Facebook: ఫేస్‌బుక్‌ ఖాతా హ్యాక్‌ అయిందా..? ఇలా రికవరీ చేయండి!

ఫేస్‌బుక్‌ ఖాతా హ్యాకయితే ఏం చేయాలి? తిరిగి ఖాతాను ఎలా పునరుద్ధరించుకోవాలో తెలుసుకుందాం. 

Updated : 15 May 2022 23:12 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: వ్యక్తిగత ఆలోచనలతో పాటు, సమకాలీన అంశాలపై అభిప్రాయాలను వ్యక్తపరిచేందుకు సామాజిక మాధ్యమాలు చక్కనైన వేదికలు. అంతేకాదు, పరిచయం లేని వ్యక్తుల గురించి ప్రాథమిక వివరాలు తెలుసుకునేందుకు కూడా వీటిని ఉపయోగిస్తుంటారు. అయితే కొన్ని సందర్భాల్లో ఫేస్‌బుక్‌ వంటి సామాజిక మాధ్యమ ఖాతాల్లోని వివరాలు బహిర్గతం కావడం యూజర్ల వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగిస్తోంది. ఇటీవలి కాలంలో తమ ఫేస్‌బుక్‌ ఖాతాలు హ్యాక్‌ అయినట్లు పెడుతున్న మెసేజ్‌లు చూస్తూనే ఉన్నాం. దీంతో అందులోని ఫొటోలు, మెసేజ్‌లు వంటి సమాచారం సైబర్‌ నేరగాళ్లకు చేరిపోతుందని ఆందోళన చెందుతుంటాం. ఇలాంటి పరిస్థితుల్లో హ్యాకైన ఖాతాను తిరిగి ఎలా దాన్ని పునరుద్ధరించుకోవాలో తెలుసుకుందాం.  

యూజర్‌ అనుమతి లేకుండా ఫేస్‌బుక్‌ ఖాతాలోకి లాగిన్‌ కావాలంటే.. ఒకటి యూజర్‌ నేమ్‌, పాస్‌వర్డ్‌ తెలిసి ఉండాలి. రెండోది హ్యాకింగ్‌ చేయాలి. ఒకవేళ ఫేస్‌బుక్‌ ప్రొఫైల్‌లో ఈ-మెయిల్‌, పాస్‌వర్డ్‌, పుట్టిన తేదీ, పేరు వంటి వివరాలు యూజర్ ప్రమేయం లేకుండా మారితే ఫేస్‌బుక్‌ యూజర్‌కు అలర్ట్ మెసేజ్‌ పంపుతుంది. అలానే అపరిచిత వ్యక్తులకు ఫ్రెండ్ రిక్వెస్ట్‌, మెసేజ్‌లు పంపినా, యూజర్‌కు తెలియకుండా ఫేస్‌బుక్‌ వాల్‌పై పోస్టులు చేసినా సదరు ఖాతా హ్యాక్‌కు గురైనట్లేనని ఫేస్‌బుక్‌ చెబుతోంది. 

* ఒకవేళ ఖాతా హ్యాకైనట్లు అనుమానం కలిగితే వెంటనే లాగిన్‌ పాస్‌వర్డ్‌ మార్చుకోమని ఫేస్‌బుక్‌ సూచిస్తోంది. ఇందుకోసం ఫేస్‌బుక్‌లో సెట్టింగ్స్‌ అండ్ ప్రైవసీలోకి వెళ్లి పాస్‌వర్డ్‌ అండ్‌ సెక్యూరిటీలో ఛేంజ్‌ పాస్‌వర్డ్‌ ఆప్షన్‌పై క్లిక్ చేసి మార్చుకోవచ్చు. 

* అలానే సెట్టింగ్స్‌ అండ్ ప్రైవసీలో మీ ఖాతా ఏయే డివైజ్‌లలో లాగిన్‌ అయిందనేది కూడా తెలుసుకోవచ్చు. వాటిలో మీ అనుమతిలేని డివైజ్‌ ఉంటే దాని నుంచి వెంటనే మీ ఖాతాను తొలగించడం మేలు. 

* ఒకవేళ ఖాతా పునరుద్ధరించడం సాధ్యం కాకపోతే.. Facebook.com/hacked లోకి వెళితే మీ ఖాతాకు లింక్‌ అయిన ఫోన్‌ నంబర్‌ ఎంటర్‌  చేయమని సూచిస్తుంది. మీరు ఎంటర్‌ చేసిన ఫోన్‌ నంబర్‌, ఖాతాలోని నంబర్‌తో సరిపోలితే, మీ ఖాతాను పునరుద్ధరించేందుకు ఫేస్‌బుక్‌ మీకు సాయం చేస్తుంది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని