Facebook Messenger: మెసేంజర్‌ కొత్త ఫీచర్లు..చాట్‌కు అదనపు భద్రత, స్క్రీన్‌షాట్ నోటిఫికేషన్

యూజర్‌ చాట్ సంభాషణలకు మెరుగైన భద్రత అందించడంతోపాటు.. చాట్ సంభాషణలు మరింత పారదర్శకంగా జరిగేందుకు మెసేంజర్ సరికొత్త పీచర్లను పరిచయం చేసింది. 

Published : 01 Feb 2022 19:11 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: మెసేంజర్ యాప్‌ను మరింత మంది యూజర్లకు చేరువ చేసేందుకు ఫేస్‌బుక్ మాతృ సంస్థ మెటా ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లను తీసుకొస్తుంది. తాజాగా యూజర్ల భద్రతకు పెద్ద పీట వేస్తూ మరిన్ని కొత్త ఫీచర్లను పరిచయం చేసింది. మరి ఆ ఫీచర్లేంటి, అవి ఎలా పనిచేస్తాయో తెలుసుకుందాం. 


ఎండ్‌-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్‌

వాట్సాప్‌ తరహాలోనే మెసేంజర్‌లో జరిగే చాట్ లేదా గ్రూప్‌ సంభాషణలకు ఎండ్‌-టు-ఎండ్‌ ఎన్‌క్రిప్షన్‌తో భద్రత కల్పించినట్లు సంస్థ వెల్లడించింది. దీంతో యాజర్ల మధ్య జరిగే గ్రూప్‌ చాట్‌, వాయిస్‌, వీడియో కాల్‌ సంభాషణలు మూడో వ్యక్తి యాక్సెస్ చేయలేరని తెలిపింది. దీనివల్ల యూజర్ల  డేటా  భద్రత మరింత మెరుగవుతుందని మెసేంజర్ ప్రొడక్ట్‌ మేనేజర్ తిమోతీ బక్ తెలిపారు. సైబర్ నేరాలు పెరుగుతున్న నేపథ్యంలో యూజర్లకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు ఎండ్‌-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్ ఫీచర్‌ ఎంతో ఉపయోగపడుతుందని తిమోతీ పేర్కొన్నారు. 


స్క్రీన్‌షాట్‌ నోటిఫికేషన్‌

చాట్ ముగిసిన తర్వాత మెసేజ్‌లు వాటంతటవే డిలీట్‌ అయ్యేందుకు వీలుగా మెసేంజర్‌లో డిస్‌అపియరింగ్ మోడ్‌ను పరిచయం చేశారు. తాజాగా ఇందులో అదనపు భ్రదత కోసం మరో కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చారు. దీంతో డిస్‌అపియరింగ్ ద్వారా చాట్ చేసేప్పుడు యూజర్స్‌ మెసేజ్ లేదా మీడియా ఫైల్స్‌ను స్క్రీన్‌షాట్ తీస్తే వెంటనే అవతలి వారికి నోటిఫికేషన్ ద్వారా తెలియజేస్తుంది. దీనివల్ల యూజర్స్ మధ్య చాట్ సంభాషణలు మరింత పారదర్శకంగా, సురక్షితంగా జరుగుతాయని మెసేంజర్ వెల్లడించింది. 


మెసేజ్ రియాక్షన్‌

వాట్సాప్ తరహాలోనే మెసేంజర్‌లో కూడా మెసేజ్ రియాక్షన్ ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు. దీని సాయంతో యూజర్స్ మెసేంజర్‌లోని చాట్‌ సంభాషణలకు ఎమోజీ రియాక్షన్‌తో రిప్లై ఇవ్వవచ్చు. అలానే మెరుగైన చాట్ సంభాషణల కోసం గిఫ్, స్టిక్కర్స్‌ను కూడా అందుబాటులోకి తీసుకొచ్చినట్లు తెలిపింది.  


రిప్లైస్‌ & టైపింగ్ ఇండికేటర్‌

మెసేంజర్‌లో వచ్చే మెసేజ్‌లకు సులువుగా రిప్లై ఇచ్చేందుకు వీలుగా కొత్త ఫీచర్‌ను పరిచయం చేశారు. ఇందుకోసం యూజర్‌ తమ చాట్ పేజ్‌లోని మెసేజ్‌పై లాంగ్ ప్రెస్ చేయాలి. దాంతో యూజర్‌ సులువుగా రిప్లై ఇవ్వడమే కాకుండా సదరు మెసేజ్‌ కాపీ అవుతుంది. అంతేకాకుండా చాట్ పేజ్‌లోని మెసేజ్‌పై స్వైప్ చేసి కూడా రిప్లై ఇవ్వవచ్చు. వాట్సాప్‌లో అవతలి వ్యక్తి మెసేజ్ టైప్‌ చేస్తున్నట్లు మనకు తెలిసేలా ప్రొఫైల్‌ ఇన్ఫో బార్‌ కింద టైపింగ్ అని కనిపిస్తుంది. ఇదే ఫీచర్‌ను టైపింగ్‌ ఇండికేటర్‌ పేరుతో మెసేంజర్‌లో కూడా పరిచయం చేశారు. 


వీటితోపాటు ఫార్వార్డ్ మెసేజ్‌, ఎండ్‌-టు-ఎండ్‌ చాట్‌లకు వెరిఫైడ్ బ్యాడ్జ్‌, లాంగ్ ప్రెస్‌తో మీడియా ఫైల్స్‌ సేవ్ చేసుకునే ఆప్షన్‌ వంటి ఫీచర్లను అందిస్తున్నారు. అలానే ఫొటో, వీడియో ఫైల్స్ పంపే ముందు వాటిని ఎడిట్ చేసుకోవడంతోపాటు, స్టిక్కర్స్‌, టెక్ట్స్‌ యాడ్ చేయడం, క్రాప్‌ చేయడం, ఆడియో ఎడిటింగ్‌ ఫీచర్లను యూజర్లకు అందుబాటులోకి తీసుకొచ్చినట్లు మెసేంజర్ తన బ్లాగ్‌లో పేర్కొంది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని