ఉంది. సబ్స్క్రిప్షన్ తప్పనిసరి.
7 మినిట్ వర్కౌట్ (7 Minute Workout)
ఎమోషనల్ వెల్నెస్కు ఫిజికల్ ఫిట్నెస్ కూడా ఎంతో ముఖ్యం. వ్యాయామం, నవ్వడం వంటివి చేసినప్పుడు మీ శరీరంలో ఎండార్ఫిన్ అనే హార్మోన్ల పరిమాణం పెరుగుతుంది. వీటిని హ్యాపీ హార్మోన్లు అని కూడా అంటారు. ఇవి మనలోని ప్రతికూల ఆలోచనల్ని తరిమికొట్టి మనసును సంతోషం వైపు నడిపించడంతోపాటు ఎమోషనల్ వెల్నెస్ను పెంపొందించుకునేందుకు తోడ్పడతాయి. మిమ్మల్ని క్రమపద్ధతిలో వ్యాయామం చేయించేందుకు ఉద్దేశించినదే 7 మినిట్ వర్కౌట్ యాప్. ఈ యాప్ మీరు ఫిట్‌గా ఉండేందుకు అవసరమైన వర్కౌట్లను సూచించడంతోపాటు, ఫిట్నెస్ గోల్స్‌ను నిర్దేశిస్తుంది. వాటితో మీరు తక్కువ సమయంలోనే శారీరక, మానసిక ఆరోగ్యాన్ని పొందగలుగుతారు. గూగుల్ ప్లేస్టోర్, యాపిల్ యాప్ స్టోర్ నుంచి ఈ యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఉచిత, సబ్స్క్రిప్షన్ వెర్షన్లలో అందుబాటులో ఉంది. ఫిజికల్ ఫిట్‌నెస్‌కు సంబంధించి ప్లేస్టోర్, యాప్ స్టోర్‌లో ఎన్నో రకాల యాప్‌లు ఉన్నాయి. వాటిలో మీకు నచ్చిన వాటిని ఉపయోగించవచ్చు.
స్లీప్ సైకిల్: స్లీప్ రికార్డర్ (Sleep Cycle: Sleep Recorder)
నిద్ర.. మనిషి జీవితంలో అత్యంత ముఖ్యమైన ప్రక్రియ. శరీరానికి తగినంత నిద్ర లేకపోతే భావోద్వేగాల్లో హెచ్చుతగ్గులు ఏర్పడటం వంటి వాటితోపాటు బరువు పెరగడం, ఇమ్యూనిటీ తగ్గడం వంటి ఎన్నో సమస్యలు వస్తాయి. అంతేకాదు నిద్రలేమి.. ఒత్తిడి, ఆందోళనకు కారణమవుతుందట. అందుకే నాణ్యమైన నిద్ర ఉండేలా చూసుకోవాలంటున్నారు నిపుణులు. రాత్రులు హాయిగా నిద్రపోతే తర్వాతి రోజు ఉదయం ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. రోజూ మీరు ఎంత సమయం నిద్రపోతున్నారనేది స్లీప్ సైకిల్ యాప్ ద్వారా ట్రాక్ చేయొచ్చు. ఇందులోని స్మార్ట్ అలారం మీరు రోజులో ఎన్ని గంటలు నిద్రపోతున్నారో తెలియజేస్తుంది. తర్వాత మీ పూర్తి నిద్ర వేళలకు సంబంధించి సమాచారాన్ని విశ్లేషించి, మీ నిద్ర సమయాన్ని పెంచుకునేందుకు అవసరమైన సూచనలు చేస్తుంది. ఈ యాప్ ఆండ్రాయిడ్, ఐఓఎస్ యూజర్లకు ఉచిత, సబ్స్క్రిప్షన్ వెర్షన్లో అందుబాటులో ఉంది.
వెంట్ (Vent - Express Yourself Freely)
ప్రశాంతమైన వ్యక్తిత్వం కోసం మనసులో ఉత్పన్నమయ్యే భావాలను వ్యక్తపరచటం ఎంతో ముఖ్యం. కొంత మంది మాటల ద్వారా వ్యక్తపరిస్తే, మరికొందరు రచనలు, కథలు, పాటలు, సంగీతం, చిత్రలేఖనం వంటి వేర్వేరు పద్ధతుల్లో వ్యక్తపరుస్తారు. ఒకవేళ మీలోని భావాలను సరిగా వ్యక్తపరచలేకపోతే మీరు వెంట్ యాప్ సాయం తీసుకోవచ్చు. ఈ యాప్ మీ వ్యక్తిగత వివరాలను గోప్యంగా ఉంచుతూనే మీరు చెప్పాలనుకుంటున్న విషయాన్ని ఇతరులతో వ్యక్తపరిచేందుకు ఉపకరిస్తుంది. ఈ యాప్ మీకు సోషల్ డైరీలా ఉపయోగపడుతుంది. మీరు పంచుకున్న విషయాలకు ఇతరులు తమ ప్రత్యేకమైన బటన్స్ ద్వారా తమ అభిప్రాయాన్ని వ్యక్తపరవచ్చు. అలానే మీరు కూడా ఇతరులు పంచుకున్న వాటిపై మీ అభిప్రాయాన్ని చెప్పవచ్చు.