
Job Hunting: జాబ్ సెర్చ్‌లో ఉన్నారా? డిజిటల్ ఐడెంటిటీ చెక్ చేసుకోండి!
ఏ వ్యక్తి కెరీర్‌లోనైనా ఉద్యోగమే కీలకం. ఎంత చదివినా సంపాదన లేకుంటే ఇంట్లో వారికీ మనం లోకువే. కాబట్టే ఉద్యోగ వేటలో నిరుద్యోగులు ఎనలేని కష్టాలు ఎదుర్కొంటారు. ఎంత సన్నద్ధమై వెళ్లినా, పనిచేసే సామర్థ్యం మనకున్నా వాటన్నింటినీ పక్కనపెట్టి.. రిక్రూటర్లు ఈ మధ్య అభ్యర్థుల డిజిటల్ ఐడెంటిటీని చెక్ చేస్తున్నారు. అంటే సోషల్ మీడియాలో మీ పాత్రపై కన్నేస్తున్నారు..! దీనికి మనమేం చేయాలి??
ఉద్యోగుల ఎంపికలో రిక్రూటర్లు ముందుగా చేసే పనుల్లో గూగుల్ చేయడం ఒకటి. ఖాళీలు తక్కువగా ఉండి జాబితా ఎక్కువగా ఉంటే అభ్యర్థుల పేర్లను బట్టి గూగుల్‌లో సెర్చ్ చేస్తారు. ఈ పనిని ఏఐ సాయంతో కొన్ని కంపెనీలు చేస్తే.. మరికొన్ని ఉద్యోగులతో చేయిస్తున్నాయి. సోషల్ మీడియాలో మీ యాక్టివిటీని బట్టి గూగుల్ ఆధారంగా కంపెనీలు మీపై ఓ అభిప్రాయానికి వస్తున్నాయి. కాబట్టి మీ పేరుతో మీరే స్వయంగా అప్పుడప్పుడు గూగుల్ చేసుకోవడం మంచిది. ఆపై సామాజిక మాధ్యమాల్లో అభ్యంతరకర, వివాదస్పద పోస్టులు ఉంటే వెంటనే డిలీట్ చేయండి.
ముందుగా వెతకండి: సెర్చ్ చేసిన వివరాలను గూగుల్ పర్సనలైజ్ చేస్తుంది. కాబట్టి గూగుల్‌లో మీ పేరు వెతికే ముందు గూగుల్ అకౌంట్‌తో లాగిన్ అవ్వకుండా ఇన్‌కాగ్నిటో మోడ్‌లో సెర్చ్ చేయండి. నేరుగా పేరుతో కాకుండా మీ పేరుకు తర్వాత site:Facebook.com లేదా twitter.com అని సెర్చ్ చేయండి. తద్వారా ఇతర పేజీల్లోకి వెళ్లకుండా నేరుగా మీ అకౌంట్ పోస్టులనే చూడొచ్చు. ఉదా: Kumar site: Facebook.com, Kumar site: LinkedIn.com అని సెర్చ్ చేయాలి.
సహజమే కానీ: దేశంలో జరిగే సంఘటనలు, చర్చలను బట్టి సామాజిక మాధ్యమాల్లో మనం సహజంగా స్పందిస్తుంటాం. మనకున్న అవగాహన మేరకు ఆ పోస్టులు పెడతాం. కానీ, ఇందులోని కొన్ని పోస్టులు మనకు కరెక్టు అనిపించినా కంపెనీ పాలసీలకు వ్యతిరేకంగా ఉండొచ్చు. అందువల్లే ఉద్యోగ వేటలో ఉన్నప్పుడు ఏదైనా అభ్యంతకర పోస్టులు పెట్టినట్లు మీకు అనిపిస్తే వాటిని డిలీట్ చేసుకోండి. కొన్ని సందర్భాల్లో గూగుల్ అన్ని విషయాలనూ చూపించదు. వాటిని తొలగించడానికి నేరుగా సంబంధిత ఖాతాల్లోకి వెళ్లాల్సి ఉంటుంది.
ట్విటర్‌లో అయితే ఇలా: ట్విటర్ వేదికగా ఎన్నో ట్వీట్లు పెడుతుంటాం. అందులో ఫలానా దాన్ని మాత్రమే డిలీట్ చేయాలంటే వాల్ మొత్తం వెతకాల్సిన పనిలేదు.
* ట్విటర్ ఖాతాలో లాగిన్ అయిన తర్వాత ఇంటర్నెట్ బ్రౌజర్‌లో https://twitter.com/search-advancedఅని సెర్చ్ చేయండి.
* గతంలో మీరు ఏదైనా హ్యాష్‌ట్యాగ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు భావిస్తే, ఆ హ్యాష్‌ట్యాగ్‌ను సంబంధిత లేబుల్ ప్రాంతంలో ఎంటర్ చేయండి.
* అదేవిధంగా అభ్యంతరకర పదాలు, వ్యాఖ్యలు పోస్టు చేసినట్లు గుర్తుంటే వాటినీ ఎంటర్ చేసి వెతకండి. ఆపై వాటిని తొలగించండి.
* ట్విటర్‌లో ట్వీట్లు డిలీట్ చేయడం కోసం https://tweetdelete.net/ లింక్‌ను కూడా ట్రై చేయొచ్చు.
ఫేస్‌బుక్‌లోనూ ఓ ఫీచర్: ఫేస్‌బుక్‌లో ఒకేసారి చాలా పోస్టులు డిలీట్ చేయడానికి ఓ స్మార్ట్ ఫీచర్ అందుబాటులో ఉంది. అదే మేనేజ్ పోస్ట్ (Manage Posts).
* ముందుగా పోస్టులు డిలీట్ చేయాలంటే ఫేస్‌బుక్ యాప్‌లో లాగిన్ అవ్వండి.
* Settings > Activity Log > Manage Postsలోకి వెళ్లండి.
* ఇక్కడ మీరు డిలీట్ చేయాలనుకున్న పోస్టులను ఒక్కొక్కటిగా మార్క్ చేసి అన్నింటినీ ఒకేసారి డిలీట్ కొట్టండి.
* ఇలా మీరు డిలీట్ చేసిన పోస్టులు రీసైకిల్ బిన్ (Trash)లో ఉంటాయి. వాటిని తర్వాత పునరుద్ధరించాలనుకుంటే అలాగే ఉంచండి. లేదంటే Trashలోకి వెళ్లి శాశ్వతంగా డిలీట్ చేయండి.
లింక్డిన్‌లో జాగ్రత్తగా..: లింక్డిన్ పూర్తిగా ప్రొఫెషనల్ నెట్‌వర్క్. ఇందులో రాజకీయ, మత సంబంధిత వివాదస్పద, నెగిటివ్ కామెంట్స్ ఎట్టిపరిస్థితులో పోస్టు చేయొద్దు. ఒక వేళ అలాంటి పోస్టులు మీరు చేసి ఉంటే Me > Posts and Activityలోకి వెళ్లి డిలీట్ చేయండి.
మరోవైపు ఎప్పుడో వాడిన సోషల్ మీడియా ఖాతాలు మీరు ఇప్పుడు వాడనట్లయితే వాటిని పూర్తిగా డిలీట్ లేదా డియాక్టివ్ చేయండి. ఇందుకు ఫేస్‌బుక్‌లో Settings > Personal Information > Manage account లోకి వెళ్లి Deactivation చేయండి. ట్విటర్‌లో అయితే Settings and privacy > Account > Deactivate your account > Deactivate చేయాలి.
చివరగా ఒక్కమాట: మన వ్యక్తిగత జీవనంలో ఆహార్యం ఎంత ముఖ్యమో.. సోషల్ మీడియాలో ఐడెంటిటీ కూడా అంతే. దీన్ని బట్టే కంపెనీలు మన వ్యక్తిత్వాన్ని అంచనా వేస్తున్నాయని చెప్పడంలో అతిశయోక్తి లేదు. మనం పెట్టే పోస్టులు, ఫాలో అయ్యే వ్యక్తులే మన వ్యక్తిత్వానికి అద్దం పడతాయి. అందువల్లే సినీ సెలబ్రిటీలతో పాటు మన వృత్తి జీవితానికి ఉపయోగపడే వ్యక్తులను ఫాలో అవ్వడం మంచిది. ఇది మీ వృత్తి పట్ల మీరు ఎంత నిబద్ధత ఉన్నారో తెలుపుతుంది. కాబట్టి సోషల్ మీడియాలో అభ్యంతకర పోస్టుల డిలీట్ చేయడం అతిగా అనిపించినా.. కాస్త సమయం తీసుకొని చేయాల్సిన పనే.
-ఇంటర్నెట్ డెస్క్
ఇవీ చదవండి
Advertisement