e-KYC Frauds: ఈ-కేవైసీ మోసాలు.. యూజర్స్‌కు మొబైల్‌ నెట్‌వర్క్‌లసూచనలు!

ఈ-కేవైసీ, నకిలీ ఎస్సెమ్మెస్‌ల ద్వారా జరిగే మోసాలు ఎక్కువవుతున్న నేపథ్యంలో నెట్‌వర్క్ ఆపరేటింగ్ కంపెనీలు వినియోగదారులకు కొన్ని సూచనలు చేశాయి. 

Updated : 28 Dec 2021 18:54 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఈ-కేవైసీ (e-KYC), నకిలీ ఎస్సెమ్మెస్‌ లింక్‌ ద్వారా జరిగే సైబర్‌ నేరాల సంఖ్య క్రమంగా పెరుగుతున్నట్లు తాజా నివేదికల్లో బహిర్గతమయింది. సైబర్‌ నేరాల గురించి ప్రభుత్వం, ప్రయివేటు రంగ సంస్థలు వినియోగదారులకు అవగాహన కల్పిస్తున్నప్పటికీ కొత్త మార్గాల్లో సైబర్‌ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారు.  కొద్దిరోజుల్లో న్యూ ఇయర్‌, సంక్రాంతి పండుగ, రిపబ్లిక్‌ డే వంటి ప్రత్యేకమైన రోజులు ఉండటంతో ఈ-కేవైసీ, ఆఫర్లు పేరిట వచ్చే ఎస్సెమ్మెస్‌పట్ల అప్రమత్తంగా ఉండాలని మొబైల్‌ నెట్‌వర్క్ ఆపరేటింగ్ కంపెనీలు వినియోగదారులకు సూచించాయి. వాటితోపాటు మరికొన్ని కీలక సూచనలు చేశాయి. 

1️⃣ ఈ-కేవైసీ వెరిఫికేషన్ అంటూ వచ్చే ఫోన్‌కాల్స్‌, మెసేజ్‌లకు స్పందించవద్దని సూచించాయి. సైబర్‌ నేరగాళ్లు నకిలీ లింక్‌లను ఎస్సెమ్మెస్‌ల ద్వారా పంపి ఈ-కేవైసీ ప్రక్రియ పూర్తి చేయమని సూచిస్తారు. అలాంటి లింక్‌లపై ఎట్టి పరిస్థితుల్లోనూ క్లిక్ చేయొద్దని నెట్‌వర్క్‌ ఆపరేటింగ్ కంపెనీలు కోరుతున్నాయి. 

 

2️⃣ కేవైసీ అప్‌డేట్‌ కోసం ఎలాంటి యాప్‌లు డౌన్‌లోడ్ చేయొద్దని, నెట్‌వర్క్ ఆపరేటింగ్‌ కంపెనీలు యూజర్స్‌ను థర్డ్‌ పార్టీ యాప్‌లు డౌన్‌లోడ్‌ చేయమని ఎప్పుడూ కోరవని తెలిపాయి. ఒకవేళ ఫోన్‌కు యాప్‌ డౌన్‌లోడ్ చేయమని సూచిస్తూ మెసేజ్ వచ్చినా, కాల్ చేసి చెప్పినా వాటి జోలికి వెళ్లవద్దని సూచించింది. అలాంటి యాప్‌లో మీ వివరాలు నమోదు చేస్తే అవి హ్యాకర్స్ చేతికి చిక్కే ప్రమాదం ఉందని తెలిపింది. 

 

3️⃣ కస్టమర్‌ కేర్ నుంచి ఫోన్ చేస్తున్నట్లు నమ్మిస్తూ ఆధార్‌, ఓటీపీ లేదా బ్యాంక్‌ ఖాతాల గురించి వివరాలు అడిగే వారితో అప్రమత్తంగా ఉండాలని సూచించాయి. ఒకవేళ సదరు వివరాలు ఇవ్వకపోతే మీ ఫోన్ కనెక్షన్ కట్‌ అవుతుందని ఫోన్‌లో చెప్పినా, మెసేజ్ పంపినా వాటిని నమ్మవద్దని మొబైల్ నెట్‌వర్క్ కంపెనీలు కోరుతున్నాయి. మిమ్మల్ని ఎవరైనా అలా అడిగితే వారితో సమాచారం పంచుకోవద్దని సూచిస్తున్నాయి. ఈ మధ్య కాలంలో ఈ తరహా మోసాలు ఎక్కువగా నమోదవుతున్నట్లు తెలిపాయి. 

 

4️⃣ ఈ-కేవైసీ కోసం ఈ నంబర్‌కు కాల్ చేయండి అంటూ కొన్నిసార్లు మన ఫోన్‌కు ఎస్సెమ్మెస్‌లు వస్తుంటాయి. అలాంటి మెసేజ్‌లలో ఉండే నంబర్లకు కాల్ చేయొద్దని నెట్‌వర్క్ ఆపరేటింగ్ సంస్థలు సూచిస్తున్నాయి. అలాంటి నంబర్లకు కాల్ చేయడం వల్ల మీ ఫోన్‌ నంబర్‌కు లింక్‌ అయిన బ్యాంక్‌, ఆధార్‌, పాన్‌కార్డ్‌లకు సంబంధించిన సున్నితమైన సమాచారం సైబర్ నేరగాళ్లు చేరే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నాయి. 

 

5️⃣ మొబైల్‌ నెట్‌వర్క్ ఆపరేటింగ్ కంపెనీలు కూడా వినియోగదారులు క్లిక్ చేయమని లింక్‌లు, అటాచ్‌మెంట్ ఫైల్స్‌ పంపవని తెలిపాయి. నెట్‌వర్క్‌ ఆపరేటింగ్ కంపెనీలు అందించే ఆఫర్లు, కొత్త ప్లాన్స్, ఇతరత్రా సమాచారం కోసం ప్లేస్టోర్, యాప్‌ స్టోర్‌ నుంచి అధికారిక యాప్‌లను మాత్రమే డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచించాయి. అలానే కంపెనీ వెబ్‌సైట్‌ల ద్వారా సమాచారం తెలుసుకోవడంతోపాటు, యాప్‌లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చని తెలిపాయి. 

Read latest Gadgets & Technology News and Telugu News

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని