లావా ఫోన్‌: మీరు ఎలా కావాలంటే అలా

భారతీయ మొబైల్‌ తయారీ కంపెనీ లావా నాలుగు కొత్త ఫోన్లు, ఒక ఫిట్‌నెస్‌ బ్యాండ్‌ను విడుదల చేసింది. పూర్తి దేశీయ పరిజ్ఞానంతో, 60 శాతం భారతీయ ఉత్పత్తులతో ఈ ఫోన్లు తయారైనట్లు కంపెనీ తెలిపింది...

Updated : 08 Jan 2021 19:42 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: భారతీయ మొబైల్‌ ఫోన్ల తయారీ కంపెనీ లావా నాలుగు కొత్త ఫోన్లు, ఒక ఫిట్‌నెస్‌ బ్యాండ్‌ను విడుదల చేసింది. పూర్తి దేశీయ పరిజ్ఞానంతో, 60 శాతం భారతీయ ఉత్పత్తులతో ఈ ఫోన్లు తయారైనట్లు కంపెనీ తెలిపింది. కొవిడ్‌-19 కారణంగా అంతర్జాతీయంగా గొలుసు రవాణా వ్యవస్థ స్తంభించింది. ఇది దేశీయ తయారీ రంగంపై తీవ్ర పభావం చూపించింది. దీంతో స్వదేశీ పరిజ్ఞానంతో అంతర్జాతీయ స్థాయి ఉత్పత్తులు తయారుచేయాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. ఇందులో భాగంగానే పలు కంపెనీలు నూతన ఆవిష్కరణలు చేపట్టాయి. 

ఇందులో భాగంగానే లావా జెడ్1, జెడ్‌2, జెడ్‌4, జెడ్6 పేరుతో నాలుగు కొత్త ఫోన్లు, లావా బేఫిట్ పేరుతో ఫిట్‌నెస్‌ బ్యాండ్‌ను తీసుకొచ్చింది. జెయూపీ పేరుతో ఏడాదిలోపు పాత లావా మోడల్‌ను కొత్త మోడల్‌తో రీప్లేస్‌ చేసుకునే అవకాశం కల్పిస్తున్నారు. మరి కొత్త ఫోన్లలో ఎలాంటి ఫీచర్లు ఇస్తున్నారు..వాటి ధరెంత..అమ్మకాలు ఎప్పుడు ప్రారంభమవుతాయో తెలుసుకుందాం.  


లావా జెడ్‌1  

లావా అందిస్తున్న ఎంట్రీలెవల్‌ ఫోన్ జెడ్‌1‌. ఇందులో 5-అంగుళాల డిస్‌ప్లే ఇస్తున్నారు. దీనికి కార్నింగ్‌ గొరిల్లా గ్లాస్‌ 3 ప్రొటెక్షన్‌ ఉంది. మీడియాటెక్‌ హీలియో ఏ20 ప్రాసెసర్‌ను ఉపయోగించారు. ముందు వెనక 5 ఎంపీ కెమెరా ఇస్తున్నారు. 3,100 ఎంఏహెచ్‌ బ్యాటరీ ఉంది. 2జీబీ ర్యామ్‌/16జీబీ ఇంటర్నల్ స్టోరేజీ వేరియంట్ ధర రూ. 5,499.   


లావా జెడ్‌2  

ఆండ్రాయిడ్ 10 ఆధారిత గో ఎడిషన్‌ ఓఎస్‌తో పనిచేస్తుంది. 6.5-అంగుళాల హెచ్‌డీ+ ఐపీఎస్‌ వాటర్‌ డ్రాప్‌ నాచ్‌ డిస్‌ప్లే ఇస్తున్నారు. కర్వ్‌డ్‌ గొరిల్లా గ్లాస్‌ 3 ప్రొటెక్షన్ ఉంది. మీడియాటెక్‌ హీలియో జీ35 ప్రాసెసర్‌ను ఉపయోగించారు. మొత్తం మూడు కెమెరాలున్నాయి. వెనక 13 ఎంపీ ప్రైమరీ కెమెరాతో పాటు 2 ఎంపీ సెకండరీ కెమెరా, ఎల్‌ఈడీ ఫ్లాష్‌ ఇస్తున్నారు. ముందు భాగంలో సెల్ఫీల కోసం 8 ఎంపీ కెమెరా అమర్చారు. 5,000 ఎంఏహెచ్‌ బ్యాటరీ ఉంది. 10 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. వెనక ఫింగర్‌ ప్రింట్ సెన్సర్‌ ఇస్తున్నారు. 2జీబీ ర్యామ్‌/32జీబీ అంతర్గత మెమొరీ వేరియంట్ ధర రూ. 6,999.


లావా జెడ్‌4  

ఇందులో 6.5-అంగుళాల హెచ్‌డీ+ ఐపీఎస్‌ డిస్‌ప్లే ఇస్తున్నారు. కార్నింగ్ గొరిల్లా గ్లాస్‌ 3 ప్రొటెక్షన్‌ ఉంది. మీడియాటెక్‌ హీలియో జీ35 ప్రాసెసర్‌ ఉపయోగించారు. మొత్తం నాలుగు కెమెరాలున్నాయి. వెనక మూడు, ముందు ఒక కెమెరా ఇస్తున్నారు. వెనక వైపు 13 ఎంపీ ప్రైమరీ కెమెరాతో పాటు 5 ఎంపీ సెకండరీ కెమెరా, 2 ఎంపీ టెరిటరీ కెమెరా ఉన్నాయి. ముందు భాగంలో 16 ఎంపీ సెల్ఫీ కెమెరా అమర్చారు. 5,000 ఎంఏహెచ్‌ బ్యాటరీ ఉంది. సైడ్‌ మౌంటెడ్‌ ఫింగర్‌ ప్రింట్ సెన్సర్‌ ఇస్తున్నారు. ఇది 4జీబీ ర్యామ్‌/64జీబీ ఇంటర్నల్‌ స్టోరేజీ ధర రూ. 8,999.      


లావా జెడ్6

ఈ మోడల్‌లో కూడా కార్నింగ్ గొరిల్లా గ్లాస్‌ 3 ప్రొటెక్షన్‌తో 6.5-అంగుళాల హెచ్‌డీ+ డిస్‌ప్లే ఇస్తున్నారు. ఆండ్రాయిడ్ 10 ఓఎస్‌తో పనిచేస్తుంది. మీడియాటెక్‌ హీలియో జీ35 ప్రాసెసర్‌ను ఉపయోగించారు. జెడ్‌4 తరహాలోనే ఇందులో కూడా వెనక 13 ఎంపీ ప్రైమరీ కెమెరాతో పాటు 5 ఎంపీ, 2ఎంపీ కెమెరాలు ఇస్తున్నారు. ముందు 16 ఎంపీ సెల్ఫీ కెమెరా అమర్చారు. 5,000 ఎంఏహెచ్‌ బ్యాటరీ ఉంది. వెనక ఫింగర్‌ ప్రింట్ కెమెరా ఇస్తున్నారు. 6జీబీ ర్యామ్‌/64జీబీ అంతర్గత మెమొరీ వేరియంట్ ధర రూ. 9,999.  


లావా మైజెడ్‌ 

ఇవేకాకుండా లావా మైజెడ్ కస్టమైజబుల్‌ పేరుతో మనకు నచ్చిన ర్యామ్‌, స్టోరేజీ, వెనక కెమెరా, సెల్ఫీ కెమెరా, ఫోన్‌ కలర్‌ వంటి ఫీచర్స్‌ని ఎంచుకుని ఫోన్‌ని రూపొందించుకునే అవకాశాన్ని కల్పిస్తున్నారు. ఈ కస్టమైజబుల్ ఫోన్‌ ధర రూ. 6,999 నుంచి రూ.10,500 మధ్య ఉంటుంది. మైజెడ్ సహా జెడ్‌2, జెడ్‌4, జెడ్‌6 అమ్మకాలు జనవరి 11 నుంచి, జెడ్‌1 అమ్మకాలు జనవరి 26 నుంచి ప్రారంభమవుతాయి. అమెజాన్‌, లావా ఈ-స్టోర్‌తో పాటు అన్ని మొబైల్‌ స్టోర్లలో వీటిని కొనుగోలు చెయ్యొచ్చు. 


లావా బీఫిట్‌ 

లావా ఫిట్‌నెస్‌ బ్యాండ్‌లో చిన్నపాటి కలర్‌ డిస్‌ప్లేతో పాటు కింది భాగంలో టచ్‌ సెన్సిటివ్ బటన్‌ ఇస్తున్నారు. శరీర ఉష్ణోగ్రత, హార్ట్‌రేట్, ఎస్‌పీఓ2 మానిటరింగ్ ఫీచర్స్‌తో పాటు ఆటో స్లీప్‌ మోడ్‌ ఉన్నాయి. ఇంకా ఎస్సెమ్మెస్‌, ఈ-మెయిల్, సోషల్ మీడియా నోటిఫికేషన్‌ అలర్ట్‌ ఉంది. జీపీఎస్‌ ట్రాకింగ్, సెడెంటరీ రిమైండర్స్‌ (ఎక్కువసేపు కదలకుండా ఒకే చోటులో కూర్చుకుంటే లేచి కొంత సేపు నడవమని సూచిస్తుంది), వైబ్రేషన్‌ అలర్ట్, రన్నింగ్ ప్లాన్స్‌, యాక్టివిటీ ట్రాకింగ్ వంటివి ఉన్నాయి. అయితే బీఫిట్‌లో ఎలాంటి బ్యాటరీ ఉపయోగించారు, ఎంతసేపు ఛార్జింగ్ ఉంటుంది వంటి వాటి గురించి సమాచారం లేదు. దీని ధర రూ. 2,699. జనవరి 26 నుంచి అమెజాన్‌, లావా వెబ్‌సైట్‌తో పాటు అన్ని మొబైల్‌ స్టోర్లలో కొనుగోలు చెయ్యొచ్చు. బ్లాక్ కలర్‌లో లభిస్తుంది.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని