డేటా లీక్ ఆరోపణలను ఖండించిన ‘కూ’ సీఈవో

గత కొద్దిరోజులుగా కూ యాప్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో కూ యాప్,‌ యూజర్‌ వ్యక్తిగత సమాచారాన్ని లీక్ చేస్తుందని రాబర్ట్ బాప్టిస్టె అనే ఫ్రెంచ్ సెక్యూరిటీ రీసెర్చర్ ఆరోపించారు...

Published : 11 Feb 2021 23:41 IST

ఇంటర్నెట్ డెస్క్‌: గత కొద్దిరోజులుగా కూ యాప్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ట్విటర్‌కు ప్రత్యామ్నయంగా దేశీయంగా రూపుదిద్దుకున్న ఈ యాప్‌కు అంతకంతకు ప్రజాదరణ పెరుగుతోంది. కేంద్ర మంత్రుల, అధికారులు కూలో ఖాతా తెరుస్తున్నట్లు ప్రకటించారు. దీంతో ఒక్కసారిగా సోషల్‌ మీడియా యూజర్స్ దీనిపై దృష్టి సారించారు. ఈ నేపథ్యంలో కూ యాప్,‌ యూజర్‌ వ్యక్తిగత సమాచారాన్ని లీక్ చేస్తుందని రాబర్ట్ బాప్టిస్టె అనే ఫ్రెంచ్ సెక్యూరిటీ రీసెర్చర్ ఆరోపించారు. అంతేకాదు దానికి సంబంధించిన స్క్రీన్ షాట్స్‌‌ను తన ట్విటర్‌ ఖాతాలో షేర్ చేశారు. ట్విటర్‌ యూజర్ల కోరిక మేరకు కూ యాప్‌లో లోపాలను గుర్తించినట్లు రాబర్ట్‌ లిపారు. యూజర్ ఈ-మెయిల్, పేరు, లింగ నిర్ధారణ, పెళ్లి వివరాలు, పుట్టిన తేదీ వంటి వ్యక్తిగత వివరాలు కూ యాప్‌ నుంచి లీక్ అవుతున్నాయని ఆయన తన ట్వీట్లో పేర్కొన్నారు. 

ఈ ఆరోపణలపై కూ సీఈవో అప్రమేయ రాధాకృష్ణ స్పందించారు. ‘‘కూ యాప్ ద్వారా యూజర్ వ్యక్తిగత సమాచారం లీక్ అవుతుందనేది అవాస్తవం. కూ ఖాతా కలిగిన యూజర్ ప్రొఫైల్‌లో కనిపించే డేటా మొత్తం యూజర్‌ స్వచ్ఛందంగా వెల్లడించిందే. దాన్ని డేటా లీక్ అనలేం. మీరు ఏ ప్రొఫైల్ ఓపెన్ చేసినా ఆ వివరాలు కనిపిస్తాయి’’ అని అప్రమేయ ట్వీట్ చేశారు. అలానే 95 శాతం మంది యూజర్స్ తమ ఫోన్ నంబర్‌, భాష ఆధారంగానే కూ యాప్‌లోకి లాగిన్ అవుతారని అన్నారు. ఈ-మెయిల్‌ ఐడీ ద్వారా లాగిన్ కావాలనేది సంస్థ ప్రాధాన్యం కాదనీ తెలిపారు. యూజర్స్ నుంచి వచ్చిన అభ్యర్ధన మేరకు ఈ-మెయిల్ లాగిన్ ఫీచర్‌ను తొలగించామని అన్నారు.   

నకిలీ వార్తలు వ్యాప్తి చేస్తున్న ఖాతాలను తొలగించే విషయంలో కేంద్ర ప్రభుత్వానికి, ట్విటర్‌కు మధ్య ప్రతిష్ఠంభన నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కూ యాప్‌లో ఖాతా తెరవాలని కేంద్ర మంత్రి పీయూష్‌ గోయల్ ట్విటర్ వేదికగా తన ఫాలోవర్స్‌ని కోరారు. ప్రస్తుతం ఈ యాప్‌ను సుమారు 25లక్షల మందికి పైగా ఉపయోగిస్తున్నారు.  

ఇవీ చదవండి..

ట్విటర్‌కు పోటీగా ‘కూ’తకొచ్చింది..!

స్వేచ్ఛనిచ్చాం.. కానీ చట్టాలను పాటించాల్సిందే

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని