Browser Extentions: బ్రౌజర్‌ నుంచి ఎక్స్‌టెన్షన్లు ఎలా తొలగించాలంటే..?

ఆన్‌లైన్‌ విహారం ఎలాంటి టెన్షన్‌ లేకుండా పూర్తవ్వాలంటే ఎక్స్‌టెన్షన్‌ సాయం తీసుకోవాల్సిందే. మరి బ్రౌజర్‌లో మనకు అవసరంలేని ఎక్స్‌టెన్షన్లు ఎలా తొలగించాలలో తెలుసుకుందాం.

Updated : 18 Feb 2022 15:00 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: స్మార్ట్‌ఫోన్లకు యాప్‌లు ఉన్నట్లుగానే.. బ్రౌజర్‌కు ఎక్స్‌టెన్షన్‌లు పనిచేస్తాయి. ఆన్‌లైన్‌ విహారం ఎలాంటి టెన్షన్‌ లేకుండా పూర్తవ్వాలంటే ఎక్స్‌టెన్షన్‌ సాయం తీసుకోవాల్సిందే. యూజర్‌ అవసరాలకు తగినట్లుగా ఎప్పటికప్పుడు కొత్త ఎక్స్‌టెన్షన్లు అందుబాటులోకి వస్తూనే ఉన్నాయి. అయితే ఎక్కవ ఎక్స్‌టెన్షన్ల వినియోగం బ్రౌజర్ పనితీరును నెమ్మదింపజేస్తుంది. అలానే చాలా కాలం నుంచి అప్‌డేట్ కానీ ఎక్స్‌టెన్షన్లు మీ బ్రౌజర్‌పై సైబర్‌ దాడికి కారణం కావచ్చు. అంతేకాదు కొన్ని రకాల ఎక్స్‌టెన్షన్ల ద్వారా యూజర్ డేటా హ్యాకర్స్ చేతికి చిక్కే ప్రమాదం ఉందని సైబర్‌ నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందుకే అవసరమైన ఎక్స్‌టెన్షన్లను మాత్రమే ఉపయోగించాలని సూచిస్తున్నారు. మరి ఎక్స్‌టెన్షన్లు తొలగించేప్పుడు ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి? వేర్వేరు బ్రౌజర్ల నుంచి ఎక్స్‌టెన్షన్లు ఎలా తొలగించాలనేది తెలుసుకుందాం.


💻 నెల రోజులు, అంతకు మించి ఏదైనా ఎక్స్‌టెన్షన్‌ ఉపయోగించకుంటే దాన్ని తొలగించగటం మేలంటున్నారు సైబర్ నిపుణులు.

💻 బ్రౌజర్‌ అప్‌డేట్ చేసినప్పుడు కొన్ని రకాల కొత్త ఫీచర్లు యూజర్లకు అందుబాటులోకి వస్తాయి. దాంతో అప్పటిదాకా మీరు ఉపయోగిస్తున్న ఎక్స్‌టెన్షన్ల అవసరం ఉండదు. అలానే బ్రౌజర్‌ సపోర్ట్ చేయకపోవడం వల్ల కొన్ని ఎక్స్‌టెన్షన్లు పనిచేయకపోవచ్చు. అలాంటప్పుడు వాటిని తొలగిస్తే మేలు. 

💻 ఇంటర్నెట్‌ డేటా ఆదా చేసేందుకు చాలా మంది ఇంటర్నెట్‌ సేవింగ్‌ ఎక్స్‌టెన్షన్లను ఉపయోగిస్తుంటారు. అయితే మీరు చేసే బ్రౌజింగ్‌తో పోల్చినప్పుడు కేవలం ఒక్క క్లిక్‌కు అవసరమైన డేటాను ఆదా చేసే ఎక్స్‌టెన్షన్లు బ్రౌజర్‌లో ఉంచకోవాల్సిన అవసరం లేదంటున్నారు సైబర్ నిపుణులు. భద్రతపరంగా వాటిలో లోపాలుంటే మీ డేటా మొత్తం హ్యాకర్ల చేతికి చేరిపోవచ్చు. అందుకే డేటా సేవింగ్ పేరుతో ఉండే ఎక్స్‌టెన్షన్ల జోలికి పోవద్దు. 


డిసేబుల్‌ - రిమూవ్‌.. రెండింటిలో ఏది?

బ్రౌజర్‌లోని కొన్ని ఎక్స్‌టెన్షన్లలో రిమూవ్‌తోపాటు, డిసేబుల్ ఆప్షన్‌ కూడా ఉంటుంది. దాంతో చాలా మంది యూజర్స్‌ అవసరమైనప్పుడు ఉపయోగించుకోవచ్చనే కారణంతో డిసేబుల్ చేసి వాటిని బ్రౌజర్‌లో ఉంచేస్తారు. నెలకోసారి ఉపయోగించే ఎక్స్‌టెన్షన్లలో ఈ పద్ధతి సరైనదే. అలానే మీరు ఉపయోగించని వాటిని తొలగిస్తే, అందులోని మీ డేటా మొత్తం డిలీట్ అయిపోతుంది. ఒకవేళ ఎక్స్‌టెన్షన్‌ సరిగా పనిచేయకున్నా, దాన్ని ఉపయోగించకున్నా తొలగించడమే మేలంటున్నారు సైబర్ నిపుణులు. అలాంటి వాటిని బ్రౌజర్‌లో ఉంచుకోవడం వల్ల ఎలాంటి ఉపయోగంలేదంటున్నారు. 


గూగుల్ క్రోమ్‌ (Google Chrome) 

క్రోమ్ బ్రౌజర్‌ ఓపెన్ చేసి పైభాగంలో కుడివైపు చివరన మూడు చుక్కలపై క్లిక్ చేస్తే మెనూ కనిపిస్తుంది. అందులో మోర్ టూల్స్‌పై క్లిక్ చేస్తే ఎక్స్‌టెన్షన్స్ ఆప్షన్‌ కనిపిస్తుంది. దాన్ని ఓపెన్‌ చేస్తే మీ బ్రౌజర్‌లో ఉన్న ఎక్స్‌టెన్షన్స్‌ కనిపిస్తాయి. వాటిలో మీకు అవసరంలేనివి, చాలా కాలం నుంచి ఉపయోగించని వాటిని ఎంపిక చేసుకోవాలి. తర్వాత వాటిపై ఉండే రిమూవ్ ఆప్షన్‌పై క్లిక్ చేస్తే సదరు ఎక్స్‌టెన్షన్‌ బ్రౌజర్‌ నుంచి డిలీట్ అయిపోతుంది. అలానే మీరు తరచుగా ఉపయోగించని ఎక్స్‌టెన్షన్‌ను తొలగించకూడదనుకుంటే పక్కనే ఉన్న డిసేబుల్ బటన్‌పై క్లిక్ చేస్తే అది మీకు బ్రౌజర్‌ పేజీలో కనిపించదు. తర్వాత మీకు అవసరమైనప్పుడు వాటిని ఎనేబుల్ చేస్తే ఎప్పటిలానే ఉపయోగించుకోవచ్చు.  


మైక్రోసాఫ్ట్ ఎడ్జ్‌ (Microsoft Edge)

గూగుల్ క్రోమ్‌ తరహాలోనే మైక్రోసాఫ్ట్ ఎడ్జ్‌ నుంచి ఎక్స్‌టెన్షన్లను ఎంతో సులువుగా తొలగించవచ్చు. బ్రౌజర్‌ కుడివైపు పైభాగంలో ఉన్న మూడు చుక్కలపై క్లిక్ చేస్తే మెనూ పేజ్‌ ఓపెన్‌ అవుతుంది. అందులో ఎక్స్‌టెన్షన్స్‌ ఆప్షన్ ఉంటుంది. దాన్ని ఓపెన్‌ చేసి మేనేజ్‌ ఎక్స్‌టెన్షన్‌ (Manage Extentions)పై క్లిక్ చేయాలి. తర్వాత ఎక్స్‌టెన్షన్స్ పేజ్‌ ఓపెన్ అవుతుంది. అందులో అవసరంలేని ఎక్స్‌టెన్షన్స్‌ను డిలీట్ చేసేందుకు రిమూవ్ ఆప్షన్, బ్రౌజర్‌ పేజ్‌పై కనిపించకుండా చేసేందుకు డిసేబుల్, ఎనేబుల్ ఆప్షన్లు ఉంటాయి.  


యాపిల్ సఫారీ (Apple Safari)

సఫారీ బ్రౌజర్‌లో ప్రివరెన్సెన్స్‌(Preferences)లోకి వెళ్లి ఎక్స్‌టెన్షన్స్‌ టాబ్‌పై క్లిక్ చేయాలి. డిలీట్ చేయాలనుకుంటున్న ఎక్ష్‌టెన్షన్‌పై క్లిక్ చేసి అన్‌ఇన్‌స్టాల్ చేయొచ్చు. అయితే సఫారీ ఎక్స్‌టెన్షన్స్‌లో కొన్ని మ్యాక్‌ కంప్యూటర్లలో ఉండే యాప్‌లకు అనుబంధంగా ఉంటాయి. కాబట్టి ఎక్స్‌టెన్షన్స్‌ తొలగించే ముందు అవి ఏదైనా యాప్‌కు అనుబంధంగా ఉన్నాయా..లేదా అనేది సరిచూసుకుని అన్‌ఇన్‌స్టాల్ చేయాలి.


మొజిల్లా ఫైర్‌ఫాక్స్‌ (Mozilla Firefox)

ఇందులో కూడా బ్రౌజర్‌ పేజీ ఓపెన్ చేసిన తర్వాత కుడివైపు చివర పైన ఉన్న మూడు గీతలపై క్లిక్ చేయాలి. అందులో యాడ్‌-ఆన్స్‌ అండ్‌ థీమ్స్‌ (Ctrl + Shift + A) ఓపెన్ చేస్తే మీ బ్రౌజర్‌లో ఉన్న ఎక్స్‌టెన్షన్స్‌ జాబితా కనిపిస్తుంది. వాటిలో మీకు అవసరంలేని వాటిని డిసేబుల్ చేస్తే బ్రౌజర్‌ నుంచి డిలీట్ అయిపోతాయి. ఒకవేళ వాటిని ప్రస్తుతం ఉపయోగించకుండా, భవిష్యత్తు అవసరాల కోసం అట్టిపెట్టుకోవాలనుకుంటే ఆన్‌ లేదా ఆఫ్‌ చేయొచ్చు. అలానే థీమ్స్‌, ప్లగిన్స్‌ కూడా యాడ్‌-ఆన్స్‌ పేజీలోనే ఉంటాయి.


ఒపెరా (Opera)

కంప్యూటర్‌లో ఒపెరా బ్రౌజర్‌ ఓపెన్ చేయాలి. తర్వాత ఒపెరా లోగోపై క్లిక్ చేస్తే మెనూ పేజ్‌ ఓపెన్ అవుతుంది. అందులో ఎక్స్‌టెన్షన్ (Ctrl+Shift+E)పై క్లిక్ చేయాలి. తర్వాత ట్యాబ్‌లో ఎక్స్‌టెన్షన్స్‌తో కూడిన జాబితా కనిపిస్తుంది. వాటిలో ఏదైనా ఎక్స్‌టెన్షన్‌ను డిలీట్ చేయాలనుకుంటే ‘X’ మార్క్‌పై క్లిక్ చేయాలి. ఒకవేళ ఎక్స్‌టెన్షన్ బ్రౌజర్‌ పేజ్‌లో కనిపించకూడదనుకుంటే డిసేబుల్ ఆప్షన్‌పై క్లిక్ చేస్తే సరిపోతుంది. అలానే బ్రౌజర్‌ పేజ్‌లో ఉండే ఎక్స్‌టెన్షన్స్‌ కోసం కుడివైపు పైభాగంలో బాక్స్‌ ఐకాన్‌ ఉంటుంది. దానిపై క్లిక్ చేస్తే ఎక్స్‌టెన్షన్స్‌ జాబితా కనిపిస్తుంది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని