IPhone: ఐఫోన్‌ మాయలు

వచ్చే ఐఓఎస్‌ 18, ఐప్యాడ్‌ఓఎస్‌ 18, మ్యాక్‌ఓఎస్‌ సుకోయాతో బోలెడన్ని కొత్త ఫీచర్లు రానున్నట్టు యాపిల్‌ సంస్థ వార్షిక డెవలపర్‌ సమావేశంలో (డబ్ల్యూడబ్ల్యూడీసీ) ప్రకటించారు.

Published : 19 Jun 2024 00:03 IST

చ్చే ఐఓఎస్‌ 18, ఐప్యాడ్‌ఓఎస్‌ 18, మ్యాక్‌ఓఎస్‌ సుకోయాతో బోలెడన్ని కొత్త ఫీచర్లు రానున్నట్టు యాపిల్‌ సంస్థ వార్షిక డెవలపర్‌ సమావేశంలో (డబ్ల్యూడబ్ల్యూడీసీ) ప్రకటించారు. వీటిల్లో కొన్ని అంతగా ప్రాచుర్యంలోకి రానివీ ఉన్నాయి.

టార్చి లైట్‌: ఐఫోన్‌ 15 ప్రొలో యాక్షన్‌ బటన్‌ను చాలా పనులకు వాడుకోవచ్చు. ఐఓఎస్‌ 18 బీటా వర్షన్‌లో ఫ్లాష్‌లైట్‌ గుర్తు మీద తడితే టార్చి లైట్‌ యానిమేషన్‌ ప్రత్యక్షమవుతుంది. పైకీ కిందికీ కదపటం ద్వారా కాంతి ఎక్కువ, తక్కువ చేసుకోవచ్చు. వేలితో ఎడమ, కుడికి జరిపితే కాంతి పుంజం ఆకారాన్ని మార్చుకోవచ్చు.

విజన్‌ ప్రో మీద టైపింగ్‌: పూర్తిగా కాల్పనిక వాతావరణంలో మునిగి పోయినప్పుడు టైప్‌ చేయాలంటే విజన్‌ ప్రో హెడ్‌సెట్‌ ఇప్పుడు ఒక కీబోర్డును చూపిస్తుంది. సముద్రాలు, నదులు, పచ్చని అడవుల మధ్య షికారు చేస్తూనే డాక్యుమెంట్‌లో టైప్‌ చేయొచ్చు.

క్యాలెండర్‌ మాటామంతీ: క్యాలెండర్, రిమైండర్స్‌ యాప్‌లు ఒకదాంతో మరోటి మాట్లాడుకుంటాయి. క్యాలెండర్‌ యాప్‌ రిమైండర్స్‌ యాప్‌లో నిర్ణయించుకున్న పనులను చూపిస్తుంది. మరోవైపు క్యాలెండర్‌ యాప్‌ నుంచే రిమైండర్లను సృష్టించుకోవచ్చు, సవరించుకోవచ్చు.

పవర్‌ బటన్‌: పునరుద్ధరించిన కంట్రోల్‌ సెంటర్‌లో పూర్తిస్థాయి పవర్‌ బటన్‌ ఉంటుంది. ఇది పైన కుడి మూలన చిన్న బటన్‌లా కనిపిస్తుంది. దీన్ని తడితే ఆపరేటింగ్‌ సిస్టమ్‌కు సంబంధించిన  స్లైడర్‌ విభాగం ప్రత్యక్షమవుతుంది. దీని ద్వారా ఫోన్‌ను ఆఫ్‌ చేసుకోవచ్చు.

కళ్ల ట్రాకింగ్‌: ఐఓఎస్‌ 18 రాకతో ఐఫోన్‌కు చాలా కొత్త ఫీచర్లు జతకానున్నాయి. ఇందులో ఒకటి ఐ ట్రాకింగ్‌. అంటే కేవలం కళ్ల కదలికలతోనే ఫోన్‌ను కంట్రోల్‌ చేయొచ్చన్న మాట.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని