
Smartphone Technology: 2022 స్మార్ట్‌ఫోన్ మోడల్స్.. ఎలాంటిఫీచర్లతో వస్తాయంటే..!
ఇంటర్నెట్‌డెస్క్: కొత్త ఒక వింత.. పాత ఒక రోత అన్నట్లుగా ఉంటాయి ప్రతి ఏడాది మార్కెట్లోకి వచ్చే స్మార్ట్‌ఫోన్ మోడల్స్. మొబైల్ కంపెనీలు ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లతో కొత్త మోడళ్లను తీసుకొస్తూ యూజర్స్‌ను ఆకట్టుకుంటున్నాయి. అలా 2021లో స్మార్ట్‌ఫోన్ మోడళ్లలో ఎన్నో రకాల మార్పులు చోటుచేసుకున్నాయి. మరి 2021 ముగిసి.. 2022లోకి వచ్చేశాం. కొత్త ఏడాదిలో స్మార్ట్ఫోన్లలో రాబోతున్న కొత్త ఫీచర్లు, మార్పులపై ఓ లుక్కేద్దాం.
5జీ కనెక్టివిటీ
దశాబ్ద కాలం నిరీక్షణకు తెరదించుతూ 2022లో భారత్‌లోని 13 ప్రధాన నగరాల్లో (హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, లఖ్‌నవూ, ముంబయి, పుణె, అహ్మదాబాద్, చండీగఢ్, దిల్లీ, గాంధీనగర్, గుర్గావ్, జామ్‌నగర్, కోల్‌కతా) 5జీ నెట్వర్క్ అందుబాటులోకి రానున్నట్లు టెలికాం విభాగం (డాట్) తెలిపింది. మొబైల్ నెట్వర్క్ టెక్నాలజీలో విప్లవాత్మకమైన సాంకేతికతగా చెప్పుకొనే 5జీ నెట్వర్క్ భారత్‌లో అందుబాటులోకి రానుండటం కొత్త ఏడాదిలో మొబైల్ ఫోన్ రంగంలో పెద్ద మార్పుగా చెప్పుకోవచ్చు. గతేడాది నుంచే మొబైల్ ఫోన్ తయారీ కంపెనీలు 5జీ సాంకేతికతతో కూడిన ఫోన్లలను మార్కెట్లోకి విడుదల చేయడం ప్రారంభించాయి. 2022లో విడుదలయ్యే అన్ని మోడల్స్ 5జీ నెట్‌వర్క్‌ను సపోర్ట్ చేస్తాయని టెక్ వర్గాలు భావిస్తున్నాయి.
120 హెర్జ్ రిఫ్రెష్ రేట్ డిస్ప్లే
గతేడాదిలో వచ్చిన మొబైల్ డిస్ప్లేలలో 60 హెర్జ్ రిఫ్రెష్ రేట్ నుంచి 144 హెర్జ్ రిఫ్రెష్ రేట్‌తో వచ్చాయి. వీటిలో 90 హెర్జ్ రిఫ్రెష్ రేట్ ఉన్న డిస్‌ప్లేలే ఎక్కువగా ఉన్నాయి. అయితే 2022లో 120 హెర్జ్ రిఫ్రెష్ రేట్ డిస్ప్లేతో ఎక్కువ ఫోన్లు రానున్నాయి. ఇప్పటికే షావోమి, వన్‌ప్లస్, రియల్మీ, ఐక్యూ వంటి మొబైల్ కంపెనీలు కొత్త ఏడాదిలో విడుదల చేయబోయే మోడల్స్‌లో హై రిజల్యూషన్ డిస్ప్లే ఇస్తున్నట్లు ప్రకటించాయి. దీంతో 2022లో 90 హెర్జ్ రిఫ్రెష్ రేట్ సాధారణ కేటగిరిలో, 120 హెర్జ్ స్టాండర్డ్‌లో, 144 హెర్జ్ రిఫ్రెష్ రేట్ డిస్ప్లే ప్రీమియం ఫోన్లలో ఇస్తారని టెక్ వర్గాల అంచనా.
పంచ్ హోల్ & అండర్ డిస్ప్లే
ఇప్పటి వరకు విడుదలైన ఫోన్లలో ఎక్కువ శాతం నాచ్, వాటర్ డ్రాప్ డిస్ప్లేతో వచ్చాయి. తర్వాత పంచ్ డిప్‌ప్లేతో స్మార్ట్ఫోన్లు విడుదలయ్యాయి. దీంతో 2022లో పంచ్ హోల్ డిస్ప్లే మొబైల్ ఇండస్ట్రీ స్టాండర్డ్‌గా టెక్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ప్రస్తుతం మొబైల్ తయారీ కంపెనీలు నాచ్, డ్యూ డ్రాప్/వాటర్ డ్రాప్, పంచ్ హోల్ డిస్ప్లే రకాలను ఉపయోగిస్తున్నాయి. అయితే త్వరలో మొబైల్ కంపెనీలు విడుదల చేసే ఫోన్లలో ఎక్కువగా పంచ్ హోల్ డిస్‌ప్లేకే మొగ్గు చూపుతున్నాయట. ఈ డిస్ప్లే వల్ల స్క్రీన్‌లో ఎక్కువ భాగం డిస్ప్లే ఉంటుంది. యాపిల్ కంపెనీ 2022లో విడుదల చేయబోయే ఐఫోన్ 14 సిరీస్‌లో నాచ్ డిస్ప్లే స్థానంలో పంచ్ హోల్ డిస్ప్లే ఉంటుందని సమాచారం. వీటితోపాటు 2022లో కెమెరా అండర్ డిప్‌ప్లే ఫోన్లు కూడా అందుబాటులోకి రానున్నాయి.
మరిన్ని మడత ఫోన్లు
2022లో మొబైల్ మార్కెట్లో మడత ఫోన్లు ఎక్కువగా రానున్నాయి. ఈ సెగ్మెంట్లో ముందు వరుసలో ఉన్న శాంసంగ్, మోటోరోలా, ఎల్జీ కంపెనీలకు పోటీగా షావోమి, రియల్మీ, వివో, ఒప్పో వంటి కంపెనీలు మడత పోన్లను మార్కెట్లోకి తీసుకొచ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాయి. ప్రస్తుతం శాంసంగ్ ఫోల్డింగ్ ఫోన్ల ధర రూ.లక్ష పైనే ఉండటంతో, యూజర్స్‌ను ఆకర్షించేందుకు అంతకన్నా తక్కువ ధరకే కొత్త ఫోన్లలను విడుదల చేయాలని కంపెనీలు భావిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఒప్పో తన తొలి మడత ఫోన్ ఫైండ్ఎన్ను భారత మార్కెట్లోకి విడుదల చేయనుంది.
కెమెరాలు
గతేడాది స్మార్ట్‌ఫోన్ కెమెరాల్లో ఎక్కువగా వెనుకవైపు మూడు కెమెరాలున్న మోడల్స్ వచ్చాయి. 2022లో వాటి స్థానంలో క్వాడ్ కెమెరా (నాలుగు కెమెరాలు) ఫీచర్ ప్రామాణికం కానుంది. వాటిలో ఒక కెమెరా 50 ఎంపీగా ఉండటం సర్వసాధారణం అవుతుందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. అలానే 8 ఎంపీ, 16 ఎంపీగా ఉన్న సెల్ఫీ కెమెరాల స్థానంలో ఇక మీదట 32 ఎంపీ కెమెరాలు వస్తాయని అంచనా. ఇప్పటికే రూ.20 వేల లోపు ధరల్లో అందుబాటులో ఉన్న కొన్ని మోడల్స్‌లో 64 ఎంపీ, 50 ఎంపీ, 32 ఎంపీ సెల్ఫీ కెమెరాలను అమర్చారు. ఈ ఏడాదిలో విడుదలయ్యే మోడల్స్‌లో కెమెరా పరంగా మరింత మెరుగైన ఫీచర్స్ యూజర్స్‌కు అందుబాటులోకి రానున్నాయి.
ఫాస్ట్ బ్యాటరీ ఛార్జింగ్ సపోర్ట్
కొత్తగా స్మార్ట్‌ఫోన్ కొంటున్నామంటే ముందు చూసేది బ్యాటరీ. 2022లో విడుదలయ్యే మోడల్స్‌లో అదిరే బ్యాటరీ ఫీచర్స్ యూజర్స్‌కు పరిచయం కానున్నాయి. మొబైల్ కంపెనీలు. ఇప్పటి వరకు 50 వాట్, 60 వాట్గా ఉన్న బ్యాటరీ ఛార్జింగ్ సామర్థ్యాన్ని ఏకంగా 120 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు పెంచేశారు. దీంతో 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ కేవలం 15 నిమిషాల్లో ఛార్జ్ అవుతుంది. త్వరలో విడుదల కానున్న షావోమి 11ఐ సిరీస్ ఫోన్లలో 120 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సామర్థ్యాన్ని పరిచయం చేస్తోంది.
► Read latest Gadgets & Technology News and Telugu News
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.