WhatsApp: మీ వాట్సాప్‌ సంభాషణలకు ఇలా చేస్తేనే సెక్యూరిటీ!

వాట్సాప్‌ చాట్‌ సంభాషణలు బహిర్గతం కాకుండా ఉండేందుకు ఎలాంటి సూచనలు పాటించాలో తెలుసుకుందాం.

Updated : 29 Mar 2022 14:01 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: వాట్సాప్‌లో చాట్ సంభాషణలు ఇతరులకు చూడకుండా, వ్యక్తిగత డేటా భద్రత కోసం ఎండ్‌-టు-ఎండ్‌ ఎన్‌క్రిప్షన్‌ ఫీచర్‌ ఉంది. ఇది సిగ్నల్‌ ప్రోటోకాల్‌ ఆధారంగా పనిచేస్తుంది. దీంతో ఇరువురి మధ్య జరిగిన చాట్ సంభాషణలను పంపినవారు, రిసీవ్ చేసుకున్న వారు మినహా వాట్సాప్‌తో సహా ఇతరులెవరూ చూడలేరు. అయితే కొన్నిసార్లు ఇరువురు వ్యక్తుల మధ్య వ్యక్తిగతంగా జరిగిన వాట్సాప్‌ చాట్‌ సంభాషణలు బహిర్గతమవుతుంటాయి. దీంతో వాట్సాప్‌లో ముఖ్యమైన సమాచారం షేర్ చేసేందుకు కొందరు భయపడుతున్నారు. అయితే వాట్సాప్‌లో చాట్ సంభాషణలు ఇతరులకు తెలియకుండా ఉండేందుకు టెక్‌ నిపుణులు కొన్ని సూచనలు చేస్తున్నారు. మరి ఆ సూచనలు ఏంటి? వాటిని ఎలా పాటించాలో చూద్దాం. 

పాస్‌వర్డ్ ప్రొటెక్షన్‌

ఫోన్‌లో వాట్సాప్‌ యాప్‌ ఇతరులెవరూ ఓపెన్ చేయకుండా, యాప్‌కు పాస్‌వర్డ్‌ లేదా టచ్‌ ఐడీని పెట్టుకోవడం మేలు. ఒకవేళ మీ ఫోన్‌ ఇతరులకు ఇచ్చినా.. పోగొట్టుకున్నా ఎవరూ వాట్సాప్‌ ఖాతాను ఓపెన్ చేయలేరు. దాంతో వాట్సాప్‌లోని చాట్ సంభాషణలు బహిర్గతమవుతాయన్న ఆందోళన ఉండదు. 

సెక్యూరిటీ నోటిఫికేషన్స్ 

వాట్సాప్‌ను మొబైల్‌తోపాటు డెస్క్‌టాప్‌లో ఉపయోగిస్తుంటాం. పాత ఫోన్‌ నుంచి కొత్త ఫోన్‌కు మారేప్పుడు మిగతా యాప్‌లతోపాటు కొత్తగా వాట్సాప్‌ ఇన్‌స్టాల్ చేసి లాగిన్ అవుతుంటాం. కొన్నిసార్లు వాట్సాప్‌ను అన్‌-ఇన్‌స్టాల్ చేసి తిరిగి ఇన్‌స్టాల్ చేస్తుంటాం. ఇలాంటప్పుడు వాట్సాప్‌ సెక్యూరిటీ కోడ్ మారినట్లు చాట్ సంభాషణల్లో కనిపిస్తుంది. అలా సెక్యూరిటీ కోడ్ మారినప్పుడు సదరు ఖాతాదారులే మీతో చాట్ చేస్తున్నారా? లేక ఇతరులు వారి ఖాతాను హ్యాక్‌ చేసి చాట్ చేస్తున్నారా? అనేది తెలుసుకోవాలి.

ఇందుకోసం చాట్‌ విండోలో ప్రొఫైల్ ఫొటోపై క్లిక్ చేస్తే ఎన్‌క్రిప్షన్‌ ఆప్షన్‌ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేస్తే క్యూఆర్‌ కోడ్‌తోపాటు, కోడ్‌ నంబర్స్‌ కనిపిస్తాయి. సదరు ఖాతాదారుడు మీకు దగ్గర్లో ఉంటే క్యూఆర్‌ కోడ్ స్కాన్‌ చేసి సెక్యూరిటీ వెరిఫికేషన్‌ చేయొచ్చు. ఒకవేళ దగ్గర్లో లేకుంటే కోడ్ నంబర్స్‌ పంపమని వాటిని సరిచూసుకోవాలి. దీని వల్ల మీ చాట్స్‌ ఎప్పటికి బహిర్గతం కావు. సెక్యూరిటీ కోడ్ మారినట్లు నోటిఫికేషన్‌ రావాలంటే మాత్రం వాట్సాప్‌ సెట్టింగ్స్‌లోకి వెళ్లి అకౌంట్‌పై క్లిక్ చేసి సెక్యూరిటీ ఆప్షన్‌పై క్లిక్‌ చేయాలి. అందులో షో నోటిఫికేషన్స్‌ ఆప్షన్‌ను ఎనేబుల్ చేయాలి. దాంతో మీ ఖాతాలోకి ఇతరుల సెక్యూరిటీ కోడ్ మారిన ప్రతిసారీ మీకు నోటిఫికేషన్‌ వస్తుంది. 

టూ-స్టెప్‌ వెరిఫికేషన్‌

మెసేజింగ్, మెయిల్‌ సేవలను అందించే సంస్థలు తప్పనిసరిగా ఈ ఫీచర్‌ను ఎనేబుల్ చేసుకోవాలని తమ యూజర్లకు సూచిస్తున్నాయి. దీనివల్ల డేటా భద్రతతోపాటు, ఖాతాలు హ్యాక్‌కు గురికాకుండా ఉంటాయని చెబుతున్నాయి. ఈ ఫీచర్‌ కోసం వాట్సాప్‌ సెట్టింగ్స్‌లోకి వెళ్లి అకౌంట్‌పై క్లిక్ చేస్తే టూ-స్టెప్‌ వెరిఫికేషన్‌ ఆప్షన్‌ కనిపిస్తుంది. దానిపై క్లిక్‌ చేసి ఫీచర్‌ను ఎనేబుల్ చేయాలి. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని