Microsoft: విండోస్‌ 8.1 ఓఎస్‌ యూజర్లకు మైక్రోసాఫ్ట్ షాక్‌.. అప్‌గ్రేడ్‌ అవ్వాల్సిందే!

కొద్దిరోజుల క్రితం ఇంటర్నెట్‌ ఎక్స్‌ప్లోరర్‌కు శాశ్వత వీడ్కోలు పలికిన మైక్రోసాఫ్ట్, తాజాగా మరో ఓఎస్‌కు గుడ్‌బై చెప్పనుంది. విండోస్‌ 8.1 ఓఎస్‌కు సపోర్ట్ ఉపసంహరించుకున్నట్లు సంస్థ ప్రకటించింది... 

Published : 26 Jun 2022 22:29 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: కొద్దిరోజుల క్రితం ఇంటర్నెట్‌ ఎక్స్‌ప్లోరర్‌కు శాశ్వత వీడ్కోలు పలికిన మైక్రోసాఫ్ట్.. తాజాగా మరో ఓఎస్‌కు గుడ్‌బై చెప్పనుంది. విండోస్‌ 8.1 ఓఎస్‌కు సపోర్ట్ ఉపసంహరించుకోనున్నట్లు సంస్థ ప్రకటించింది. 2023 జనవరి 10 నుంచి విండోస్‌ 8.1 ఓఎస్‌కు సపోర్ట్ ఉండదని మైక్రోసాఫ్ట్ తన సపోర్ట్ పేజీలో పేర్కొంది. దీని వల్ల విండోస్‌ 8.1 ఓఎస్‌ యూజర్లకు మైక్రోసాఫ్ట్ నుంచి సెక్యూరిటీ అప్‌డేట్‌లు నిలిచిపోవడమే కాకుండా, ఓఎస్‌కు సంబంధించి ఎలాంటి సేవలూ పొందలేరని తెలిపింది. అలానే మైక్రోసాఫ్ట్ 365 యాప్స్‌ విండోస్‌ 8.1 సపోర్ట్ చేయవని వెల్లడించింది. దీనికి సంబంధించి సమాచారాన్ని యూజర్లకు మైక్రోసాఫ్ట్ నోటిఫికేషన్ల ద్వారా తెలియజేయనుంది.

విండోస్‌ 8.1 యూజర్లు ఏం చేయాలి? 

మైక్రోసాఫ్ట్ సంస్థ 2012లో విండోస్‌ 8 ఓఎస్‌ను తీసుకొచ్చింది. అయితే అందులో కొన్ని లోపాలు ఉండటంతో విండోస్‌ 8కు స్టేబుల్ వెర్షన్‌గా 2013లో విండోస్‌ 8.1ను విడుదల చేసింది. తర్వాత రెండు సంవత్సరాలకు దానికి అడ్వాన్స్‌డ్‌ వెర్షన్‌గా 2015లో విండోస్‌ 10ను, 2021లో విండోస్‌ 11ను తీసుకొచ్చింది. ఈ నేపథ్యంలో యూజర్లకు కొత్త సాంకేతికతను, మెరుగైన భద్రతను అందిచాలనే ఉద్దేశంతో విండోస్‌ 8.1 సేవలు నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. దీంతో ప్రస్తుతం విండోస్‌ 8.1 ఉపయోగిస్తున్న యూజర్లు విండోస్‌ 10 లేదా విండోస్‌ 11కు అప్‌గ్రేడ్ కావాలని సూచించింది. మరోవైపు విండోస్‌ 10కు కూడా 2025 అక్టోబరు 14 నాటికి సపోర్ట్ ఉపసంహరించుకోనున్నట్లు సమాచారం. అందుకే యూజర్లు విండోస్‌ 10కు బదులు విండోస్‌ 11కు అప్‌గ్రేడ్ కావడం ఉత్తమమని టెక్ నిపుణులు సూచిస్తున్నారు. ఒకవేళ విండోస్‌ 11కు అవసరమైన ఫీచర్లు లేని కంప్యూటర్లు ఉపయోగిస్తున్న యూజర్లు విండోస్‌ 10కు అప్‌గ్రేడ్ కావడం మేలంటున్నారు.

మైక్రోసాఫ్ట్ ఏం చెబుతోంది..?

‘‘ప్రస్తుతం మనం ఉపయోగించే కంప్యూటర్లు ఎంతో వేగవంతమైనవి, శక్తివంతమైనవి. వాటిలో చాలా వరకు విండోస్‌ 11 ఓఎస్‌తోనే వస్తున్నాయి. పాత కంప్యూటర్లలోని హార్డ్‌వేర్‌ ఫీచర్లు విండోస్‌ 10, 11 ఓఎస్‌లను సపోర్ట్ చేయవు. కాబట్టి యూజర్లు తప్పక తమ కంప్యూటర్లతో పాటు ఓఎస్‌ను అప్‌గ్రేడ్‌ చేసుకోవాల్సి ఉంటుంది’’ అని మైక్రోసాప్ట్‌ సపోర్ట్ పేజీలో పేర్కొంది. మరోవైపు మైక్రోసాఫ్ట్ 365 వ్యక్తిగత యూజర్ల కోసం డిఫెండర్‌ యాంటీవైరస్‌ను విడుదల చేసింది. విండోస్‌, ఐఓఎస్, ఆండ్రాయిడ్, మాక్ ఓఎస్‌ యూజర్లు తమ కంప్యూటర్లును వైరస్‌ బారి నుంచి కాపాడుకునేందుకు డిఫెండర్‌ను ఉపయోగించుకోవచ్చు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని