Year Ender 2022: ఈ ఏడాది వాట్సాప్‌లో వచ్చిన ది బెస్ట్ ఫీచర్లివే!

ఈ ఏడాది కొత్తగా తీసుకొచ్చిన ఫీచర్లతో వాట్సాప్‌ ఫీచర్‌ రిచ్‌ యాప్‌గా మారిపోయింది. దాంతోపాటు ప్రకటనలు సైతం లేకపోవడంతో ప్రపంచవ్యాప్తంగా ఎక్కువమంది ఉపయోగిస్తున్నారు. మరి, 2022లో వాట్సాప్‌ (Year Ender 2022) తీసుకొచ్చిన  ది బెస్ట్‌ ఫీచర్ల వివరాలివే. 

Published : 28 Dec 2022 10:39 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఇతర మెసేజింగ్ యాప్‌లతో పోలిస్తే వాట్సాప్‌ (WhatsApp) ఈ ఏడాది యూజర్లకు ఎక్కువ అడ్వాన్స్‌డ్‌ ఫీచర్స్‌ను పరిచయం చేసింది. కేవలం టెక్స్ట్‌ మెసేజింగ్, కాలింగ్‌కు మాత్రమే పరిమితం కాకుండా పోల్‌, మెసేజ్‌ యువర్‌ సెల్ఫ్‌, యాక్సిడెంటల్‌ డిలీట్, కమ్యూనిటీస్‌ వంటి కొత్త ఫీచర్లతో వాట్సాప్‌ ఫీచర్‌ రిచ్‌ యాప్‌గా మారిపోయింది. అంతేకాదు, మెసేజ్‌లకు ఎండ్‌-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్‌ వంటి పటిష్ఠ భద్రతను సైతం అందిస్తోంది. ఇన్ని రకాల సేవలను అందిస్తున్నా.. ప్రకటనలు మాత్రం చూపించడం లేదు. అందుకే ప్రపంచవ్యాప్తంగా కోట్లాది యూజర్లు కలిగిన యాప్‌గా వాట్సాప్‌ అవతరించింది. ఈ క్రమంలో మరిన్ని కొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు సిద్ధమవుతోంది. మరి, 2022లో వాట్సాప్‌ (Year Ender 2022) తీసుకొచ్చిన ది బెస్ట్‌ ఫీచర్లేంటో ఓ లుక్కేద్దామా!


స్టేటస్‌ను దాచేందుకు (Hide Online Status)

వాట్సాప్‌ ఓపెన్‌ చేసినా కూడా.. ఆన్‌లైన్‌లో ఉన్నట్లు అవతలి వారికి తెలియకుండా ఉండేందుకు హైడ్‌ ఆన్‌లైన్‌ స్టేటస్‌ అనే ఫీచర్‌ను వాట్సాప్ పరిచయం చేసింది. అంతేకాదు.. ఈ ఫీచర్‌తో ఆన్‌లైన్‌ స్టేటస్‌ను ఎవరెవరు చూడాలనేది యూజర్‌ నిర్ణయం తీసుకోవచ్చు. ఈ ఫీచర్‌ కోసం వాట్సాప్ సెట్టింగ్స్‌ ఓపెన్‌ చేసి ప్రైవసీ సెక్షన్‌లోకి వెళితే లాస్ట్‌సీన్‌ అండ్‌ ఆన్‌లైన్‌ అని కనిపిస్తుంది. దాన్ని ఓపెన్ చేసి నచ్చిన ఆప్షన్‌ను ఎంచుకోవచ్చు. 


సింపుల్ రిప్లై కోసం (Message Reaction)

పదాల్లో చెప్పలేని ఎన్నో మాటలు కేవలం భావాల్లో వ్యక్తపరచవచ్చు. ఇదే ఆలోచనతో వాట్సాప్‌ మెసేజ్‌ రియాక్షన్ ఫీచర్‌ను తీసుకొచ్చింది. ఈ ఫీచర్‌తో వాట్సాప్‌లో వచ్చే మెసేజ్‌లకు ఎమోజీలతో స్పందన తెలియజేయొచ్చు. ఇందుకోసం మెసేజ్‌ పక్కనే ఉన్న ఎమోజీ సింబల్‌పై క్లిక్ చేసి యూజర్‌ తనకు నచ్చిన ఎమోజీని పంపొచ్చు. ఈ ఏడాది వాట్సాప్‌ తీసుకొచ్చిన వాటిలో ఇదే ది బెస్ట్‌ ఫీచర్‌గా ఎక్కువ మంది యూజర్లు అభిప్రాయపడుతున్నారు. 


మీకు మీరే మెసేజ్‌ పంపుకోవచ్చు (Message Yourself)

వాట్సాప్‌లో వచ్చిన మెసేజ్‌లు ఏవైనా సేవ్‌ చేసుకోవాలంటే.. డమ్మీ గ్రూపు క్రియేట్ చేసేవారు. కానీ, మీ ఫోన్‌లో వాట్సాప్‌ ఖాతా నుంచి మీ వాట్సాప్‌ నంబర్‌కే మెసేజ్‌ పంపేలా మెసేజ్ యువర్‌సెల్ఫ్‌ పేరుతో వాట్సాప్‌ ఈ ఏడాది కొత్త ఫీచర్‌ను పరిచయం చేసింది. వాట్సాప్ ఓపెన్ చేసిన తర్వాత చాట్ మెసేజ్ ఆప్షన్‌పై క్లిక్ చేస్తే కాంటాక్ట్ లిస్ట్ కనిపిస్తుంది. అందులో మొదట మీ పేరు ఫోన్ నంబర్‌తోపాటు బ్రాకెట్‌లో యూ అని ఉంటుంది. దానిపై క్లిక్‌ చేసి సెల్ఫ్‌ మెసేజ్‌ చేసుకోవచ్చు. 


కొత్త అవతార్‌ (Avatar)

వాట్సాప్‌లో ప్రొఫైల్‌ ఫొటోకు బదులు మన అవతార్‌ ఉంటే బాగుంటుందని ఎంతో మంది కోరుకుంటారు.  దీన్ని దృష్టిలో పెట్టుకునే వాట్సాప్‌ కొత్తగా అవతార్‌ ఫీచర్‌ను పరిచయం చేసింది. ఈ ఫీచర్‌ కోసం వాట్సాప్‌ సెట్టింగ్స్‌ ఓపెన్ చేస్తే అవతార్‌ అనే సెక్షన్‌ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేసి మీకు నచ్చిన రీతిలో అవతార్‌ను క్రియేట్ చేయొచ్చు. కొత్తగా రూపొందించిన అవతార్‌ను ఆత్మీయులతో షేర్‌ చేసుకోవడంతోపాటు.. ప్రొఫైల్‌ పిక్చర్‌గానూ వాడుకోవచ్చు. 


డిలీట్ ఫర్‌ మీ చేసినా నో ప్రాబ్లమ్‌ (Accidental Delete) 

వాట్సాప్‌లో ఈ ఏడాది విడుదలైన వాటిలో మరో బెస్ట్ ఫీచర్‌. పొరపాటుగా ఒకరికి పంపాల్సిన మెసేజ్‌ను మరొకరి పంపి.. డిలీట్ ఫర్‌ ఎవ్రీవన్ బదులు డిలీట్ ఫర్‌ మీ క్లిక్‌ చేసి ఆందోళన పడిపోతుంటాం. ఈ సమస్యకు పరిష్కారంగా వాట్సాప్‌ యాక్సిడెంటల్‌ డిలీట్ ఫీచర్‌ను పరిచయం చేసింది. డిలీట్‌ ఫర్ మీ క్లిక్ చేసిన ఐదు సెకన్ల వరకు స్క్రీన్‌ మీద అన్‌డూ ఆప్షన్‌ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేస్తే డిలీట్ చేసిన మెసేజ్‌ రీస్టోర్ అవుతుంది. మరోసారి దాన్ని సెలెక్ట్ చేసి డిలీట్ ఫర్‌ ఎవ్రీవన్‌ చేస్తే సరిపోతుంది. 


కమ్యూనిటీస్‌ (Communities)

ఒకేసారి ఎక్కువ మందితో సమాచారాన్ని సులువుగా షేర్ చేసుకునేందుకు వీలుగా కమ్యూనిటీస్‌ ఫీచర్‌ను పరిచయం చేశారు. 20 గ్రూప్‌లను ఒకేసారి కమ్యూనిటీస్‌లోకి తీసుకురావచ్చు. అడ్మిన్‌ ఏదైనా సమాచారాన్ని షేర్‌ చేస్తే 20 గ్రూప్‌లలో ఉన్న సభ్యులందరికీ తెలుస్తుంది. వీటికి కూడా ఎండ్‌-టు-ఎండ్‌ ఎన్‌క్రిప్షన్ భద్రత ఉంటుంది.


2 జీబీ ఫైల్‌ షేరింగ్  (2 GB File Sharing)

గతంలో వాట్సాప్‌లో 100 ఎంబీ కన్నా ఎక్కువ సైజు ఉన్న ఫైల్స్‌ను షేర్‌ చేయడం సాధ్యపడేదికాదు. ఇదే విషయమై యూజర్లు పలుమార్లు వాట్సాప్‌నకు విజ్ఞప్తి చేయగా.. 2 జీబీ సైజు ఉన్న మీడియా ఫైల్స్‌ను షేర్‌ చేసేందుకు వీలుగా మార్పులు చేసింది. దీంతో యూజర్లు పెద్ద సైజు మీడియాఫైల్స్‌ను సులువుగా ఇతరులతో షేర్‌ చేసుకోవచ్చు. 


వాట్సాప్‌లో పోలింగ్‌  (WhatsApp Poll)

ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు మెజార్టీ సభ్యుల అభిప్రాయం తెలుసుకునేందుకు వీలుగా వాట్సాప్ పోల్‌ అనే ఫీచర్‌ను తీసుకొచ్చింది. ఇందులో గరిష్ఠంగా 12 ఆప్షన్లు ఉంటాయి.  గ్రూప్‌లోని సభ్యులు ఎవరైనా  పోల్‌ క్రియేట్ చేసి సభ్యులతో షేర్‌ చేస్తే, వారు తమకు నచ్చిన ఆప్షన్‌ను ఎంపిక చేసి పోల్‌లో పాల్గొనవచ్చు. ఈ ఫీచర్‌ కోసం యూజర్లు ఫైల్‌ అటాచ్‌ ఐకాన్‌పై క్లిక్ చేస్తే పోల్ ఆప్షన్‌ కనిపిస్తుంది. దాన్ని ఓపెన్ చేసి పోల్‌ క్రియేట్ చేయొచ్చు. 


లింక్‌తో వీడియో కాల్‌  (Create Call Link)

ఈ ఫీచర్‌తో యూజర్‌ జూమ్‌, గూగుల్ మీట్ తరహాలో లింక్‌ క్రియేట్‌ చేసి వీడియో/ఆడియో కాల్‌ ఇన్విటేషన్‌ పంపవచ్చు. యూజర్లు ఆ లింక్‌ను క్లిక్‌ చేసి నేరుగా వీడియో కాల్‌లో పాల్గొనవచ్చు. ఆన్‌లైన్‌ సమావేశం నిర్వహించాలనుకునే వారికి ఈ ఫీచర్‌ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని వాట్సాప్ అభిప్రాయపడింది. 


గ్రూప్‌ సభ్యులపై పరిమితి లేదు (1024 Group) 

గతంలో ఓ గ్రూపులో గరిష్ఠంగా 256 మందిని సభ్యులుగా చేర్చుకునే వెసులుబాటు ఉండేది. తర్వాత ఆ సంఖ్య 512గా మారింది. ఈ ఏడాది ఆ సంఖ్యను 1024కి పెంచుతూ వాట్సాప్ నిర్ణయం తీసుకుంది. దీనివల్ల ఒకేసారి ఎక్కువ మందితో సమాచారాన్ని సులువుగా షేర్‌ చేయవచ్చు. 


స్టేటస్‌ లింక్‌ ప్రివ్యూ (Rich Preview)

గతంలో వాట్సాప్‌ స్టేటస్‌లో ఏదైనా వెబ్‌ లింక్‌ షేర్‌ చేస్తే కేవలం లింక్‌, దాంతోపాటు ఉన్న టెక్స్ట్‌ మాత్రమే కనిపించేది. దీంతో అది దేనికి సంబంధించిన లింక్‌ అనేది దానిపై క్లిక్ చేస్తే తప్ప తెలిసేది కాదు. వాట్సాప్ కొత్తగా తీసుకొచ్చిన రిచ్‌ ప్రివ్యూ ఫీచర్‌తో స్టేటస్‌లో వెబ్‌ లింక్  షేర్‌ చేస్తే దానికి సంబంధించిన ఫొటో కూడా కనిపిస్తుంది. 

Read latest Technology News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని