LastPass: యూజర్ డేటా లీకేజ్‌.. లాస్ట్‌పాస్‌ ఏమందంటే!

లాస్ట్‌పాస్‌లోని యూజర్‌ డేటాకు సంబంధించి ఎలాంటి సమాచారం బహిర్గతం కాలేదని కంపెనీ స్పష్టం చేసింది.  గత నెలలో లాస్ట్‌పాస్‌ సోర్స్‌కోడ్ హ్యాక్‌ అయినట్లు కంపెనీ ప్రకటించింది.

Published : 19 Sep 2022 01:41 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: లాస్ట్‌పాస్‌లోని యూజర్‌ డేటాకు సంబంధించి ఎలాంటి సమాచారం బహిర్గతం కాలేదని ఆ కంపెనీ స్పష్టం చేసింది.  గత నెలలో లాస్ట్‌పాస్‌ సోర్స్‌కోడ్ హ్యాక్‌ అయినట్లు ప్రకటించింది.  దీంతో కోట్ల మంది యూజర్ల డేటా హ్యాకర్స్‌ చేతికి చేరిపోయిందనే ఊహాగానాలు మొదలయ్యాయి. తాజాగా వీటిపై కంపెనీ సీఈవో కరిమ్‌ తౌబ్బా కీలక ప్రకటన చేశారు. యూజర్‌కు సంబంధించిన ఎలాంటి సమాచారం బహిర్గతం కాలేదని స్పష్టం చేశారు. ‘‘గత నెలలో సోర్స్‌కోడ్‌ను హ్యాక్‌ చేసిన ఘటనపై మా బృందం విచారణ జరిపింది. హ్యాకర్‌ యూజర్‌ డేటాకు సంబంధించిన డెవలప్‌మెంట్‌ ఎన్విరాన్‌మెంట్‌లోకి చొరబడేందుకు ప్రయత్నించాడు. కానీ, మా సిస్టమ్‌ కంట్రోల్స్‌ అతని చర్యలను అడ్డుకున్నాయి. దీంతో యూజర్స్‌ ఎన్‌క్రిప్టెడ్‌ పాస్‌వర్డ్‌ వ్యాలెట్‌ల వివరాలు హ్యాకర్‌ చేతికి చిక్కలేదు. దీని గురించి యూజర్లు ఆందోళన చెందాల్సిన అవసరంలేదు. వారి సమాచారం పూర్తి భద్రంగా ఉంది’’ అని తెలిపారు. 

లాస్ట్‌పాస్‌ వ్యాలెట్‌ను యాక్సెస్ చేయాలంటే మాస్టర్‌ పాస్‌వర్డ్ తప్పనిసరి. అలానే, వ్యాలెట్‌ వినియోగంతోపాటు, జీరో నాలెడ్జ్‌ సెక్యూరిటీ గురించి అవగాహనలేని ఇతరులు వ్యాలెట్‌ను యాక్సెస్‌ చేయలేరు. ఇది కేవలం వ్యాలెట్ యజమానికి మాత్రమే సాధ్యమవుతుందని కంపెనీ తెలిపింది. లాస్ట్‌పాస్‌కు ప్రపంచవ్యాప్తంగా సుమారు 3 కోట్ల మంది యూజర్లు ఉన్నారు. ఈ సంస్థ వినియోగదారుల తరఫున జీమెయిల్‌, నెట్‌ఫ్లిక్స్‌ వంటి పలు ఖాతాలకు కఠినమైన ఆటో జనరేటెడ్‌ పాస్‌వర్డ్‌లను ఇస్తుంది. గత నెలలో ఓ హ్యాకర్‌ కంపెనీ సిస్టమ్స్‌లోకి చొరబడి సోర్స్‌ కోడ్‌, ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్‌ను దొంగిలించినట్లు కంపెనీ ట్వీట్ చేసింది. తాజాగా యూజర్‌ డేటా లీక్‌ కాలేదని కంపెనీ స్పష్టం చేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని