కళ్లపై డిజిటల్‌ ఒత్తిడి..చెక్ పెట్టండిలా

ప్రస్తుతం చాలా వరకు ఉద్యోగాలు కంప్యూటర్ ముందు కూర్చుని చేసేవే. అయితే రోజులో ఎక్కువ సమయం కంప్యూటర్‌ ముందే కూర్చోవడం చాలా మందిలో దీర్ఘకాలిక రోగాలకు కారణమవుతున్నాయట. మరీ ముఖ్యంగా కంప్యూటర్ స్క్రీన్‌ నుంచి వచ్చే కాంతి వల్ల కళ్లపై తీవ్ర ఒత్తిడి పెరిగి కంప్యూటర్ విజన్‌ సిండ్రోమ్‌...

Published : 09 Feb 2021 18:14 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రస్తుతం చాలా వరకు ఉద్యోగాలు కంప్యూటర్ ముందు కూర్చుని చేసేవే. అయితే రోజులో ఎక్కువ సమయం కంప్యూటర్‌ ముందే కూర్చోవడం చాలా మందిలో దీర్ఘకాలిక రోగాలకు కారణమవుతుందట. మరీ ముఖ్యంగా కంప్యూటర్ స్క్రీన్‌ నుంచి వచ్చే కాంతి వల్ల కళ్లపై తీవ్ర ఒత్తిడి పెరిగి కంప్యూటర్ విజన్‌ సిండ్రోమ్‌కు గురవుతున్నారని లైన్‌ ఆఫ్ సైట్ వ్యవస్థాపకురాలు డాక్టర్‌ జెన్నిఫర్ సాయ్‌ అన్నారు. ఇంతకీ కంప్యూటర్ విజన్ సిండ్రోమ్ అంటే ఏంటో చూద్దాం..

కంప్యూటర్ విజన్ సిండ్రోమ్‌ 

డిజిటల్ స్క్రీన్‌ నుంచి వచ్చే కాంతి కళ్ల మీద పడినప్పుడు దానికి తగినట్లుగా కళ్లు చూపును సర్దుబాటు చేసుకుంటాయి. అప్పుడే లైట్ కంటి రెటీనాపై సరిగా పడుతుంది. దీని వల్ల వస్తువులను స్పష్టంగా చూడగలుగుతాం. ఒక వేళ మీరు ఎక్కువ సమయం డిజిటల్ స్క్రీన్‌ ముందు గడుపుతుంటే మీ కళ్ల కండరాలపై ఒత్తిడి పెరిగి కంప్యూటర్‌ విజన్‌ సిండ్రోమ్‌కు దారి తీస్తుంది. దీని వల్ల తలనొప్పి, కళ్లు పొడిబారడం, చూపు మసకగా మారడం, చదివేప్పుడు ఇబ్బందులు, ఏకాగ్రత లేకపోవడం, చిన్నపాటి కాంతిని కూడా కళ్లు తట్టుకోలేకపోవడం వంటి సమస్యలు తలెత్తుతాయని డాక్టర్‌‌ జెన్నిఫర్ తెలిపారు. అలానే ఈ సమస్యను అధిగమించేందుకు ఆమె కొన్ని సూచనలు చేశారు.

20-20-20 రూల్

కంప్యూటర్‌ స్క్రీన్‌ను ఎక్కువ సమయం చూడాల్సి వస్తే విడతల వారీగా విరామం తీసుకోవాలి. కానీ మనలో చాలా మంది విరామ సమయంలో కూడా ఫోన్‌ స్క్రీన్‌ను చూస్తుంటారు.  దాని వల్ల విరామం తీసుకున్నా ఎలాంటి ఉపయోగం ఉండదు. ఈ విరామ సమయాన్ని సమర్థవంతంగా ఉపయోగించుకోవాలంటే 20-20-20 నియమాన్ని పాటించాలి. అంటే ప్రతి 20 నిమిషాలకోసారి విరామం తీసుకోవాలనేది గుర్తుంచుకోవాలి. అలానే విరామ సమయంలో 20 అడుగుల దూరంలో ఉన్న వస్తువులను 20 సెకన్ల పాటు చూస్తుండాలి. అలా చేయడం వల్ల కళ్లకు కొంత మేర ఉపశమనం కలుగుతుందని డాక్టర్ జెన్నిఫర్ తెలిపారు.

డిజిటల్ దూరం పాటించాలి

కళ్లపై ఒత్తిడిని తగ్గించుకునేందుకు డిజిటల్ దూరం పాటించడం మరో మార్గం. మీ కంప్యూటర్‌ లేదా ల్యాప్‌టాప్ స్క్రీన్‌ని మీకు అనుకూలమైన దూరం నుంచి చూసేందుకు ప్రయత్నించాలి. చిన్న పిల్లలకు స్క్రీన్ వాళ్లు చేయి చాచినంత దూరంలో ఉంచి చూడటం అలవాటు చేయాలి. అలానే స్క్రీన్ కాంతి తీవ్రతను తగ్గించాలి. దాని వల్ల బ్లూ లైట్ ఎక్స్‌పోజర్‌ తగ్గుతుంది. ముఖ్యంగా సాయంత్రం సమయంలో దీని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. వీలైతే బ్లూ లైట్ కళ్లద్దాలు ధరించాలి. ఇవి కళ్లపై బ్లూ లైట్‌ ప్రభావాన్ని తగ్గిస్తాయి. చివరిగా ఏడాదికోసారి కంటి పరీక్షలు చేయించుకోవాలని సూచిస్తున్నారు. దాని వల్ల మీ కంటి చూపులో ఏవైనా లోపాలు ఉంటే తెలియడమే కాకుండా ఇతరత్రా కంటి సమస్యలకు రాకుండా పాటించాల్సిన జాగ్రత్తలు తెలుసుకోవచ్చంటున్నారు.

ఇవీ చదవండి..

10 నిమిషాల్లోనే బ్యాటరీ ఫుల్‌!

ఫోన్ కెమెరాతో హార్ట్‌ రేట్ ట్రాకింగ్.. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని